‘మత్తు వదలరా’ రివ్యూ
కొత్తగా ఉందిరా…( ‘మత్తు వదలరా’ రివ్యూ)
Rating:2.5
క్రైమ్ జానర్ ఫిల్మ్ లకు తెలుగులో మెల్లిగా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా కొత్త దర్శకులు క్రైమ్ జానర్ లో సినిమా చేయటానికి ఇంట్రస్ట్ చూపెడుతున్నారు. క్రైమ్ కు త్వరగా యువత త్వరగా కనెక్ట్ అవుతారని, మిగతా ఎలిమెంట్స్ లేకపోయినా ఆ లోటు ఫీలవరని ఈ జానర్ లో కథని తయారు చేసుకుంటూంటారు. అయితే క్రైమ్ సినిమాని కొత్తగా డీల్ చేయకపోతే చెత్తగా తయారవుతుంది. లేటెస్ట్ మూవీ ట్రెండింగ్ టెక్నిక్ లను పట్టుకుని వీటిని తియ్యాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలు చూసే యూత్..వరల్డ్ సినిమాని సైతం చూస్తున్నారు. వారిని కొత్తదనం తో మెప్పిస్తేనే చూస్తారు. ఇలాంటి కాస్త కష్టమైన పరిస్దితుల్లో మన ముందుకు వచ్చిన ‘మత్తు వదలరా’ చిత్రం ఎలా ఉంది..కథేంటి..ఎంగేజ్ చేయగలిగారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
బాబు(శ్రీసింహ), యేసు(కమిడియన్ సత్య) ఓ ఆన్ లైన్ సంస్దలో డెలవరీ బాయ్ లుగా పనిచేస్తూంటారు. చాలా తక్కువ జీతం..చాలా ఎక్కువ ఆశలున్న జీవితం..వీళ్లను సతమతం చేసేస్తూంటాయి..ప్రస్టేషన్ తో ఊగిపోయేలా చేసేస్తూంటాయి. కానీ ఏం చేయగలరు. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక తప్పు చేస్తే కానీ కుదరదు అని ఓ బలహీన క్షణంలో నమ్ముతారు. యేసు ఇలాంటివాటిల్లో ముదురు కావటంతో తన అనుభవంలోంచి ఓ సలహా ఇస్తాడు..వస్తువు డెలవరీ చేస్తూ..వాళ్లచ్చే డబ్బు తీసుకునేటప్పుడు కష్టమర్స్ ని చిన్నపాటి మోసం చేస్తే కాస్త కళ్లముందు డబ్బులు ఆడతాయని చెప్తాడు. అది చాలా ఈజీ అనిపిస్తుంది. దాంతో బాబు ఆ ఛీటింగ్ ఐడియాని అమలు చెయ్యాలని ఫిక్స్ అయ్యి ఓ ఇంటికి వెళ్తాడు.
వస్తువు డెలివరీ చేసేటప్పుడు ఆ ఐడియాని అమలు చేస్తూంటే ..ఓ ముసలమ్మ దగ్గర అడ్డంగా దొరికిపోతాడు. అప్పుడు ఆ విషయం బయిటపడకుండా తనని తాను సేవ్ చేసుకునేందుకు చేసిన ఓ పని.., యాక్సిడెంట్ గా ఆ ముసలమ్మ మరణానికి కారణం అవుతుంది. అలా బాబు మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దాంతో తొలి ప్రయత్నమే తొందరపాటుతో ప్రాణం మీదకు తేవటంతో కంగారుపడి, ఆ తర్వాత తేరుకున్న బాబు…దాని నుంచి బయిటపడటానికి ప్రయత్నం చేస్తాడు. తనని మర్డర్ కేసులో ఇరికించారని తెలుసుకుంటాడు.
ఆ క్రమంలో అసలు ఎవరు ఈ మర్డర్ చేసారో..దాని వెనక ఉన్న ది ఎవరో ఇన్విస్టిగేట్ చేయటం మొదలెడతాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. అసలు ఎవరు ఈ మర్డర్ చేసారు. రాజు(వెన్నెల కిశోర్)కు ఈ మర్డర్ కు సంభందం ఏమిటి. వీళ్ల ఇంకో రూమ్ మేట్ , ఎప్పుడు నెట్ లో సినిమాలు చూస్తూ గడిపే అభి(అగస్త్య) వీళ్లకు ఏమన్నా సాయిం చేసాడా..ఈ మత్తువదలరా టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సింది.
