పుష్ప – ది రైజ్‌ మూవీ రివ్యూ

Published On: December 17, 2021   |   Posted By:

పుష్ప – ది రైజ్‌ మూవీ రివ్యూ

కేజీF:బన్ని ‘పుష్ప – ది రైజ్‌’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👎

ఈ సీజన్ లో సినీ లవర్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘పుష్ప – ది రైజ్‌’. బాహుబలి,కేజీఎఫ్ తరహాలో రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ చిత్రం భారీ ఎత్తున బహు భాషల్లో రిలీజైంది. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత బన్నీ చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావటం, గతంలో ఇదే దర్శకుడు కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాడటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపధ్యంలో థియోటర్స్ లో దిగిన ‘పుష్ప’ఏ స్దాయిలో మనలని మెప్పించాడు…నచ్చేలా ఉన్నాడా..నచ్చుబాటు చేసుకోవాలా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఎర్ర చందనం స్మగుల్ చేసే లారీ డ్రైవర్ పుష్ప రాజ్ (అల్లు అర్జున్) . అతనికి ఉన్నదే ఒకటే కల, జీవితాశయం, లక్ష్యం..అదే తనున్న బిజినెస్ లో కూలీగా మిగిలిపోకూడదని, టాప్ ప్లేస్ కు చేరాలన్నది . అందుకోసం ఎంతకైనా తెగించే తెగింపు ఉన్నోడు, ఎదుటి వాడి చేత బలుపు ఉంది అనిపించుకునేవాడు అయిత పుష్ప …తనకు ఎదురైన పరిస్దితులను తన ఎదుగుదలకు అవకాశాలు గా మార్చుకోవాలనుకుంటాడు. మొదట తన తనను చేరదీసిన కొండారెడ్డి(అజయ్ ఘోష్ ) కు సలహాలు ఇచ్చి రైట్ హ్యాండ్ గా మారతాడు. ఆ తర్వాత కొండారెడ్డికు బాస్ అయిన మంగళం శ్రీను (సునీల్ )కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలెడతాడు. దూకుడుగా ప్రవర్తించి ఓ టైమ్ లో మంగళం శ్రీను కే మంగళం పాడే ప్రయత్నం మొదలెడతాడు. మంగళం శ్రీను ..తక్కువ రేటుకు ఎర్ర చందనం కొని ఎక్కువ రేటుకు అమ్ముతూంటాడు. ఆ విషయం తెలుసుకుని మహా ముదురు అనుకున్న మంగళం శ్రీనుకే పుష్ప వార్నింగిచ్చి.. ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ముందుకు వెళ్లి మగాడైపోతాడు. ఈ క్రమంలో ఎందరినో ఎదుర్కొంటాడు. ఎన్నో దెబ్బలు తింటాడు. దెబ్బలు తిన్న ప్రతీ సారీ రాటుతేలతాడు. కానీ చివరకు పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌(ఫహద్‌ ఫాజిల్‌) దగ్గర బెండ్ అవ్వాల్సిన పరిస్దితి వస్తుంది. అక్కడ నుంచి పుష్పరాజ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? శ్రీవల్లి(రష్మిక) ప్రేమను ఎలా పొంది, ఎలా పెళ్లి కు దారితీసేలా చేసుకున్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఈ సినిమా ఆ మధ్యన పెద్ద హిట్టైన కేజీఎఫ్ కు ఫారెస్ట్ వెర్షన్. కేజీఎఫ్ లాగానే ఓ ప్రక్క మదర్ ఎమోషన్, మరో ప్రక్క అందరినీ దాటుకుంటూ పైకెళ్లాలనే హీరో తపన ఇందులో కనపడతాయి. ఈ క్రమంలో చాలా నెగిటివ్ క్యారక్టర్స్ పరిచయం అవుతాయి. అయితే అవన్ని అలా వచ్చి వెళ్లి పోతాయే తప్పకథలో కీ రోల్ పోషించవు. ఎప్పుడైతే స్ట్రాంగ్ విలన్ కథలో లేకుండా పోయారో అప్పుడే కథ లో కాంప్లిక్ట్స్ తగ్గిపోయి డ్రామా మిస్సైంది. కేవలం డైలాగులు, కొన్ని యాక్షన్ సీన్స్ కే ఈ సినిమా పరిమితమైపోయింది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన “నార్కోస్” సిరీస్ కూడా ఒక్కోసారి గుర్తు వస్తుంది. అయితే అవన్ని ఫస్టాఫ్ కే పరిమితం అయ్యిపోయాయి. సెకండాఫ్ పూర్తిగా నీరశపడిపోయింది. ఇంట్రవెల్ దగ్గర సునీల్ పాత్ర కు వార్నింగ్ ఇస్తే అక్కడ నుంచి కథ..సునీల్ యాక్టివ్ అయ్యి పరుగెడుతుందని భావిస్తాము. కానీ సునీల్ పాత్రను గాలి తీసేసినట్లు చేసేసారు. సీన్స్ వస్తూంటాయి పోతూంటాయి. కానీ మధ్య కాంప్లిక్ట్ ఎక్కడా కనపడదు. అలాగే హీరో కు ఇంటి పేరు అని అవమానించే ట్రాక్ సినిమా మొత్తం సాగుతుంది. అది విసిగిస్తుంది. సెకండాఫ్ స్టార్టైన అరగంట కు ఫహాద్ ఫాజిల్ పాత్ర ఎంటరయ్యే వరకు కథలో ట్విస్ట్ అనేది,హీరోకు థ్రెట్ అనేది ఉండదు. పూర్తిగా ప్యాసివ్ యాక్షన్ క్యారక్టర్ గా పుష్ప పాత్ర సాగుతుంది. ఈ పాత్ర యాక్షన్ కనపడుతుంది కానీ ప్యాసివ్ గా ఉండిపోతుంది. సునీల్, అజయ్ ఘోష్, అనసూయ, శత్రు, రావురమేష్, ధనుంజయ్ ఇలా ఇంతమంది సైన్యంలా విలన్స్ ఉన్నా పుష్పరాజ్ ని అడ్డుకునే వాళ్లు లేకపోవటం, అతన్ని సమస్యలో పడేయపోవటమే స్క్రిప్టు ప్రధాన సమస్య. హీరో పాత్రను ఎక్కువగా ప్రేమించి..ఆ పాత్రకు అన్ని పవర్స్ ఇచ్చి మిగతా పాత్రలను అటు వైపు వెళ్లకుండా కట్టడి చేయటమే ముంచేసింది. ఎమోషన్స్ విషయానికి వస్తే…ఫస్టాఫ్ లో హీరో నేప‌థ్యాన్ని, త‌న తండ్రి చ‌నిపోయాక ప‌రిస్థితులు లతో మ్యానే చేసారు. . ప్రతి సీన్ హీరో పాత్రను ఎలివేట్‌ చేసేలా తీర్చిదిద్దిన విధానం..ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉండచ్చేమో ..కానీ మిగతా వారికి విసుగ్గా ఉంటుందని మర్చిపోయారు. పార్ట్ 2కు ఇచ్చిన లీడ్ అయితే దారణంగా ఉంది.

