బుట్టబొమ్మ మూవీ రివ్యూ

Published On: February 4, 2023   |   Posted By:

బుట్టబొమ్మ మూవీ రివ్యూ

అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ ‘బుట్టబొమ్మ’ రివ్యూ
Emotional Engagement Emoji 

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన కప్పేలా అనే  సినిమాని తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ చేశారు. గతంలో అజిత్ నటించిన అనేక సినిమాల్లో బాలనటిగా నటించిన అనిఖా సురేంద్రన్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. అలాగే తమిళంలో అనేక హిట్స్ సినిమాలలో భాగమైన అర్జున్ దాస్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడం మరో విషేషం. అందులోనూ  భారీ సూపర్ హిట్ సినిమాలను అందించిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మించడంతో సినిమా మీద ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం

స్టోరీ లైన్:

అరకులోని దూది కొండ ఊళ్లో… మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సత్య (అనిఖా సురేంద్రన్) ది. తన స్దాయిలో ఏవో చిన్న సరదాలతో తన జీవితాన్ని ఆనందంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూంటుంది. టైలరింగ్ చేసే తల్లి, రైసు మిల్లులో పని చేసే తండ్రి, స్కూల్‌కు వెళ్ళే చెల్లి, ఫోన్ తీసుకుని బాయ్ ఫ్రెండుతో మాట్లాడే పక్కింటి ప్రెండ్ ఇదీ ఆమె ప్రపంచం. ఆమె జీవిత లక్ష్యం… ఏడు వేలు పెట్టి కెమెరా ఫోన్ కొనుక్కుని…  రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలని..ఇలా సరదాగా , సాఫీగా సాగుతున్న సత్య జీవితాన్ని ఒక ఫోన్ కాల్ మరో ప్రపంచంలో పడేస్తుంది.  ఫోనులో పరిచయమైన మురళి (సూర్య వశిష్ఠ)ని కనీసం చూడనైనా చూడకుండా ప్రేమలో పడుతుంది. అతనో ఆటో డ్రైవర్. ఈలోగా ఆమె ఇంట్లో పెళ్లి సంబంధం ఖాయంతో చేయడంతో సూర్యను చూడటం కోసం విశాఖ బయిలుదేరుంది. అయితే అక్కడో ట్విస్ట్ పడుతుంది. ఆమె ఫోన్ ఎవరో కొట్టేస్తారు. ఈ లోగా  ఆర్కే (అర్జున్ దాస్) వచ్చి తనను తాను మురళిగా పరిచయం చేసుకుంటాడు. ఈ లోగా మురళి సీన్ లోకి  వస్తాడు.   ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ ఆర్కే ఎవరు? చివరకు ఏమైంది? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉంది…
Love isn’t always rainbows and butterflies అనే పాయింట్ ని బేస్ చేసుకుని ఈ స్టోరీ అల్లారు. మళయాళంలో సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఇక్కడా వర్కవుట్ అవుతుందని మక్కీకి మక్కీ దింపే ప్రయత్నం చేసారు. అక్కడ క్రైస్తవం అనేది తీసేసి ఇక్కడ హిందూ దేవతలను పెట్టడం తప్పించి మార్చింది లేదు. లొకేషన్స్ అరుకు కావటంతో అందం దానంతట అదే సినిమాలోకి వచ్చేసింది. నిజానికి ఇది పెద్ద కథ కాదు ..ఊహించగలిగే ట్విస్ట్ లతో ఉన్నదే. అయితే ఈ సినిమాకు ప్రాణం ప్రధాన పాత్రల క్యారక్టైజేషన్స్. అయితే అవి తెలుగులోకి వచ్చేసరికి వాటిలో డెప్త్ తగ్గిపోయింది. దాంతో సినిమా ప్రారంభమై ఇంతసేపు అయినా ఏమీ జరగటం లేదు అన్న ఫీలింగ్ వస్తుంది.

