పెళ్లి సందD మూవీ రివ్యూ
పెళ్లి సందD రివ్యూ
Emotional Engagement Emoji (EEE) :
‘
పాతికేళ్ల కిందం ‘పెళ్లి సందడి’ పెద్ద హిట్. ఆ పాటలు ఇప్పటికీ అప్పడప్పుడూ టీవీల్లో వినపడుతూనే ఉంటాయి. అలరిస్తూనే ఉంటాయి. మళ్లీ ఇంతకాలానికి అదే టైటిల్ తో అందులో హీరోగా చేసిన శ్రీకాంత్ తనయుడు రోషన్ ని హీరోగా నటింపచేస్తూ ఓ ప్రాజెక్టు రూపొందింది అంటే ఓ వర్గంలో ఆసక్తి ఉంటుంది. అలాగే అప్పటి సినిమాకి దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావు ఇప్పటి సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం, ఆయన ఓ కీలక పాత్రలో కూడా నటించడం ఈ సినిమా స్పెషాలిటిగా కనిపిస్తుంది. మరి ఈ కొత్త పెళ్లి సందడి ఎలా ఉంది? ఈ కాలం కుర్రాళ్ల యూత్ పల్స్ ని పట్టుకోగలిగారా.. పాతికేళ్ల కిందట సినిమా స్దాయిని ఈ చిత్రం అందుకుంటుందా?రాఘవేంద్రరావు బ్రాండ్ వర్కవుట్ అయ్యిందా.. పెళ్లి బ్యాండ్ లా మిగిలిపోయిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
మాయ (శివాని రాజశేఖర్) అనే ఓ దర్శకురాలు ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత అయిన వశిష్ట (కె.రాఘవేంద్రరావు) బయోపిక్ తీయాలని అనుకుంటుంది. బయిట ప్రపంచానికి ఈ జనరేషన్ కు తెలియని ఆయన స్టోరీ తెలుసుకునేందుకు మాయ తండ్రి (రాజేంద్రప్రసాద్) రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో ప్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. పాతికేళ్ల క్రితం వశిష్ట (రోషన్) కుర్రాడు… ఒక పెళ్ళిలో సహస్ర (శ్రీలీల)ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. కానీ ఆమె తండ్రి(ప్రకాష్ రాజ్) ఆ పెళ్లికి ఒప్పుకోడు. అందుకు కారణం సహస్ర అక్క (వితిక షేరు) తీసుకున్న డెసిషన్. దాంతో ఆ ప్రేమికులు ఇద్దరినీ విడిపోతారు. తన అక్క తీసుకున్న డెసిషన్ ఏమిటి…ఎలా వశిష్ట, సహస్ర ఒకటయ్యారు. ప్రేమ జర్నిలో అడ్డంకులును ఎలా దాటారు వంటి విషయాలతో మిగతా కథ నడుస్తుంది.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్..
ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ టైటిల్ పెట్టుకుని రావడంతో హైప్ అంతో ఇంతో వచ్చింది. అలాగే ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా క్యాస్టింగ్ తో పాటు ప్రొడక్షన్ ని కూడా భారీగా సెట్ చేయటం కూడా సినిమాపై ఆసక్తి కలిగించింది. నిర్మలా కాన్వెంట్ మొదటి సినిమా అయినప్పటికీ ఈ సినిమానే రోషన్ డెబ్యూగా చెబుతూ వచ్చిన శ్రీకాంత్ ఆశలను ఈ మాడరన్ పెళ్లి సందడి నిలబెట్టిందా అంటే లేదనే చెప్పాలి.