టెక్నికల్ గా…

స్క్రిప్టు పరంగా ఎన్నో లోపాలతో చేసిన ఈ సినిమా …డైరక్షన్ పరంగా సుక్కూ మార్క్ కనపడదు. అయితే టెక్నికల్ గా మిగతా విభాగాలన్ని పోటీ పడే చేసాయని చెప్పాలి. సినిమాటోగ్రాఫర్‌ కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్. అద్బుతమైన విజువల్స్ ,యాక్షన్ సీన్స్ తెరపై పరుచుకుంటూ పోయారు. ఇక ఈ సినిమాకు ఇద్దరు ఎడిటర్లు పనిచేసినా ఎందుకనో లెంగ్త్ మాత్రం తగ్గించలేకపోయారు. మినిమం అరగంట సినిమాలేపేయాలనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్. తెరపైనా బాగున్నాయి. ‘సామి సామి…’, ‘ఊ అంటావా…’, ‘ఏ బిడ్డా…’, ‘చూపే బంగారమాయెనే…’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బాగుండాలనిపిస్తుంది. ఓ ప్రొడక్షన్‌ డిజైనర్లు, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌,యాక్షన్ కొరియోగ్రాఫర్ పడిన కష్టం తెరపై ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది .విఎఫ్ఎక్స్ కూడా యావరేజ్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూుస్ మాత్రం కేక.

సమంత చేసిన స్పెషల్ సాంగ్ విజువల్స్ బాగున్నాయి., బన్నీ ఎప్పటిలాగే డ్యాన్స్ తో, కొత్త కొత్త స్టెప్స్ తో ఫ్యాన్స్ కు పండగ చేసారు. సినిమాలో మెయిన్ ట్విస్ట్ వచ్చే ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ పాట అయితే స్పెషల్ గా డిజైన్ చేసారు. అల్లు అర్జున్, రష్మిక మధ్య లవ్ సీన్స్ జస్ట్ ఓకే .

ఎవరెలా చేసారు…

సినిమా పూర్తి స్దాయిలో నచ్చినా నచ్చకపోయినా ఒకటి మాత్రం ఒప్పుకు తీరాలి. బన్నీ చేసిన యాక్టింగ్ కి ఆయన తప్ప సినిమాలో ఎవరూ కనిపించలేదు. దానితో పాటు చిత్తూరు యాసలో డైలాగ్ డెలివరీ మామూలుగా లేదు. ఇక ‘పుష్ప’ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్,ఫారెస్ట్ ఫైట్‌ ఓ రేంజ్ లో ఉన్నాయి. సుక్కు, బన్ని కష్టం బాగా కనపడుతుంది. ఇక రష్మిక ఈ సినిమాలో కొత్తగా కనిపించింది. ఇక మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సెకాండఫ్‌లో ఎంట్రీ ఇచ్చినా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. మంగళం శ్రీను గా సునీల్ కొత్తగా కనిపించాడు. అలాగే.. అతడి భార్య దాక్షాయణిగా అనసూయ పాత్రని చాలా రా అండ్ బోల్డ్ గా ఉంది. ఇక సమంత ఐటం సాంగ్ విషయానికి వస్తే..ముందెన్నడూ ఆ స్థాయిలో ఆమె గ్లామర్ ఒలికించలేదు. ఊ అంటావా మావా ఊఊ అంటావా అంటూ అనే పాటలో ఆమె డ్యాన్స్ అదరకొట్టింది.

చూడచ్చా

‘పుష్ప’ బన్నీ వన్ మ్యాన్ షో .ఆ షో చూడటానికే సినిమాకు వెళ్లాలి. అంతకు మించి ఎక్సపెక్ట్ చేయద్దు

ఎవరవెరు…

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా
నటీనటలు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం:
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్
లిరిసిస్ట్: చంద్రబోస్
క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్
మేకప్: నాని భారతి
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా
రన్ టైమ్:179 నిముషాలు
విడుదల తేదీ:17, డిసెంబర్ 2021