Reading Time: 3 mins

భానుమతి & రామకృష్ణ మూవీ రివ్యూ

ఏజ్ బార్ ప్రేమ కథ: భానుమతి & రామకృష్ణ రివ్యూ

Rating:3/5

కంగారుపడకండి..ఏజ్ బార్ అనగానే ..ఏ అరవైలు దాటాక ప్రేమించుకునే జంట అనుకునేరు..థర్టీ ప్లస్ బాబుకు, ధర్టీ క్రాస్ చేసిన పాపకు మధ్య జరిగిన పసందైన ప్రేమ కథ ఇది. అయితే ఇది ఇప్పటి యూత్ కథలా వెనకబడటాలు, వార్నింగ్ లు ఇఛ్చుకోవటాలు ఉండవు. కాస్తంత ఎనభైల నాటి వ్యవహారం లాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ధర్టీ ప్లస్ కుర్రాళ్లు ఇంత నెమ్మిదిగా, అమాయకత్వంగా ఉన్నారా అనే సందేహం వస్తుంది. అయితే లోకంలో అనేక రకాలు వాళ్లు ఉంటారు కాబట్టి నమ్మి, సినిమా చూద్దాం..ఇంతకీ ఈ ధర్టీ ప్లస్ బ్యాచ్ మనలని అలరిస్తుందా, అసలు వీళ్లు ప్రేమించుకోవటానికి వీలైన పరిస్దితులు ఎక్కడ ఉన్నాయి..అసలు ఎవరు వీళ్లు వంటి విషయాలు చూసేద్దాం పదండి.

స్టోరీ లైన్

మంచిత‌నం, అమాయ‌క‌త్వం, పాజిటీవ్‌నెస్.. ఇవ‌న్నీ ఉన్న కుర్రాడు రామకృష్ణ (నవీన్ చంద్ర). అయితే అతనికి 33 ఏళ్లు..ఇంకా పెళ్లి కాలేదు. తెనాలి నుంచి హైదారబాద్ కు ఉద్యోగనిమిత్తం వచ్చాడు.ముప్పై ఏళ్ల భానుమతి (సలోని లూధ్రా)వేరు. ఏజ్ దాటినా పెళ్ల‌ి కాని ఫ్ర‌స్ట్రేష‌న్‌. మధ్యలో బ్రేక్ అప్ బరస్ట్ లు. ఆ బాధనుంచి బయిటపడేందుకు పబ్ లు, మందు. మగాళ్ళకు ఏ మాత్రం తగ్గను అనే మనస్తత్వం ఆమెను ఉద్యోగపరంగా మంచి స్దాయిలో కూర్చబెడుతుంది..జీవితంలో ఆనందాలు కలగచేయదు. ఆమె సెల్ఫ్ రెస్పక్ట్ ని పొగరు అని, ఇండిపెండింట్ గా ఉండాలనుకునే తత్వాన్ని మొండిమనిషి అని బిరుదులు తెచ్చిపెడతాయి తప్ప పెద్దగా కలిసిరాదు. అలాంటి ఆమె క్రింద జూనియర్ గా జాయిన్ అవుతాడు రామకృష్ణ. మొదట్లో ఈ తింగరోడు ఏంటి అని ఆమె అతన్ని పట్టించుకోకపోయినా..మెల్లి మెల్లిగా ఆమె మనస్సుకు ఎక్కేస్తాడు. అతని పరిస్దితి అంతే. అయితే వీళ్లిద్దరూ ఇక ఒకటి అవుతారనుకునే సమయంలో  ఆమె మాజీ బోయ్ ప్రెండ్ నుంచి చిన్న ట్విస్ట్. ఇద్దరూ విడిపోవటం..చివరకు ఇద్దరూ ఎమోషనల్ గా కలవటం. ఇదీ వరస.  

ఎలా ఉంది..

