Reading Time: 3 mins

పొన్నియిన్ సెల్వన్ – 2 (పి ఎస్ -2) మూవీ రివ్యూ

మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ – మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

రక్త చరిత్రతో మొదలైన పార్ట్ 1, 2 కల్చర్ బాహుబలితో మరింత ముందుకు వెళ్లి, కేజీ ఎఫ్ తో సెటిలయ్యి…ఇప్పుడు న ‘పొన్నియిన్ సెల్వన్ 2’  గా మన ముందుకు వచ్చింది. మణిరత్నం సినిమాకు ఉండే క్రేజ్ నిజానికి ఈ సినిమాకు కనపడలేదు. అందుకు కారణం తొలి పార్ట్ పెద్దగా మనవాళ్లకు ఎక్కకపోవటమే. అయితే దిల్ రాజు వంటి స్టార్ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేసిన సినిమా కావటంతో మంచి థియేటర్స్ పడ్డాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో ఎలా ఉందో చూద్దాం.

కథేమిటంటే :

ఇది మొదటి పార్ట్ కు కంటిన్యూషన్… నందిని (ఐశ్వర్య రాయ్) .. చోళ యువరాజు ఆదిత్య కరికాలన్ (విక్రమ్) టీనేజ్ ప్రేమ కథతో మొదలవుతుంది. అయితే ఆదిత్య కరికాలన్ కుటుంబ సభ్యులు, ఆ విషయం కరికాలన్ కు తెలియకుండా ఆమెను అంతఃపురం నుంచి గెంటేస్తారు. అలాంటి పరిస్థితుల్లో వీరపాండ్య మహారాజు ఆమెను చేరదీసి కూతురిలా చూస్తాడు. ఆమె కళ్ల ఎదుటనే అతనిని ఆదిత్య కరికాలుడు అంతం చేస్తాడు. తన కుమారుడైన అమరభుజంగుడికి సింహాసనం దక్కేలా చేయమని వీరపాండ్యుడు నందిని దగ్గర మాట తీసుకుని చనిపోతాడు. తండ్రిలాంటి ఆయనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, చోళరాజ్యాన్ని .. ఆ రాజ్యానికి రక్షక కవచంలా ఉన్న తన మాజీ ప్రేమికుడు ఆదిత్య కరికాలుడిని అంతం చేయడానికి నందిని సిద్ధపడుతుంది.

మరో ప్రక్క సముద్రంలో మునిగిపోయాడనుకున్న అరుళ్ మొళి ( జయం రవి), అతని సన్నిహితుడైన వల్లభ దేవన్ ( కార్తి) వల్ల బ్రతికి బయటపడతారు. ఈ విషయం తెలిసి, అతని తండ్రి సుందర చోళుడు (ప్రకాశ్ రాజ్) అతని తోబొట్టువులైన ఆదిత్య కరికాలన్ .. కుందవై (త్రిష) సంతోష పడతారు. పాండ్య రాజులకు ఇచ్చిన మాట కోసం చోళ రాజ్యాన్ని దెబ్బతీయడానికి ఒక వైపున రవిదాసతో కలిసి నందిని ప్రయత్నిస్తూ ఉంటారు.  ఇలా రెండు వైపుల నుంచి చోళ రాజ్యాన్ని ప్రమాదం చుట్టుముడుతూ ఉంటుంది.  చోళ రాజులైన సుందరచోళుడు .. ఆదిత్య కరికాలుడు .. అరుళ్ మొళి ఈ ముగ్గురిని ఒకే రోజున అంతం చేయాలని నందిని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు తప్పించుకున్నా పాండ్యులను బ్రతకనీయరని ఆమెకి తెలుసు. ఓ పౌర్ణమి రోజున ఆ ముగ్గురు చావుకు ఆమె ముహూర్తం పెడుతుంది. తన మాట కాదనడనే ఉద్దేశంతో, తనని కలవడానికి రమ్మని చెప్పి ఆదిత్య కరికాలన్ కి కబురు పంపుతుంది. ఆమె పథకం ఫలిస్తుందా? చోళ రాజ్యంపై పాండ్యులు పట్టుసాధిస్తారా? అనేదే కథ.

విశ్లేషణ :

చిరంజీవి వాయిస్ ఓవ‌ర్‌తో అస‌లు క‌థ‌లోకి ప్ర‌వేశించే ఈ కథ …కల్కి కృష్ణమూర్తి’ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. చోళరాజులు – పాండ్య రాజుల మధ్య జరిగే వ్యూహ ప్రతి వ్యూహాలతో ఈ కథ నడుస్తుంది. ఫస్టు పార్టుకు తమిళనాట మాత్రమే విశేషమైన ఆదరణ లభించింది. అయితే ఈ సినిమా చోళ,పాండ్య రాజుల కథ గురించి అవగాహన ఉంటేనే అర్దమవుతుంది. లేకపోతే కేవలం విజువల్స్, స్టార్ హీరోల నటన చూస్తూ కూర్చోవాలి. అయితే మణిరత్నం వంటి దర్శకుడు ఆ కాలం నాటి సెట్టింగ్ లు, వాతావరణాన్ని క్రియేట్ చేసి సినిమాని మనకు దగ్గర చేసే ప్రయత్నం చేసారు.

