ప‌వ‌ర్ స్టార్‌ మూవీ రివ్యూ

Published On: July 25, 2020   |   Posted By:

ఏంటిది సార్… ‘ప‌వ‌ర్ స్టార్‌’ (రివ్యూ)

రేటింగ్: 1/5

ట్విట్టర్ ఎంతోకాలం నుంచో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఆయన ఈ సారి ఏకంగా సినిమానే చేసేసారు. అది పెద్ద దుమారమే రేపింది. ఎంతలా అంటే పవన్ ఫ్యాన్స్ పూనుకుని వర్మకు వ్యతిరేకంగా ఓ సినిమానే తీసి రిలీజ్ చేసేటంత. కేవలం ట్రైలర్ ద్వారా ఆయన సెన్సేషన్ క్రియేట్ చేసారు. దాంతో సినిమాలో ఏముందనే చర్చ మీడియాలో,సోషల్ మీడియాలో మొదలైంది. తమ అభిమాన హీరో పరువుకు భంగం కలిగేలా ఆర్జీవీ సినిమా ఉందని పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ని ఆయన ఏ విధంగా చూపెట్టబోతున్నారు. ఆయన జీవితంలో ఏ అంశాలు స్పృశించబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాలో ఏం చూపించారు. అసలు కథేంటి..పవన్ అభిమానులు బాధపడే విధంగా ఎపిసోడ్స్ ఉన్నాయా…వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

పవర్ స్టార్ ప్ర‌వ‌ణ్ క‌ల్యాణ్ ఎన్నికల్లో నిలబడ్డ రెండు చోట్లా ఓడిపోతాడు. ఆ డిప్రెషన్ లో ఉన్న అతనికి ఇంట్లో తన అన్నల ఇద్దర నుంచి పోటు మొదలవుతుంది. ఓ అన్నయ్య స్టార్ మెగా…చక్కగా సినిమాలు చేసుకోక మనకెందుకు ఈ రాజకీయాలు అన్నట్లు మాట్లాడుతూంటాడు. మరో అన్నయ్య…వేరే వాళ్లు అన్నమాటలను మాట మాటకి గుర్తు చేస్తూ విసిగిస్తూంటాడు. ఇది చాలదన్నట్లు ఇంట్లో రష్యన్ భార్య ఈ విషయం ఏంటో అర్దం కాక చూస్తూంటుంది. వీళ్లందిరనీ ప్రక్కన పెట్టి బయిటకు వస్తే..అక్కడ నిర్మాత గుండ్ల రమేష్ ..ఓడిపోవటమే మంచిదైందని, తనకు డేట్స్ ఇవ్వమని పీకుతూంటాడు. మరో దర్శకుడు అయితే వచ్చే ఎలక్షన్ గ్యాప్ లో సినిమా చేసేద్దాం అని విసిగిస్తూంటాడు. ఈ క్రమంలో తన డిప్రెషన్ కు తోడుగా వీళ్లందరి పీకుడుకు విసుగెత్తిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు రామ్ గోపాల్ వర్మ ఆయన దగ్గరకు వస్తాడు. అప్పుడు ఏమైంది. అసలు వర్మ ఎందుకు పవన్ దగ్గరకు వచ్చాడు అనేది మిగతా కథ.