కొంతమంది డైరక్టర్స్ పాత,కొత్త ఎలాంటి పాయింట్ ని అయినా ఎఫెక్టివ్ గా నేరేట్ చేసి సక్సెస్ అవుతారు. కానీ దర్శకురాలు గౌరీ రోణంకి మాత్రం ఆ విషయంలోనే ఫెయిల్ అయ్యారు. స్క్రిప్టు ఇరవై ఏళ్ళ క్రితంది, స్మాల్ స్క్రీన్ మెటీరియల్. అలాంటి దానిని తీసుకొచ్చి నేరుగా వెండితెర మీద కొత్త హీరోతో చేస్తే ఏమవుతుంది. అచ్చం ఈ పెళ్లి సందడిలా ఉంటుంది. దానికి తోడు ఈ కథని హ్యాండిల్ చేయటం కూడా ఓల్డ్ గా చేసారు. దాంతో ఎప్పుడో తీసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసారనిపిస్తుంది. ఇలాంటి లవ్ స్టోరీలుకు ప్రధాన టార్గెట్ ఆడియన్స్ యూత్. వాళ్లు ఇలాంటి సినిమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. రాఘవేంద్రరావుగారి దర్శకత్వ పర్యవేక్షణ నలభల్లో ఉన్నవాళ్లకు ఆసక్తి కలిగించవచ్చేమో కానీ ఈ జనరేషన్ వాళ్లకు కాదు. సిల్లీ కామెడీ, అవుట్ డేటెడ్ రొమాంటిక్ ట్రాక్ ఈ సినిమాని ముంచేసాయి. అలాగే ఇలాంటి రొమాంటిక్ స్టోరీ అనుకున్నప్పుడు ప్రధానంగా చూసేది పెయిర్ మధ్య లవ్, రొమాన్స్ . కానీ సినిమాలో అవి పండలేదు. అంతకు మించి కథ గురించి మాట్లాడుకోవటానికి ,విశ్లేషించటానికి పెద్దగా ఏమీ లేదు. ధిన్ లైన్..బోరింగ్ ట్రీట్మెంట్. పోసాని పుట్టు రిచ్ సీక్వెన్స్, వెన్నెల కిషోర్ బుద్ది శాలి ట్రాక్ అసలు పేలలేదు.
టెక్నికల్ గా …
ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి గారు తప్ప మిగతా టెక్నీషియన్స్ కూడా పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదనే చెప్పాలి. రెండు పాటలు బాగా ఉన్నాయి. రాఘవేంద్రరావుగారు పర్యవేక్షించినట్లు అనిపించేలా మ్యూజిక్ , డాన్స్ డైరక్షన్ బాగున్నాయి. సునీల్ కుమార్ నిమ్మ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. విజువల్స్ కొన్నిసార్లుచాలా డల్ గా ఉన్నాయి.ఎడిటింగ్ తిమ్మరాజు అయితే ఫుటేజ్ ని ఏమీ ఎడిట్ చేసినట్లు అనిపించదు. ఎక్కడా షార్ప్ గా ఉండదు. నువ్వంటే నాకు, మాయ నగరిలో… పాటలు అందులో హీరోయిన్ ని చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. బాహుబలి వంటి పెద్ద సినిమా చేసిన ఆర్కా మీడియా నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇలాంటి సినిమా అసలు ఊహించము. అసలు ఈ కథ ఎలా ఓకే చేసారు అనే డౌట్ వస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే..
తన కొడుకు రోషన్‌ను హీరో చేయడానికే శ్రీకాంత్ ఇలాంటి సినిమా ఎన్నుకోవటం ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకుముందు కూడా రోషన్ చేత తొందరపడి ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమా ని చేయించాడు. అదీ ఔట్ డేటెడ్ సినిమానే . అప్పుడు అక్కినేని నాగార్జున ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి ఆయన్ని నమ్మారు. ఇప్పుడు రాఘవేంద్రరావు దర్శకుడు వెనక ప్రాజెక్టులో ఉన్నారని నమ్మి ఉండచ్చు. ఏదైనా ఈ సినిమా రోషన్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చినట్లే. అయితే రోషన్ మాత్రం బాగా చేసాడు. అతనికి మంచి కథ పడితే నిలబడతాడు. ఇక హీరోయిన్ గా చేసిన అమ్మాయి చూడ్డానికి,స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. యాక్టింగ్ వైజ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. రాఘవేంద్రరావు తొలిసారి తెరపై కనిపించారు. అంతే తప్ప ఆ పాత్రపై పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఆర్టిస్ట్ లంతా తెరపై కనిపించారు. కానీ ఏమీ వర్కవుట్ కాలేదు.
చూడచ్చా…
పాత ‘పెళ్లి సందడి’ మళ్లీ చూడటం బెస్ట్. అంతగా రోషన్ కోసం చూడాలనిపిస్తే టీవిలోనో,ఓటీటిలోనో వచ్చేదాకా ఆగటం మరీ బెస్ట్.
తెర వెనక..ముందు
నటీనటులు: రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు;
సంగీతం: ఎం.ఎం.కీరవాణి;
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ;
ఎడిటర్: తమ్మిరాజు;
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి;
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని;
దర్శకత్వ పర్యవేక్షణ: కె.రాఘవేంద్రరావు బి.ఎ;
దర్శకత్వం: గౌరీ రోణంకి;
రన్ టైమ్: 2గంటల 22నిముషాలు
విడుదల: 15-10-2021