Reading Time: < 1 min

మట్టికథ మూవీ ట్రైలర్ విడుదల

మైక్ మూవీస్ మట్టికథ మూవీ ట్రైలర్ విడుదల

తెలుగు సినీచరిత్రలో ఇది రియల్ లైఫ్, రియల్ యాక్టర్ల యుగం. అద్భుతమైన కథలతో, రొటీన్‌కు భిన్నంగా ఆకట్టుకునే కథనంతో మాస్టర్‌పీస్ వంటి చిత్రాలు వస్తున్నాయి. జనం కూడా ఆదర్శిస్తున్నారు. విభిన్న కథాచిత్రాలకు పేరొందిన మైక్ మూవీస్ సంస్థ అలాంటి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది. మనకందరికీ తెలిసిన, మనం మరచిపోతున్న మట్టికథను అద్భుత కథాకథనాలతో రూపొంచింది. ఈ చిత్రం ట్రైలర్‌ను, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మట్టికథ టైటిల్ నాకు బాగా నచ్చింది. మనం పుట్టేది, గిట్టేది మట్టిలోనే. తెలంగాణ అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి ప్రజల మనసు స్వచ్ఛమైనది. ఈ చిత్రాన్ని అందరూ తప్పక చూడాలి అని అన్నారు.

పల్లెటూరి కుర్రాడి తన కలలను నెరవేర్చుకోవడానికి పడిన తిప్పలను, భూమితో అనుబంబంధాన్ని, పల్లె సరదాలు, కష్టాలు, ఆత్మీయతను ఇందులో వాస్తవికంగా, కళాత్మకంగా చూపారు. అన్నంపెట్టే పొలాన్ని అమ్ముకుంటే ఎట్టా బిడ్డా?, అంత పెద్ద రజాకార్ల దాడప్పడే మేం ఊరు ఇడ్సి పోలేదు, ఇంతు ముత్తెమంత దానికే పరేషానయిత్తువు వంటి భావోద్వేగమైన డైలాగులతోపాటు, జయం సినిమాల నితిన్ లెక్క ఉరికొస్తున్నవ్, వంటి సరదా సంభాషణలూ ఉన్నాయి.

పవన్ కడియాల దర్శకత్వం వహించిన ఈ మూవీని అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. సహనిర్మాత సతీశ్ మంజీర. అజయ్ వేద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ జానపద గాయని కనకవ్వ, బలగం తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. స్మరణ్ సాయి సంగీతం అందించగా కుంభం ఉదయ్ ఎడిట్ చేశారు.