స్క్రీన్ ప్లే విశ్లేషణ
ఇది డైరక్టర్ ఓరియెంటెడ్ స్టోరీ. పూర్తి దర్శకుడు వైపు నుంచి కథ జరుగుతుంది. ఇలాంటి సినిమాలకు హీరో డైరక్టరే. ఆ డైరక్టర్ కు సహకరించేది పట్టు ఉన్న స్క్రీన్ ప్లేనే. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. స్లో గా మెదైలైన ఓ కథ..మెల్లిమెల్లిగా ఓ మెలిక వేసుకుని దాన్ని ప్రధాన పాత్రకు పెద్ద ఉరితాడుగా మార్చుకుని ముందుకు వెళ్లటం ఉత్కఠ రేపుతుంది. కథలో మలుపులు, మెలికలు, ముడులు ఎట్రాక్ట్ చేస్తాయి.ఫస్టాఫ్ అలాంటి ఓ ముడితో ఎండ్ అవుతుంది. అయితే ముడులు వేసినంత ఈజిగా దాన్ని విప్పలేకపోయాడనే చెప్పాలి.
దాంతో కథలోకి డ్రగ్ మాఫియాని అనవసరంగా తెచ్చి పెట్టారని అర్దమవుతుంది. అయితే క్రైమ్ థ్రిల్లర్ కథలో ఇలాంటివి కామనే కాబట్టి సరిపెట్టుకుంటాం. అలాగే పారిడమ్ షిప్ట్ అనే స్క్రీన్ ప్లే టూల్ ని బాగా వాడారు. దాని ప్రకారం పాజిటివ్ పాత్రలు..నెగిటివ్ గా..నెగిటివ్ అనుకున్నవి పాజిటివ్ గా తేలుతూంటాయి. కాకపోతే ఆ టూల్ ని జాగ్రత్తగా వాడకపోతే అభాసుపాలు అవుతారు. అయితే దర్శకుడు ఆ విషయం సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫన్ ని తోడు తెచ్చుకున్నాడు. దాంతో ఓ మంచి థ్రిల్లర్ గా సినిమా పాసైపోయింది. సత్య చేసిన కామెడీ కలిసివచ్చింది.
మైనస్ లు
ఫస్టాఫ్ లో ఉన్న స్క్రీన్ ప్లే టైట్ నెస్..సెకండాఫ్ కు వచ్చేసరికి సడలిపోయింది. ఎంటర్టైన్మెంట్ కూడా తగ్గిపోయింది. అలాగే సినిమాని స్లో నేరేషన్ లో నడపటం కూడా మైనస్ గా మారింది.
ఎవరు ..ఎలా
కొత్త దర్శకుడైనా …ఆర్టిస్ట్ లనుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అబ్బాయి శ్రీసింహాకు ఇదే మొదటి సినిమా అయినా ఆ ఆలోచన మనకు ఎక్కడా రాదు. ఎందుకంటే ఆ కుర్రాడు చాలా నాచురల్ గా చేసుకుంటూ పోయాడు. కమర్షియల్ హీరో అనిపించుకోవటం కష్టమే కాని..ఇలాంటి కథలు చేయగలుగుతాడు. ఇక ఈ సినిమాలో హైలెట్ గా కమిడియన్ సత్యని చెప్పుకోవాలి. అతను లేకపోతే సినిమా లేదు.
టెక్నికల్ గా…
దర్శకుడుకు ఈ సినిమాతో మంచి మార్కులే పడతాయి. కీరవాణి మరో కుమారుడు కాలభైరవ అందించిన రిరికార్డింగ్ అదరకొట్టింది. సినిమాటోగ్రఫీ , ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి ఉంటే ..సెకండాఫ్ కూడా బాగుండేది. సినిమా మరో స్దాయికి వెళ్లేది.
చూడచ్చా..
కొత్త జానర్ సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్లు చూడదగ్గ సినిమా
తెర వెనక..ముందు
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: శ‌్రీసింహ, సత్య, నరేష్ అగస్త్య , అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, అజయ్, విద్యుల్లేఖా రామన్, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: కాల భైరవ
కెమెరా: సురేష్ సారంగం
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత,
కథ, దర్శకత్వం: రితేష్ రానా
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2019