ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ రివ్యూ

Published On: September 3, 2022   |   Posted By:
ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ రివ్యూ
image.png
Emotional Engagement Emoji (EEE)
👎    👎

కొన్ని సినిమాలు పట్ల ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఆ సినిమాకు పనిచేసిన వాళ్ల పేర్లు చూసాక..సినిమా మంచి విజయం సాధిస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి పేరు అనుదీప్ కేవి. ‘జాతిరత్నాలు’ చిత్రంతో తెగ నవ్వించి పెద్ద హిట్ సాధించాడు. అతనే కథ,మాటలు రాసి తన పర్యవేక్షణలో తన శిష్యుల చేత సినిమా చేయిస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ నిర్మిస్తోంది..అలాంటి ఇలాంటి బ్యానర్ కాదు…శంకరాభరణం, స్వాతిముత్యం వంటి ఎన్నో క్లాసిక్స్ తీసిన పూర్ణోదయా బ్యానర్. ఇంకేం కావాలి. మరి సినిమా ఆ స్దాయిలో ఉందా..కథేంటి?స్టోరీలైన్:

అవి పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’రోజులు. అంటే 2001. తెలంగాణాలోని  నారాయణ్ ఖేడ్ . అక్కడో పవన్ వీరాభిమాని  శ్రీను (శ్రీకాంత్ రెడ్డి). మొదటి రోజు పవన్ సినిమా చూడకపోతే జీవితం వేస్ట్ అన్నది అతని ఫీలింగ్. అతనికో లవర్ లయ (సుచిత బసు) . ఆమె కూడా సేమ్ టు సేమ్. ఆమె ఓ ప్రపోజల్ పెడుతుంది.  ‘ఖుషీ’ సినిమా టిక్కెట్లు తెస్తే, ఫస్ట్ డే ఫస్ట్ షో కలిసి చూద్దామని మాట ఇస్తుంది. తన కోసం, తన ప్రేయసి కోసం శ్రీను సినిమా టిక్కెట్లను సంపాదించడానికి బయిలు దేరతాడు. అయితే మధ్యలో అతని తండ్రి స్కూల్ హెడ్ మాస్టర్ (తణికెళ్లభరణి)కి ఇలాంటివి నచ్చవు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఛస్తారా అని ప్రశ్నస్తాడు. అటు తండ్రి నుంచి తప్పించుకుని శ్రీను ..ఖుషీ సినిమా టిక్కెట్లు ఎలా సంపాదించాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది మిగతా సినిమా కథ.

ఎనాలసిస్:

ఇదో సింగిల్ లైన్ స్టోరీ. సబ్ ప్లాట్ ఉండదు. అలాగే స్టోరీ లైన్ లో బేసిక్ గా ఫన్ లేదు. ఓ సెటైర్ కనిపిస్తుంది. దాన్ని కూడా ఇద్దరు డైరక్టర్స్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పవన్ అభిమానిగా ఉండటం గొప్ప విషయంగా చెప్దామనుకున్నారా లేక అప్పటి కుర్రాళ్లు ఇలా టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారని సెటైర్ గా చెప్దామనుకున్నారా అనేది క్లారిటీ లేదు. సెటైర్ వేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అలాగని ప్లెయిన్ గా తీస్తే చూసేవాళ్లు ఎక్కడా నవ్వురాక హర్ట్ అవుతారు. ముందు చూస్తే గొయ్యి..వెనుక చూస్తే నుయ్యి పరిస్దితి. అందులోనూ ఖషీ రిలీజ్ నాటికి పవన్ ఇంకా సూపర్ స్టార్ కాలేదు. మొదటి రోజు హిట్ టాక్ రాక ముందు టిక్కెట్లు ఈజిగా దొరికాయి. ఇప్పట్లాగా ఆన్ లైన్ లేదు కానీ బ్లాక్ టిక్కెట్ల దందా జరిగేది. కాబట్టి కొద్దిగా డబ్బు ఎగస్ట్రా ఖర్చు పెడితే టిక్కెట్ దొరకటం పెద్ద కష్టమేమీ కాదు. తన లవర్ కోసం ఏ కుర్రాడైనా అదే చేస్తాడు.  అంతేకాని శవంతో పాటు టిక్కెట్లను గోతిలో కప్పేశారని దాన్ని తవ్వే అంత అవసరం, ఆయాసం ఎవరికీ లేదు. ఆ సీన్ సినిమాకు పరాకాష్ఠ!  స్క్రీన్ ప్లే గురించి అయితే  చెప్పుకునేదేమీ లేదు.

