బెల్ బాటమ్ మూవీ రివ్యూ
బాటమ్ టాప్: ‘బెల్ బాటమ్’ రివ్యూ
Rating: 2.5/5
కామెడీ సినిమాలు తీసి ఒప్పించటమే కష్టం అనుకుంటే అందులో క్రైమ్ కామెడీలు చేయటం మరీ కష్టం. చాలావరకూ ఇలాంటి సినిమాలు నవ్విద్దామని నవ్వులు పాలు అవుతూంటాయి. అందుకే అందరూ వీటి జోలికి పోరు. కాకపోతే కొందరికి డిటెక్టివ్ కథలన్నా, ఆ సినిమాలన్నా బోలెడు ఇష్టం. అయితే తెలుగులో ఆ తరహా సాహిత్యం మెల్లిమెల్లిగా అంతరించిపోయింది. అప్పట్లో కొమ్మూరి సాంబశివరావు, కొవ్వలి వంటి వారు రాసిన డిటెక్టివ్ నవలలనే ఇప్పటికి చదువుతున్నామంటే మన ఆసక్తి సగం కారణమైతే,మిగతా సగం..మనకు ఆ సాహిత్యం మరుగునపడటం. అయితే అదృష్టవశాత్తు అప్పుడప్పుడూ డిటెక్టివ్ సినిమాలు వచ్చి ఆ ఆకలి తీరుస్తున్నాయి. క్రితం సంవత్సరం కన్నడంలో వచ్చి సూపర్ హిట్టైన ‘బెల్ బాటమ్’ ఆ డిటెక్టివ్ జానర్ ఫిల్మే. దాన్ని తెలుగులో డబ్ చేసి ఓటీటిలో రిలీజ్ చేసారు. ఆ సినిమా కథేంటి…ఇక్కడ వర్కవుట్ అవుతుందా…వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
దివాకర్ (రిషబ్ శెట్టి)కి డిటెక్టివ్ నవలలు చదివి, ఆ టైప్ సినిమాలు చూసి మనందరిలాగే పెద్దయ్యాక పెద్ద డిటెక్టివ్ ని అయ్యిపోదామనుకుంటాడు. అయితే మనం పెద్దయ్యాక అది వర్కవుట్ అయ్యే పనికాదులే అని ప్రక్కకు తప్పుకుంటాం…కానీ దివాకరం ఇంకా అదే ప్రపంచంలో బ్రతుకుతూంటాడు. అతని తండ్రికి ఈ డిటెక్టివ్ చేష్టలు నచ్చకపోవటంతో …తప్పనిసరిపరిస్దితుల్లో తండ్రి పనిచేసే పోలీస్ డిపార్టమెంట్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అవుతాడు. అక్కడ దివారర్ ఓ ఎల్ బోర్డ్. అందరూ అతనితోనే ఆడేసుకుంటూంటారు. అతని తెలివికి తగ్గ జాబ్ కాదని మధనపడిపోతూండగా..ఓ రోజు ఓ మిస్సింగ్ కేసు అతనికి అదృష్టవశాత్తు అప్పచెప్తారు. దాన్ని తన తెలివితో డీల్ చేయటంతో అతనికి ఆ డిపార్టమెంట్ కు పెద్ద సవాల్ గా మారిన ఓ కేసు అప్పచెప్తారు. అదేమిటంటే…పోలీస్ స్టేషన్ లలోనే పోలీస్ లు కళ్లు గప్పి..ఎవరో దొంగతనం చేస్తూంటారు. దొంగలనుంచి రికవరీ చేసిన మాల్ ని లాకర్ లో పెడితే లేపేస్తూంటారు. మింగలేక కక్కలేని పరిస్దితి పోలీస్ లది. బయిటకు చెప్తే ఉద్యోగాలు,పరువు పోతాయి. అలాగని దాస్తే ఆ సొమ్ము రికవరీ చేయీలి. ఏం చేయాలా అన్న టైమ్ లో మన దివాకరం గుర్తుకొచ్చి..కేసు అప్పచెప్తారు. అప్పుడు దివాకర్ ఆ కేసుని ఎలా డీల్ చేసాడు. ఎవరు ఆ దొంగతనాలు చేస్తున్నారు. వాటి వెనక ఉన్న మోటివ్ ఏమిటి అనేది మిగతా కథ.
