Reading Time: 2 mins

మన్మథుడు-2 మూవీ రివ్యూ

ఆగిపోయాడు( `మన్మథుడు-2` రివ్యూ)
 
Rating:2/5

నాగార్జున కెరీర్ చెప్పుకోదగ్గ సినిమా `మన్మథుడు`. ఆయన రొమాంటిక్ ఇమేజ్ ని రెట్టింపు చేస్తూ వచ్చిన ఆ రొమాంటిక్ కామెడీ అప్పట్లో బాగానే ఆడింది. అయితే ఇప్పటి నాగార్జునకు వయస్సు పై బడింది. కోడలు వచ్చింది. ఇంకా పెళ్లి కానీ నడి వయస్కుడులా చెయ్యాలనుకోవటం సాహసమే. సర్లే మీడియా వాళ్లు నవ మన్మధుడు..కొడుకులకు  పోటీ పడుతున్నారు అంటున్నారు..అందులో నిజమూ ఉంది కాబట్టి ఓకే. మన్మధుడు టైటిల్ తో, సీక్వెల్ అంటూ వస్తున్న సినిమా కాబట్టి క్రేజ్ క్రియేట్ అవుతుందని తెలుసు.  ఆ క్రేజ్ ని సినిమా నిలబెట్టిందా..అప్పటి సినిమాకు, ఈ సినిమాకు ఏదన్నా పోలిక ఉందా…అసలు ఈ సినిమా కథేంటి..దీనికి మన్మదుడు 2 అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి… ఆ ప్రెంచ్ రీమేక్ ..తెలుగునేటివిటీకి వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

స్టోరీ లైన్

ఫోర్చుగల్ సో సెటిలైన సామ్‌ అలియాస్ సాంబశివ రావు (నాగార్జున అక్కినేని) ఫెరఫ్యూమ్స్ బిజినెస్ మ్యాన్. అతనికి నడివయస్సు వచ్చినా పెళ్లికాదు. అది వాళ్లమ్మ(లక్ష్మి) కి బెంగ .  తను బ్రతికి ఉండగానే ఇంటికి కోడలు రావాలని కోరుకుంటుంది. కానీ బ్యాచులర్ జీవితానికి బాగా అలవాటు పడ్డ సామ్కి  పెళ్లి, కాపురం వంటివి ఇష్టం ఉండవు. చక్కగా రోజుకో అమ్మాయితో లైఫ్ లీడ్ చేస్తూంటాడు. కానీ ఓ రోజు ఇంట్లో వాళ్లంతా మీటింగ్ పెట్టుకుని ఎట్టిపరిస్దితుల్లోనూ సామ్ కు పెళ్లి చేసేయాలని ఫిక్సై ..ఒత్తిడి తెస్తారు. తల్లి బాధపడలేక…అలాగని తను ఇరుక్కోవటం ఇష్టం లేక ఓ నాటకానికి తెర తీస్తాడు.

వెయిట్రెస్ గా పనిచేసే  అవంతిక (ర‌కుల్‌ప్రీత్ సింగ్‌) అనే అమ్మాయితో గంటకు ఇంత అని మాట్లాడుకుని తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమెని ప్రేమిస్తున్నానని ఆమెని తీసుకొచ్చి ప‌రిచ‌యం చేస్తాడు. ఆ  నాటకం క్లైమాక్స్ ఏమిటంటే… పెళ్లి రోజున చెప్పా పెట్టకుండా వెళ్లిపోయేలా ఆమెతో  ఎగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు. అయితే అది బెడిసికొడుతుంది. ఊహించని విధంగా అవంతికతో అతని ఫ్యామిలీ మొత్తం ఎమోషన్ పెంచుకుంటుంది. చివరకు ఏమైంది. అవంతికతో సామ్ కు పెళ్లైందా…ఈ నాటకం విషయం ఇంట్లో తెలిసిపోయిందా, అసలు సామ్ ..పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి రావటం వెనక ఏమన్నా ప్లాష్ బ్యాక్ ఉందా .. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
ఎలా ఉందంటే..

