Reading Time: 2 mins

కథనే బ్లఫ్ చేసారు (‘బ్లఫ్‌ మాస్టర్‌’సినిమా రివ్యూ )

రేటింగ్ :  2/5


తెల్లారి లేస్తే పేపర్లు నిండా మోసాలు, స్కామ్ లు మనకు కనపడుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఆ మోసపోయిన వారి లిస్ట్ లో మనం కూడా ఉంటూంటాం. అలా కానప్పుడు …అలా ఎలా బోల్తా పడ్డారుగా..అంత అమాయికంగా అని ఆ వార్తలు చూస్తూ కామెంట్స్ పాస్ చేస్తూంటాం. అయితే అవతలివాడిని పడేయాలంటే బోలెడు తెలివి కావాలి…నేర్పు కావాలి…అన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యం కావాలి. అవన్నీ ఉన్నవాడి కథ ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే తమిళంలో అలాంటి నిజ జీవిత సంఘటనలు పోగు చేసి ‘శతురంగ వెట్టై’  అంటూ సినిమాగా తీసారు. మంచి హిట్టైన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ రెడీ చేసుకునే పనిలో ఉంది. ఈ నేఫధ్యంలో ఈ తెలుగు రీమేక్ రెడీ అయ్యి ఈ రోజు రిలీజైంది. నేటివిటీ ప్రకారం బోలెడు మార్పులు చేసాం అంటున్నారు దర్శక,నిర్మాతలు. అసలు తమిళ కథేంటి..మనవాళ్లు చేసిన మార్పులు ఏమిటి…అసలు ఇలాంటి కథలు మనకు ఇక్కడ ఆడుతాయా.. రివ్యూలో చూద్దాం…

కథేంటి

మనీ ఈజ్ ఆల్‌వేజ్ అల్టిమేట్ అని నమ్ముతూ ..ఆ నమ్మకం నిలబెట్టుకోవటం కోసం మోసాలు చేస్తూండే ‘బ్లఫ్ మాస్టర్’ఉత్తమ్‌ కుమార్‌ (సత్యదేవ్‌). రకరకాల వేషాల్లో రకరకాల మోసాలు చేసే అతనికి జీవితం సాఫీగా వెళ్లిపోతుంది..ఎప్పటిదాకా అంటే అతని చేతిలో మోసపోయిన వాళ్లు తిరగబడేదాకా. మోసానికి గురైన కొందరు కేసులు పెట్టి అతన్ని పోలీస్ లకు పట్టించి, కోర్టుకు లాగుతారు. అయితే డబ్బు ఎవరేసి చట్టం నుంచి తప్పించుకుని బయిటకు వస్తాడు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు ఉండదు. కోర్టులు,పోలీసులు ద్వారా న్యాయం జరిగదు అని భావించిన కొందరు ఉత్తమ్ ని కిడ్నాప్ చేయిస్తారు. అక్కడ నుంచి ఉత్తమ్ కు ఇబ్బందులు ప్రారంభం అవుతాయి. కిడ్నాపర్స్ నుంచి తప్పించుకునే క్రమంలో అతను మరో పెద్ద ఫ్రాడ్ చెయ్యాల్సి వస్తుంది.  అయితే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి  ఆవని (నందిత శ్వేతా)  కు ఈ మోసాలు ఎఫెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఉత్తమ్ లో మార్పు వచ్చి ఆ మోసాలు మానేయ్యాలనుకుంటాడు. కానీ అది చాలా కష్టం అని అర్దమవుతుంది. అక్కడ నుంచి ఉత్తమ్ ఏం చేసాడు…అతనిలో వచ్చిన మార్పు స్దిరంగా ఉందా..చివరకు ఏమైంది వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
ఎలా ఉంది..

తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో చాలా మార్పులకు లోనైంది. కొత్త కథలను తెలుగు వాళ్లు ఆదరిస్తున్నారు. అందులో పెద్ద హీరో ఉన్నాడా లేదా అనేదాని కన్నా తమను మొదటి నుంచి చివరి దాకా కూర్చోబెట్టే కంటంట్ ఉంటే చాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఫస్టాఫ్ స్పీడుగా వెళ్లిపోయినా..సెకండాఫ్ పడుతూ..లేస్తూ సాగుతుంది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి.ఆ సీన్స్  సినిమాని ఇరవై క్రితం వెనక్కి తీసుకువెళ్లిపోతుంది.

నేటివిటి సమస్య

ఈ కథకు మన తెలుగు ప్రాంతంలో జరిగిన కొన్ని వైట్ కాలర్ మోసాలను కలిపి కథను వండితే బాగుండేది. అలా కాకుండా కీ సీన్స్ కు ఒరిజనల్ ను ఫాలో అయ్యిపోయారు. దాంతో వాటికి కనెక్ట్ అవటం కష్టమైంది. రీమేక్ చేసేటప్పుడు అలాంటి విషయాలపై దర్శకులు స్క్రిప్టు లెవెల్లోనే శ్రద్ద పెట్టాలి.

సాంకేతిక విలువలు

సినిమాలో కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ సోసోగా ఉంది. డైలాగులు అక్కడక్కడా బాగానే పేలాయి. అయితే ఒరిజనల్ లోంచి చాలా డైలాగులు తీసుకుని అనువాదం చేసారని అర్దమవుతోంది.  మిగతా విభాగాలనుంచి దర్శకుడు మంచి అవుట్ పుట్ నే రాబట్టుకున్నాడు. సత్యదేవ్ తనవరకూ తాను బాగానే చేసారు. నిర్మాత సినిమాకు తగ్గట్లే  ఖర్చుపెట్టాడు.

చివరి మాట

ఇలాంటి చిన్న సినిమాలు నిలబడాలంటే స్క్రిప్టు మీదే బాగా కష్టపడాలి. అదే లేనప్పుడు మిగతా వాళ్లంతా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే. 

ఎవరెవరు..

న‌టీన‌టులు: స‌త్య‌దేవ్‌, నందితా శ్వేత‌, బ్ర‌హ్మాజీ, పృథ్వీరాజ్‌, చైత‌న్య ‌కృష్ణ‌, సిజ్జు, టెంప‌ర్ వంశీ, బాల‌కృష్ణ, ఆదిత్య మేన‌న్ త‌దిత‌రులు
సంగీతం: సునీల్ క‌శ్య‌ప్
ఛాయాగ్ర‌హ‌ణం: దాశ‌ర‌థి శివేంద్ర
ర‌చ‌న: గోపిగ‌ణేష్‌, పుల‌గం చిన్నారాయ‌ణ‌
కూర్పు: న‌వీన్ ‌నూలి
క‌ళ‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి
స‌మ‌ర్ప‌ణ‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌
నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై
ద‌ర్శ‌క‌త్వం: గోపిగ‌ణేష్
విడుద‌ల‌: 28 డిసెంబ‌రు 2018