చెప్పుకోవ‌డానికి పెద్ద క‌థేం కాదు. అనేక సార్లు చూసిన రొమాంటిక్ కామెడీ స్టోరీ లైనే. కాక‌పోతే… హీరో, హీరోయిన్ల గ‌మ్మ‌త్తైన క్యారెక్టరైజేష‌న్లు దగ్గర డైరక్టర్ మార్కులు కొట్టేసాడు. తెనాలి నుంచి వచ్చిన అమాయిక హీరో, హైదారాబాద్ లో ఉంటూ అక్కడ కల్చర్ లో  ముదిరిన హీరోయిన్..వీళ్లద్దరుకి అసలు సింక్ అవుతుందా…అనిపిస్తూ ,ఆ పాత్రల్ని న‌డిపించిన ప‌ద్ధ‌తీ.. వాళ్ల మ‌ధ్య కుదిరిన అంద‌మైన  కెమిస్ట్రీ – ఇవీ ఈ క‌థ‌కు ప్రాణం పోశాయి. క్యారక్టరైజేషన్ ఈ సినిమా కథకు కీ లాంటిది. వాటిని పట్టుకుని వదలకుండా చివరదాగా వారి వ్యక్తిత్వాలు పడిపోకుండా డైరక్టర్స్ నిలబెట్టాడు కాబట్టే సినిమా నిలబడింది. కళా ఖండం కాదు కానీ చూడదగ్గ సినిమా అయ్యింది. ముఖ్యంగా కలవటం, విడిపోవటం, పొందటం అనే మూడు బీట్స్ ని స్క్రిప్టు లో ఫెరఫెక్ట్ గా ఇమిడ్చారు. తెరపై అయితే ఎలా ఉండేదో కానీ ఓటీటి కాబట్టి ఒకే ప్లోలో చూసేసాం.   అలాగే హీరోయిన్ ఆలోచనల్లోని మార్పులను సినిమాలో బాగా ఎస్టాబ్లిష్ చేసారు. తనపై తనపై కోసం, తనకు ఎదురయ్యే పరిస్దితులపై ద్వేషం, కోపం, ఎంత బాగా తెరపై కనిపించిందో.. ఆ ద్వేషం ఇష్టంగా మారడం, ఆ కోపం ప్రేమగా మారడాన్ని దర్శకుడు బాగా చూపించారు. డైలాగులు కూడా చాలా బాగా రాసుకున్నారు.  `లావెక్కితే పెళ్లి అవ్వ‌దా` అని హీరోయిన్ అంటే..`పొగ‌రు త‌లకెక్కితే అవ్వ‌దు` అంటూ త‌ల్లి కౌంట‌ర్ ఇస్తుంది. `అందం అనేది ఆఫ్ట్రాట్ కంటికి క‌నిపించే విజువ‌ల్ కాదు` అని చెప్ప‌డం వంటివి బాగున్నాయి.  
 
డైరక్షన్, మిగతా క్రాప్ట్స్

కొత్త దర్శకుడైనా ఎక్కడా తడబడకుండా వదిలిన బాణంలా దూసుకుపోయాడు దర్శకుడు. అలాగే లీడ్ పెయిర్ నుంచి అద్బుతమైన ఫెరఫార్మనస్ రాబట్టాడు. కాస్త ఎమోషనల్ కంటెంట్ కూడా ఈ కథకు జత చేసుకుంటే సరిపోయేది. అలాగే ఫన్ డోస్ మరింత పెంచచ్చు. ఇక మిగతా డిపార్టమెంట్ లలో కెమెరా, మ్యూజిక్ రెండూ హైలెట్ గా చెప్పుకోవాలి. సంగీత దర్శకుడు అచ్చు రాజమణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా చోట్ల ప్రాణం పోసి లేపింది. ఎక్కడా  వెబ్ మూవీ చూస్తున్న ఫీల్ కలగచెయ్యలేదు. ఇక  సాయి ప్రకాష్ ఛాయాగ్రహణం డీసెంట్ గా ఉంది.  రవికాంత్ పేరేపు ఎడిటింగ్ లో ఎక్కడా ఎత్తు పల్లాలు, ల్యాగ్ లు లేవు. నిర్మాణ విలువలు కూడా సినిమాకు రిచ్ లుక్ తెచ్చేలా డిజైన్ చేసారు.

ఇక నటీనటుల్లో నవీన్ చంద్ర..తన రెగ్యులర్ నటనా పద్దతిలో కాకుండా చిన్న టౌన్ నుంచి హైదరాబాద్ వచ్చినవాడులా ఫెరఫెక్ట్ గా చేసాడు. హీరోయిన్ పోష్ కల్చర్ ని ప్రజెంట్ చేస్తూ ..బ్రేకప్ లు, తన భావాలు మధ్య నలిగిపోతూ దాన్ని దాచిపెడుతూ, పైకి క్యాజువల్ గా కనిపించేందుకు ప్రయత్నించే సగటు అమ్మాయిగా జీవించింది. వైవా హర్ష ఉన్నంతసేపు నవ్వించాడు.  
 
చూడచ్చా

ఖచ్చితంగా..ఓ ప్రెష్ రొమాంటిక్ కామెడీని ఎంజాయ్ చేయచ్చు

తెర వెనక…ముందు

నటీనటులు: నవీన్‌ చంద్ర, సలోని లుత్రా, రాజా చెంబోలు, వైవా హర్ష తదితరులు
సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌, అచ్చు రాజమణి (నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాశ్‌ ఉమ్మడిసింగు
ఎడిటింగ్‌: రవికాంత్‌ పేరేపు
నిర్మాత: యశ్వంత్‌ ములుకుట్ల
సమర్పణ: శరత్‌ మరార్‌
రచన, దర్శకత్వం: శ్రీకాంత్‌ నాగోతి
బ్యానర్‌: నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, క్రిష్‌వి
విడుదల తేదీ: 03/07/2020 (ఆహా ఓటీటీ)
రన్నింగ్ టైమ్ :92 minutes