ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి మూవీ రివ్యూ 

Published On: March 19, 2023   |   Posted By:

ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి మూవీ రివ్యూ 

Emotional Engagement Emoji 

👎

రోమ్‌-కామ్‌ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. యూత్ కు నచ్చే ఈ జానర్ లో కొన్ని మంచి డైలాగులు, సీన్స్, పాటలు ఉంటే చాలు.  తెలిసిన కథే అయినా.. కాస్త కొత్తగా చెబితే దర్శకుడు గట్టెక్కేసినట్లే అన్న ధైర్య ఉంటుంది.  దాదాపు అదే ఫార్ములాతో శ్రీనివాస్‌ అవసరాల దాదాపు ఏడేళ్లు గ్యాప్‌ తీసుకుని ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో మెగాఫోన్‌ పట్టాడు. నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ వారం రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉంది…కథేంటి,యూత్ ని కనెక్ట్ చేయగలిగారా వంటి విషయాలు రివ్యూలో  చూద్దాం.

స్టోరీ లైన్:

ఓ అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య ప‌రిచ‌యం, స్నేహం, ప్రేమ‌, అల‌క‌లు, చిరుకోపాలు.. ఈ  మూమెంట్స్ కలిసిన కొన్నిసీక్వెన్స్ ల సమాహారం ఈ సినిమా. అనగనగా ఓ ఫ‌లానా అబ్బాయి సంజ‌య్ (నాగ‌శౌర్య‌). ఓ ఫ‌లానా అమ్మాయి అనుప‌మ (మాళ‌వికా నాయ‌ర్‌). వైజాగ్ లో ఇంజినీరింగ్ చదివేటప్పుడు పరిచయం..ఆ తర్వాత ప్రెండ్షిప్..ఆ తర్వాత ప్రేమ. లండన్ లో సహజీవనం. ఆ తర్వాత బ్రేకప్. మళ్లీ వాళ్లిద్దరూ కలుసుకున్నారా లేదా ?   వీళ్లిద్ద‌రూ ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చింది? అనేదే ఈ సినిమా.

విశ్లేషణ:

ఈ సినిమా ఎనౌన్సమెంట్ అయిన నాటి నుంచి ఈ సినిమాపై ఓ వర్గం  ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయనటంలో సందేహం లేదు.  పైగా అవసరాల, నాగ శౌర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలను ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకోవటంతో అవి కాస్తంత ధృడంగా మారాయి. అయితే సినిమా అందుకు తగ్గట్లుగా లేదని మార్నింగ్ షోకే తేలిపోయింది. అందుకు కారణం..అనుకున్న స్దాయిలో కొద్దిగా కూడా లేకపోవటం.  ఎపిసోడిక్ గా నడిచే ఈ సినిమా స్లో గాఉందని, కామెడీ సీన్లు సరిగ్గా పండలేదనేది అందరి కంప్లైట్. సినిమా మొదలైన పది నిమిషాలకే దర్శకుడు కథలోకి తీసుకెళ్లాడు. దాంతో ఆ తొలి పదినిమిషాలు సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అయితే అక్కడితోనే అది ఆగిపోయింది. అదే ఇంట్రెస్ట్‌ను దర్శకుడు చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయాడు. కొన్ని సీన్లు అయితే మరీ బోరింగ్‌గా ఉన్నాయి. ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్దం కాని సిట్యువేషన్. అసలు ఇది ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద తెరకెక్కించిన శ్రీనివాస్‌ అవసరాల సినిమానేనా అనే డౌట్‌ కూడా వస్తుంది ఓ టైమ్ లో . ఇక  సినిమా ప్ర‌మోష‌న్ల‌లో `నేను బిఫోర్ స‌న్‌సెట్ లాంటి సినిమా తీస్తున్నా` అంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్‌. `బిఫోర్ స‌న్‌సెట్` హాలీవుడ్ క్లాసిక్‌! ఎవ‌ర్ గ్రీన్ ఫిల్మ్‌. దాన్ని అలా చూసి ఎంజాయ్ చేసేయాలి తప్పించి అలాంటి సినిమా తీయాలని ప్రయత్నిస్తే మాత్రం బోల్తాపడతారని అవసరాల అర్దం చేసుకోలేకపోయారు. ఇక అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌లో మంచి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉందని గత సినిమాలు మనకు చెప్తాయి. ఈ సినిమాలోనూ  ప్ర‌తీ సీన్‌లోనూ అది క‌నిపించే ప్రయత్నం చేసారు. అయితే వెన్ను పూస లాంటి కథ లేకుండా ఎన్ని సీన్స్  ఉన్నా లాభమేంటి.. సినిమాకు అవసరమైన కాంప్లిక్ట్ అనేది ప్రక్కన పడేసారు.  ఇంటర్వెల్ బ్యాంగ్   కావాలి కాబట్టి ఓ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్  తీసుకొచ్చి విశ్రాంతి కార్డు వేశారు. అదీ అసహజంగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే మరీను. ఏదైమైనా ఇది స్క్రిప్టు ఫెయిల్యూర్ ఫిల్మ్ అని గట్టిగా చెప్పచ్చు.

టెక్నికల్ గా :

సినిమాటోగ్రఫీ నీట్ గా బాగుంది. సంగీతం ఓ వర్గానికి నచ్చేలా ఉంది. అయితే స్క్రిప్టు దశలోనే నీరసంగా ఉంది.”ఇది చాలా సహజంగా ఉండే సినిమా. పాత్రలు.. సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. నిజంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అంత సహజంగా ఉండాలని తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ స్క్రిప్టెడ్ అయితే సహజత్వం పోతుంది. అందుకే తెర మీద వ్యక్తులు నిజంగా మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది”.. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా ఎలా ఉండబోతోందో వివరిస్తూ అ చిట్ చాట్లో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ చెప్పిన మాటలివి. ఆ ప్రయత్నం చేసారు కానీ అది వర్కవుట్ కాలేదు. ఎడిటింగ్ ఇంత స్లో ప్రయాణాన్ని స్పీడప్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.దర్శకుడుగా అవసరాల తనలోని రైటర్ ని  కాస్త కంట్రోలు చేస్తే బాగుండేది.

నటీనటుల్లో :

నాగశౌర్య ఎప్పటిలాగే  బాగా చేసారు.  ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో సాగే సినిమా కోసం అతను రకరకాల లుక్ లలో కనిపించాడు. అందుకోసం కష్టపడ్డాడు. మాళవిక నాయర్ కూడా బాగా చేసింది.  నటన పరంగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. అవసరాల తన కోసం రాసుకున్న పాత్రలో కిక్ లేదు.  మేఘా చౌదరి ,మిగతా వాళ్లు జస్ట్ ఓకే.

చూడచ్చా :

ఓ టీ తాగి చక్కగా ఓటిటిలో చూడదగ్గ సినిమా

తారాగణం :

నాగ శౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్, మేఘా చౌదరి, శ్రీవిద్య, హరిణి, అభిషేక్ మహర్షి, సౌమ్య వారణాసి

సాంకేతికవర్గం :

సంగీతం: కళ్యాణి మాలిక్
ఎడిటింగ్: కిరణ్ గంటి
కెమెరా: సునీల్ కుమార్ వర్మ
నిర్మాత: విశ్వ ప్రసాద్
దర్సకత్వం: శ్రీనివాస్ అవసరాల
Run Time: 2 hrs 9mins
విడుదల తేదీ: 17 మార్చ్ 2023