బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి మూవీ రివ్యూ
పాత వీధే:’బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి` మూవీ రివ్యూ
Rating:-1.5/5
కొన్ని టైటిల్స్ చూడగానే…ఈ సినిమా చూడాలిరా అనిపిస్తాయి. కొత్త తరహా అనుభూతిని కలిగిస్తాయోమో అని ఆశను కలిగిస్తాయి. అలాంటి టైటిల్ తో వచ్చిన చిత్రం బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి. దాదాపు అంతా కొత్తవారితో ఓ కొత్త దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం ఈ రోజు ఆహా ఎక్సక్లూజివ్ గా విడుదలైంది. ఈ సినిమా నిజంగానే ప్రెష్ నెస్ తో మనని పలకరిస్తుందా. లేక టైటిల్, ట్రైలర్ వరకే ఆ కొత్తదనం పరిమితం అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్..
బాలు (మున్నా),స్వప్న(దృష్టిక చందర్) ఇద్దరూ చిన్నప్పటినుంచీ ప్రక్క ప్రక్క ఇళ్ళల్లో ఉంటూ పెరిగిన నువ్వే కావాలి బ్యాచ్. వయస్సు తో పాటు…పలకరింపులు కాస్తా పులకరింపులుగా మారాయి. కాలక్రమేణా కౌగిళ్ల కోసం తహతహలాడి ప్రేమలో పడ్డారు. అయితే స్వప్న తండ్రి..కుల పిచ్చోడు. కులమే జీవితాశయం అని నమ్మేవాడు. కులానికి పరువుకి లింక్ పెట్టి…తన కులం పరువు కోసం ఎంతదూరం అయినా వెళ్లేరకం. దాంతో యధావిధిగా తన కూతురు వేరే కులస్దుడుని ప్రేమిస్తే ఒప్పుకోడు….తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఈ క్రమంలో చాలా ప్రేమ జంటల్లాగే వీళ్ళిద్దరూ కూడా పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అక్కడ నుంచి రకరకాల సమస్యలు ఎదురౌతాయి. అవేమిటి..వీరి ప్రేమ సక్సెస్ అయ్యిందా…స్వప్న తండ్రి కుల పిచ్చి తగ్గిందా వంటి విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఆహాలో ఈ సినిమా చూడండి.
ఎలా ఉంది…
ఈ సినిమా కథను దర్శకుడు ఎలా కన్సీవ్ చేసాడో కానీ..ఎక్కడా ఓ చిన్న ట్విస్ట్, ఫీల్ లేకుండా సాగుతుంది. చాలా రొటీన్ గా, ప్రెడిక్టుబుల్ గా ఉంటుంది. పోనీ ఓ ప్రేమ కథ చెప్తున్నారు కదా ఆ ఫీల్ అయినా రన్ అవుతుందేమో అనుకుంటే అదీ ఉండదు. ఏదో వెళ్తూంటుంది. హీరో,హీరోయిన్స్ మధ్యనే కాదు..టెక్నీషియన్స్ మధ్యన కూడా కెమిస్ట్రీ ఉండదు. ఎవరికి తోచినట్లు వాళ్లు వర్క్ చేసుకుంటూ వెళ్లిపోయారు. అసలు చాలా చోట్ల సినిమా చూస్తున్నట్లే అనిపించదు. ఏదో యుట్యూబ్ వీడియో ..ఊసుపోక తీస్తే,మనం చూస్తున్నట్లు ఉంటుంది. అయితే ప్రారంభంలో సెటప్ మాత్రం కాస్త ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. చివరి దాకా దర్శకుడు ఆ ప్లాట్ ని అదే ప్లోలో సస్టైన్ చేయలేకపోయారు. దీనికి కారణం వీక్ రైటింగ్, స్క్రీన్ ప్లే. సినిమాకు సంభందించిన ప్రొసీడింగ్స్ కూడా చాలా డ్రాగ్ అవుతూ మన సహనానికి పరీక్ష పెడతాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తొలిప్రేమ సినిమాకు సైరట్ కలిపినట్లుంది.
టెక్నికల్ గా…
రీరికార్డింగ్ సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయ్యింది. అయితే సినిమాలో హాంటింగ్ చేసే స్దాయిలో లేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. అయితే అక్కడక్కడా కొన్ని డీసెంట్ బ్లాక్ లు లేకపోలేదు. ఎన్ని చేసినా షార్ట్ ఫిలిం ఫీల్ వచ్చేసింది. ఇక ఎడిటింగ్ మరో అరగంట ట్రిమ్ చేస్తే బాగుండును అనిపిస్తుంది. ఇక రైటింగ్ ముఖ్యంగా డైలాగులు చాలా అసంబద్దంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే అయితే పూర్తిగా విసుగెత్తిస్తుంది. దర్శకుడు ఈ విభాగాలన్ని సమన్వయం చేసుకోలేకపోయాడు. ఏదో ఫీల్ లో ఉండి సినిమా చేసుకుంటూ పోయాడు. కానీ ఓవరాల్ అవుట్ పుట్ ని దృష్టిలో పెట్టుకోలేదు.
చెప్పుకోదగినవి
కులపిచ్చితో ఊగిపోయే తండ్రి పాత్ర వేసిన కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ సుబ్బారావు ఈ చిత్రంలో తన పాత్రకు న్యాయం చేసారు. చాలా చోట్ల విజువల్స్ మనకు నచ్చుతాయి. నేటివిటి బాగా సస్టైన్ చేసారు. చిన్నప్పటి ఎపిసోడ్స్ బాగా తీసారు.
చూడచ్చా…
అక్కడక్కడా కొన్ని సీన్స్ తప్ప, ఖచ్చితంగా చూడాలనిపించేటంత విషయం ఉన్న సినిమా కాదు.
ఎవరెవరు..
బ్యానర్ : శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్
నటీనటులు: మున్నా, దృశిక చందర్, రవి వర్మ, ‘కంచరపాలెం’ రాజు, ప్రభావతి, పవిత్ర మొదలైనవారు.
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:కృష్ణ పోలూరు
సంగీతం: మహిరాంశ్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాత: పమిడిముక్కల చంద్రకుమారి
రన్ టైమ్ :2 hrs 2 mins
విడుదల తేదీ:21st August, 2020
రేటింగ్ : 1.5/5