కథ,కథనం

ఈ సినిమాలో నిజానికి కథ, స్క్రీన్ ప్లే వంటివేమీ లేవు. ఉన్నదల్లా తనకు తోచిన పాత్రలు రాసుకుంటూ పోయిన వర్మ దూకుడుతనమే. పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేస్తున్నాను అనుకుంటూ తనపై సెటైర్స్ వేయించుకునేంతలా సినిమాలను దిగజార్చేసాడు. అయినా ఈ 32 నిముషాల ఎపిసోడ్ ని సినిమా అనకూడదు. కేవలం వర్మ …పవన్ రాజకీయాల్లో ఫెయిల్యూర్ అవటంపై తన ఆలోచనలకు కొంత ఊహలు అద్ది వదిలారు. ఇది ఓ రకంగా పవన్ కళ్యాణ్ కు పనికొచ్చేదే. ఇందులో నిజముంటే ఆత్మ విమర్శ చేసుకునే అవకాసం ఇస్తుంది. లేదంటే వర్మ ఊహలపై ఉమ్మేయబుద్దేస్తుంది. త్రివిక్రమ్ ని పవన్ కళ్యాణ్ సరిగ్గా తనకు ఎలక్షన్ స్పీచ్ లు రాసివ్వలేదని కొట్టాడు వంటివి చూస్తూంటే ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాగే ఆయన ఫ్యామిలీ లైఫ్ ని టచ్ చేయటం కూడా పద్దతి అనిపించుకోదు. పూణే నుంచి ఫోన్ వచ్చిందని రష్యన్ భార్య అనుమానంగా చూడటం వంటివి వర్మ వంటి దర్శకుడు ఊహించి తెరపై ఎక్కించటం తనను తాను దిగజార్చుకోవటమే అనిపిస్తుంది. గాసిప్ లు ప్రత్యేకంగా వెబ్ సైట్స్ లో గాసిప్స్ అని రాసి మరీ ప్రచురిస్తాయి. వాళ్లు కూడా ఇలాంటి గాసిప్స్ రాయటానికి జంకుతారు. కానీ వర్మ …ఒకప్పటి కాగడా పత్రిక లాగ తనకు తోచింది రాసి,తెరకెక్కించుకుంటూ పోయారు.

ఇందుకోసం కథ, కథనం వంటివి పెట్టుకోలేదు. కాబట్టి మనకు కూడా ఏదో యూట్యూబ్ వీడియో చూసినట్లు ఉంటుంది కానీ సినిమా చూసిన పీలింగ్ రాదు. ఏదైమైనా కరోనా సమయంలో సినిమా పరిశ్రమలో దాదాపు అందరూ ఖాళీగా కూర్చూంటే…వర్మ మాత్రం వరస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు అని అభినందించాలా లేక… వాటిని మార్కెట్ చేసుకునేందుకు ఆయన ఎంచుకున్న మార్గమే ఇలా ఉందని తిట్టిపోయాలా తెలియని స్దితికి తీసుకెళ్తున్నారీ సినీ మేధావి.

టెక్నికల్ గా

ఈ సినిమాలో టెక్నికల్ విలువలంటూ ఏమీ లేవు. వర్మ గత చిత్రాల మాదిరిగా కూడా లేదు. నానాటికి తీసికట్టు నాగం బొట్లు అన్న చందంగా వర్మ తనను తాను దిగజార్చుకుంటూ వెల్తున్నారు. ఇంతకు ముందు ఆయన సినిమాలు ఫెయిలైనా అందులో టెక్నికల్ విలువలు, షాట్ మేకింగ్ ఆయనకే సాధ్యం అన్నట్లుగా ఉండేవి. ఇప్పుడు అదేమీ లేదు. ఏదో ఓ అరగంట వీడియో తీసి, దానికో ట్రైలర్, పోస్టర్స్ చేసి క్రేజ్ చేసి క్యాష్ చేసుకునే పోగ్రామ్ పెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్ర‌వ‌న్ గా చేసిన న‌టుడు గురించి. ..పవన్ కళ్యాణ్ ని చాలా సీన్స్ లో యాజటీజ్ దింపేసాడు అంటే అతిశయోక్తి కాదు.

చూడచ్చా…

అరగంటే కాబట్టి ధైర్యం చేయచ్చు..అయితే విషయం ఏమీ లేదని ముందే తెలిస్తే నిరాశ కలగదు.

ఎవరెవరు..

నటీనటులు : ప్రవన్ కళ్యాణ్, కత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మ తదితరులు
సంగీతం : డి ఎస్ ఆర్
సినిమాటోగ్రాఫర్ : జోషి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాణ సంస్థ : ఆర్జీవీ వరల్డ్ థియేటర్
రిలీజ్ డేట్ :25-07- 2020
రన్ టైమ్ :32 నిముషాలు

రిలీజ్ద్ త్రూ: ఆర్జీవీ వరల్డ్ థియేటర్