కొన్ని కథలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటూంటారు కానీ నిజానికి వాటిలో చాలా కాలం చెల్లినవి ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి…హీరో తన భార్యగా లేదా లవర్ గా నటించమని హీరోయిన్ ని మాట్లాడుకుని ఇంటికి తీసుకువెళ్లటం. ఎన్నో సార్లు తెరకెక్కి …మంచమెక్కిన ఈ స్టోరీ లైన్ …మళ్లీ మన ముందుకు వస్తుందని ఊహించం. అదీ ఓ ఫ్రెంచ్ రీమేక్   I Do (2006)  రూపంలో. ఈ సినిమా చూసాక..ఇంతోటి కథకు రైట్స్ కొనటం ఎందుకు..ఆ సినిమా డీవిడి కవర్ కొన్నా సరిపోతుంది కదా అనిపిస్తుంది. అంత నాశిరకంగా ఉంటుందీ ఈ కథ. ఆ మాత్రం కథ తెలుగులో రాసేవాళ్లు లేకా…లేక అక్కడ వర్కవుట్ అయ్యింది కదా ఇక్కడా ఆడుతుందనో భ్రమో అర్దం కాదు. సినిమా మొత్తం మీద ఎక్కడా కొత్తదనం అనేది కనపడదు. నాగార్జున అచ్చతెలుగులో మాట్లాడటానికి  ప్రయత్నించటం మాత్రమే కాస్తంత కొత్తగా…ఇంకా చెప్పాలంటే వింతగా కనిపిస్తుంది.
 
 అప్పటి  `మన్మథుడు` తో పోలిక

నిజానికి ఈ సినిమాకు అప్పటి  `మన్మథుడు` కు టైటిల్, హీరో విషయంలో తప్ప దేంట్లోనూ పోలిక లేదు. అంతేకాదు కంటెంట్ క్వాలిటీ విషయంలో అప్పటి సినిమాకు దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు. అప్పటి మన్మధుడు చిత్రం కూడా వాట్ వుమెన్ వాంట్స్ నుంచి లేపిందే అయినా చక్కటి ఎడాప్షన్. ఇప్పుడు హక్కులు కొనుక్కుని చేసినా నేటివిటి తేలేకపోయారు. ఎడాప్షన్ సరిగ్గా లేదు. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ, అవంతిక‌గా ర‌కుల్‌ గ్లామర్ తో రచ్చ చేసినా,సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ మ్యాజిక్ మిస్సైంది.,,ఫన్ కూడా లేదు.
 
టెక్నికల్ గా..
 ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ హైక్లాస్ గా ఉన్నాయి. అలాగే చైత‌న్ భ‌రద్వాజ్ మ్యూజిక్, సుకుమార్ కెమెరా ప‌నిత‌నం కలిసొచ్చాయి. సినిమా అంత బోర్ కొట్టినా చూడగలిగాం అంటే…పోర్చుగ‌ల్ ని అంత అందంగా కెమెరామెన్ సుకుమార్ ప్రెంజెంట్ చేసారు. ద‌ర్శకుడిగా రాహుల్ ర‌వీంద్రన్ మెప్పించ‌లేక‌పోయారు. తెలుగు సినిమాకు వచ్చేసరికి కథలో ఉన్న ఆ కాంప్లిక్ట్ సరిపోదని ఆయన అర్దం చేసుకోలేకపోయారు. దాంతో అవే  సినిమాకి మైన‌స్‌గా మారింది.
 
చూడచ్చా…
మరీ వీకెండ్ కాలక్షేపం ఏమీ లేకపోతే ఓ లుక్కేయచ్చు,

డబుల్ మీనింగ్ లు బాగా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీలకు కష్టం, యూత్ ని ఆకట్టుకునే కథ కాబట్టి వాళ్లు రావటం కష్టమే.

ఆఖరి మాట…
 త్రివిక్రమ్ పంచ్ లు, బ్రహ్మానందం కామెడీలేని  `మన్మథుడు` ని భరించటం కష్టమే

 

ఎవరెవరు…

న‌టీన‌టులు: నాగార్జున‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌ కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు
దర్శకత్వం: రాహుల్ ర‌వీంద్రన్‌
నిర్మాత‌లు: నాగార్జున, పి.కిర‌ణ్‌
సంగీతం:  చైత‌న్య భ‌రద్వాజ్‌
ఛాయాగ్రహ‌ణం: ఎం.సుకుమార్‌
ప్రొడక్షన్‌ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్రన్, స‌త్యానంద్‌
కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌, బి.నాగేశ్వర రెడ్డి
సంభాష‌ణ‌లు: కిట్టు విస్సా ప్రగ‌డ‌, రాహుల్ ర‌వీంద్రన్‌
నిర్మాణ సంస్థలు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌
విడుద‌ల‌: 9-8-2019
క‌థ‌నం: రాహుల్ ర‌వీంద్రన్, స‌త్యానంద్‌
క‌ళ‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
సంగీతం: చైత‌న్య భ‌రద్వాజ్‌
ఛాయాగ్రహ‌ణం: ఎం.సుకుమార్‌
నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
ద‌ర్శక‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