 అలాగే ఎక్కడా సహజంగా అనిపించదు..చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో ఏమీ జరగకుండా అలా అలా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్ లో..సెకండాఫ్ లో అయినా ఏదన్నా జరిగితే బాగుండును అనే ఆశతో చూస్తూంటాము. ఉన్నంతలో అదే బెస్ట్ పార్ట్ కూడా. అందుకు కారణం..ఎంగేజ్మెంట్ గా ట్రీట్మెంట్ లేకపోవటం. కొన్ని చోట్ల డైలాగులతో నడిపేద్దామని డైరక్టర్ ప్రయత్నం చేసారు. అది అంతగా ఫలించలేదు. అయితే ట్విస్ట్ లు కొద్దిగా కలిసొచ్చాయి. ఏదమైనా మళయాళం నుంచి తీసుకొచ్చి చేసిన సినిమా ఇంతేనా అని గాలి తీసేసినట్లు అయ్యింది. ఏదైమైనా ఇలాంటి కథల్లో పాత్రలతో మనం ప్రయాణిస్తేనే వర్కవుట్ అవుతాయి ..లేకపోతే ఏమీ ఉండదు.

నటీనటుల్లో …

వాస్తవానికి ఇది మూడు పాత్రల చుట్టు తిరుగుతూ ముగ్గురికి ప్రయారిటీ ఉంది. మిగతావన్నీ సపోర్టింగ్ రోల్స్ మాత్రమే. అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ముగ్గురూ పోటీ పడి నటించారని చెప్పలేం కానీ బాగానే చేసారు. అయితే అనిఖా సురేంద్రన్ మాత్రం బాగా చిన్న పిల్లలా ఉంది తప్పించి…హీరోయిన్ లా అనిపించలేదు. సూర్య వశిష్ట కొత్తవాడైనా వేరియేషన్స్ తో బాగా చేసారు. అలాగే  అర్జున్ దాస్ ఎగ్రిసివ్ క్యారక్టర్ లో ఒదిగిపోయారు.

టెక్నికల్ గా…

‘బుట్ట బొమ్మ’ లో డైలాగులు బాగున్నాయి. డైలాగు రైటర్ గణేష్ రావూరి కొన్ని చోట్ల అర్దవంతంగా, కొన్ని చోట్ల ఫన్నీగా, త్రివిక్రమ్ స్టైల్ లో  రాసారు. అయితే డైలాగులు ప్రక్కన పెడితే స్క్రిప్టే వీక్ గా అనిపిస్తుంది.  సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. పాటలు అద్బుతం కాదు కానీ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నడిచిపోయింది.

హైలెట్స్?
కొన్ని పాటలు
అక్కడక్కడా మెరిసిన ట్విస్ట్ లు
తక్కువ రన్ టైమ్

మైనస్ లు
నేటివిటీ లేదు
ప్లాట్ గా అనిపించే నేరేషన్ తో కూడిన  స్క్రీన్ ప్లే

చూడచ్చా?
మళయాళ కప్పేలా చూడని వాళ్లు ఓ లుక్కేయవచ్చు.

నటీనటులు : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, ప్రేమ్ సాగర్, నవ్యా స్వామి, నర్రా శ్రీను, ‘మిర్చి’ కిరణ్, పమ్మి సాయి, వాసు ఇంటూరి, ‘పుష్ప’ జగదీశ్ తదితరులు
స్క్రీన్ ప్లే, మాటలు : గణేష్ కుమార్ రావూరి
ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు
సంగీతం : గోపీసుందర్, స్వీకర్ అగస్తి
నిర్మాతలు : నాగ‌వంశీ ఎస్‌. – సాయి సౌజ‌న్య‌
Running time: 2h 2m
దర్శకత్వం : శౌరి చంద్రశేఖర్ రమేష్
విడుదల తేదీ: ఫిబ్రవరి 4, 2023