అలాగే ఐశ్వర్య రాయ్ తల్లీ కూతుళ్లుగా రెండు పాత్రలలో కనిపించటం ఆసక్తిగా ఉంటుంది.  తల్లి పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ .. అందులో ఉన్న ట్విస్ట్ కూడా ఇంట్రెస్టింగ్.  ఓ విధంగా ఈ సినిమా చూస్తూంటే మనకు ఓ నవలను చదువుతున్న ఫీల్ కలుగుతుంది. మణిరత్నం అలాగే భావించి తీసారేమో కానీ పాండ్య రాజులకు సంబంధించిన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి విషయంపై దృష్టిపెట్టడం .. ప్రతి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయడంలో ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ దాకా కథ మెల్లిగా నత్త నడక నడిచినా, ఆ తర్వాత ఊపందుకుని పరుగెడుతుంది. క్లైమాక్స్ మంచి ఉత్కంఠతతో సాగుతుంది. సెకాండాఫ్ లో సుందర చోళుడిని మందాకిని కాపాడే సీన్ .. కడంబూర్ కోటలో తనని చంపడానికి నందిని  ప్లాన్ చేసిందని తెలిసి కూడా ఆదిత్య కరికాలన్ అక్కడికి వెళ్లే సీన్స్ ఓ రేంజిలో ఉంటాయి.

ప్లస్ పాయింట్స్:

క్యారక్టర్స్ డిజైన్
మణిరత్నం టేకింగ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫొటోగ్రఫీ
లొకేషన్స్.

మైనస్ పాయింట్స్:

స్లోగా సాగే కథనం
రొమాన్స్ ని వదిలేయటం.
కీలకమైన పాత్రలు లేకుండా  ఒక భారీ యుద్ధం పెట్టడం

టెక్నికల్ గా :

మణిరత్నం దర్శకత్వం అనగానే మనకు హై స్టాండర్డ్స్ కనపడతాయి. అదే విధంగా ఈ సినిమా కూడా టెక్నికల్ గా బ్రిలియెంట్ గా ఉంది. అయితే  ఏ ఆర్ రెహ్మాన్ సంగీతంలో గొప్ప పాటలు లేవు.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్బుతంగా ఉంది. రవి వర్మన్ ఫొటోగ్రఫీ  సినిమాకి హైలైట్. ఇ ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వర్క్ చక్కగా ఉంది. తనికెళ్ల భరణి తెలుగు డైలాగ్స్ జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. న‌వ‌ల‌లోనే సినిమాకి కావ‌ల్సినంత డ్రామా ఉంది. దాన్ని ప‌క్కాగా తెర‌పైకి తీసుకొచ్చారు ద‌ర్శ‌కుడు.

ఫెరఫార్మెన్స్ వైజ్ చూస్తే :

విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య‌రాయ్ పాత్ర‌లు ఓ రేంజిలో చేసుకుంటూ పోయారు. విక్ర‌మ్ పాత్ర తెరపై కనపడేది తక్కువే కానీ ఇంపాక్ట్ ఎక్కువ. ఐశ్వ‌ర్య‌రాయ్ పాత్ర  రెండు కోణాల్లో సాగి ఆకట్టుకుంటుంది. కార్తీ, జ‌యం ర‌వి ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యారు.  కుంద‌వై పాత్ర‌లో  త్రిష త‌న అందంతో మతిపోగొడుతుంది. ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి, శోభితా ధూళిపాళ్ల‌,  శ‌ర‌త్‌కుమార్‌, పార్తీబ‌న్‌, విక్ర‌మ్ ప్ర‌భు, ప్ర‌భు, రెహ‌మాన్ త‌దిత‌రులు ప‌రిధి మేర‌కు న‌టించారు.

చూడచ్చా :

ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ..మణిరత్నం తీసిన ఈ విజువల్ వండర్ కాస్త మనస్సు పెడితే మనస్సుకు పడుతుంది.

నటీనటులు :

విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌, జయరాం, ప్రభు, శరత్‌కుమార్‌, పార్తిబన్‌, రెహమాన్‌, విక్రమ్‌ ప్రభు తదితరులు.

సాంకేతికవర్గం :

సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌
ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాతలు: మణిరత్నం, శుభాష్‌ కరణ్‌
స్క్రీన్‌ప్లే: మణిరత్నం, బి.జయమోహన్‌, కుమర్‌వేల్‌
Running time: 165 minutes
దర్శకత్వం: మణిరత్నం
విడుదల: 28-04-2023