టెక్నికల్ గా …

స్క్రిప్టు దశలోనే ఈ సినిమా చీదేసింది. అలాగే సినిమాని చాలా తక్కువలో చుట్టేసారు. టెక్నికల్ గానూ అతి తక్కువ స్టాండర్డ్స్ లో ఉంది. ఉన్నంతలో సంగీత దర్శకుడు రధాన్ ఒక పాటలో తన స్పెషాలిటీ చూపించాడు. నీ నవ్వే.. పాట బాగుది. కానీ సినిమాలో ఆ పాటకు సరైన చిత్రీకరణ చెయ్యలేదు. నేపథ్య సంగీతం చాలా లౌడ్ గా ఉంది. ప్రశాంత్ అంకిరెడ్డి ఛాయాగ్రహణం చాలా సీదా సీదాగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్  అసలు లేవని చెప్పాలి.  ఫైనల్ గా వంశీధర్ గౌడ్.. లక్ష్మీనారాయణల దర్శకత్వ ప్రతిభ గురించి చెప్పాలంటే…షార్ట్ ఫిలిం స్టాండర్డ్స్ లో కూడా సినిమా తియ్యలేకపోయారు. లిప్ సింక్ కూడా సరిగా చూసుకోలేదు.

నటీనటుల్లో …

కొత్త నటుడు శ్రీకాంత్ రెడ్డి  జస్ట్ ఓకే అన్నట్లున్నాడు. నటన ఏమీ రాదని తెలిసిపోతోంది.  అయితే ఈజ్ అయితే ఉంది. హీరోయిన్ సుచిత బసు పాత్ర గురించి చెప్పుకుంటే జాలేస్తుంది. సినిమాలో ఆమె నామమాత్రం.  వెన్నెల కిషోర్ కాస్త  అప్పుడప్పుడూ తెరపై కనిపించి నవ్వించే పోగ్రాం పెట్టుకున్నాడు.  తనికెళ్ల భరణి  రొటీన్  తండ్రి పాత్ర. శ్రీనివాసరెడ్డి ఉన్నా లేనట్లే.  చిత్ర దర్శకుల్లో ఒకడైన వంశీధర్ గౌడ్ కూడా చేసాడు. కానీ అది ఇరిటేటింగ్ గా ఉంది.  జబర్దస్త్ మహేష్.. మిగతా నటీనటులంతా మామూలే.

చూడచ్చా?

సినిమా చివరి దాకా తట్టుకుని చూడటం చాలా కష్టం. ఎంతో ఓపిక,సహనం ఉండాలి.

సంస్థ‌: శ్రీజ ప్రొడ‌క్ష‌న్స్, మిత్ర‌వింద మూవీస్‌;
న‌టీన‌టులు: శ్రీకాంత్‌, సంచిత బ‌సు, వెన్నెల కిషోర్‌, తనికెళ్ల భ‌ర‌ణి, వంశీధ‌ర్ గౌడ్ , రంగ‌స్థ‌లం మ‌హేష్, ప్ర‌భాస్ శ్రీను, సి.వి.ఎల్ న‌ర‌సింహారావు త‌దిత‌రులు;
క‌థ‌, మాట‌లు: అనుదీప్. కె. వి;
సంగీతం: ర‌ధ‌న్‌;
ఛాయాగ్ర‌హ‌ణం: శ్రీకాంత్;
నిర్మాణం: శ్రీజ ఏడిద‌;
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీరామ్ ఏడిద‌;
ద‌ర్శ‌క‌త్వం: వ‌ంశీధ‌ర్ గౌడ్‌, లక్ష్మీనారాయ‌ణ పుట్టంశెట్టి;
Run Time:1h 59m
విడుద‌ల‌: 02-09-2022.