స్క్ర్రీన్ ప్లే ఎనాలసిస్
క్రైమ్ కామెడీల్లో…ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ లు ఉండవు. హీరో చేసే పనులు వల్లో లేక హీరో ఇరుక్కునో సిట్యువేషన్స్ వల్లో కామెడీని క్రియేట్ చేస్తూంటారు. అలాగని మెయిన్ ప్లాట్ కామెడీ కాకుండా జాగ్రత్త పడుతూ ఫస్టాఫ్ లో ముడులు వేసి, సెకండాఫ్ లో వాటిని విప్పాలి. ఓ పజిల్ పూర్తి చేసినట్లు ప్రేక్షకుడుకి అనిపిస్తే ఆ సినిమా సక్సెస్సే. అదే ఈ బెల్ బాటమ్ లో దర్శకుడు సాధించింది. ఫస్టాఫ్ సోసోగా నడిచినట్లు అనిపించినా, సెకండాఫ్ లో కథ లో మనని లీనం అయ్యేటట్లు చేస్తాడు. మెల్లిమెల్లిగా ఒక్కో ముడీ లాగుతూ మనని కథలోకి లాగుతాడు. డిఫరెంట్ క్యారక్టరైజేషన్స్ ని పరిచయం చేస్తూ కథనం మీద పట్టుపోకుండా కాపలా కాస్తాడు. అయితే ఇంత బాగా చేసినా హీరో,హీరోయిన్ ట్రాక్ మనకు నిరాశపరుస్తుంది. అలాగే హీరో,తండ్రి మధ్య సాగే ట్రాక్ విసిగిస్తుంది. వాటి విషయంలో కాస్త జాగ్రత్తపడితే ఇంకా బాగుండేదనిపిస్తుంది. కన్నడ ప్రేక్షకులు కు అద్బుతం అనిపించినా, మనకు ఆ స్దాయిలో ఆనదు. ముఖ్యంగా హీరోయిన్ తప్ప మనకు తెలుసున్న ఫేస్ ఒక్కటీ కనపడదు. అయినా సినిమాని ఇంట్రస్టింగ్ గానే చూసామంటే అది స్క్రిప్టు గొప్పతనమే. అలాగే డైరక్టర్ ఈ సెల్ ఫోన్ రోజుల్లో కాకుండా రెట్రో రోజుల్లో సినిమాని సెట్ చేయటం బాగా కలిసొచ్చింది.
టెక్నికల్ గా..
ఇలాంటి సినిమాలకు టెక్నికల్ గా సౌండ్ లేకపోతే తేలిపోతాయి. ఆ విషయం డైరక్టర్ కు పూర్తి అవగాహన ఉన్నట్లుంది. మంచి కెమెరా వర్క్ తో సినిమాకు రెట్రో ఫీల్ ని తీసుకొచ్చాడు. అదే విధంగా కెమెరా తో కథ నడుపుతూ, క్లూ ఇవ్వడం గమనించవచ్చు. అలాగే డైరక్షన్ కూడా బాగుంది. కానీ కన్నడ నాటుతనం కనపడుతుంది చాలా చోట్ల. ఎడిటింగ్ సినిమాలో కొన్ని ట్రాక్ లు లేపేస్తే బాగుండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సోసోగా ఉన్నాయి. సంగీతం జస్ట్ ఓకే. గుర్తుంచుతోగ్గ పాట ఒక్కటీ లేదు. రీరికార్డింగ్ బాగుంది.
చూడచ్చా
ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే నిరాశపరచదు
తెర వెనక..ముందు
నటీనటులు: రిషబ్ శెట్టి, హరిప్రియ, అచ్యుత్‌కుమార్, యోగరాజ్ భట్ తదితరులు
సంగీతం: అజనీశ్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ కశ్యప్
ఎడిటింగ్: కె.ఎం.ప్రకాశ్
కథ: దయానంద్ టి.కె.
నిర్మాత: సంతోష్ కుమార్ కె.సి.
రన్ టైమ్: 2గం|| 10ని||
దర్శకత్వం: జయతీర్థ
విడుదల తేదీ: 11, డిసెంబర్ 2020
విడుదల: ఆహా ఓటీటీ