స్పూర్తిమంతం ( ‘మల్లేశం’ రివ్యూ)
Rating: 2.5/5
బయోపిక్ లు అంటే భయోపిక్ లుగా మారుతున్న రోజులివి. ఏ రోజున ఏ నాయుకుడు బయోపిక్ తెరకెక్కి మన తాట తీస్తుందో అని ప్రేక్షకులు తెర వెనక దాక్కుంటున్నారు. అలాంటి పరిస్దితుల్లో ఎక్కడో ఓ మారుమూల పల్లెటూళ్లో పుట్టి ఆసు యంత్రాన్ని కనిపెట్టి పద్మశ్రీ పొందిన చింతకింది మల్లేశం జీవిత కథ తెరకెక్కించటం సాహసమే. అయితే సామాన్యాలు చేసే ఆ సాహసాలకు పెద్దగా గుర్తింపు ఉండదు. సురేష్ బాబు లాంటి సినీ పెద్ద పూనుకోవటం తో భాక్సాఫీస్ దగ్గర పూనకాలు వచ్చే రీతిలో పబ్లిసిటీ జరిగింది. అయితే మల్లేశం జీవితంలో సినిమా తీయదగ డ్రామా ఉందా… ఇలాంటి సినిమాలు కమర్షియల్ ఫార్మాలాలు నచ్చే జనాలకు నచ్చుతాయా, తెలంగాణా స్లాంగ్ తో వచ్చిన ఈ సినిమా ఆంధ్రా జనాలను అలరిస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. స్టోరీ లైన్ అది 1980. తెలంగాణాలో ఓ పల్లెలో లో మిడిల్ క్లాస్ కుర్రాడు మల్లేశం (ప్రియదర్శి). తల్లి తండ్రి చేనేత పని చేస్తే కానీ జీవితం నడవని పరిస్దితి. అయితే చేనేతకు అంతగా ఆదరణ లేని రోజులివి. అలాగని వేరే వృత్తికి వలసపోలేని పరిస్దితులు. దాంతో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చీర నెయ్యాల్సిందే, జీవితం కొనసాగించాల్సిందే. ఈ పరిస్దితుల్లో మల్లేశం చదువు కూడా సాగదు. ఆరవ తరగతిలోనే అంటకాగిపోతుంది. మరో ప్రక్క ఇంట్లో తన తల్లి లక్ష్మి (ఝాన్సి) రోజుకు వందల సార్లు చేయి తిప్పుతీ ఆసు పోయటం వల్ల భుజం నొప్పితో విలవిల్లాడుతుంది. తన లాంటి తల్లులు ఎంతో మంది మల్లేశానికి కనపడతారు. ఏదో చేయాలి తన తల్లి కన్నీటిని తుడవాలనిపిస్తుంది. కానీ ఏం చేయగలడు తను. ఉన్న పరిస్దితులనే చక్క దిద్దాలి. తన వృత్తిలో ఇబ్బందులే తగ్గించాలి. ముఖ్యంగా ఆసు యంత్రం ఉంటే తన తల్లికి శ్రమ తగ్గుతుంది. ఇదే ఆలోచన మల్లేశం కు నిద్రపట్టనివ్వదు. దాంతో తన తెలివి ఉపయోగించి ఆసు యంత్ర కనుక్కోవాలి అని ప్రయత్నం చేస్తాడు. ఇంజనీర్లకే సాధ్యం కాని ఆ విద్య ఆరవ తరగతి తో చదువు ఆపేసిన వాడికి ఎక్కడ పట్టుపడుతుంది. ముందుకు వెళ్లక పట్టుపడుతుంది. కానీ మల్లేశంలో పట్టుదల సామాన్యమైనది కాదు. ఎవరమేన్నా…ఎన్ని అవమానాలు ఎదురైనా తను అనుకున్నది సాధించేందుకు కృషి చేస్తాడు. చివరకు అనుకున్నది సాధిస్తాడు. అయితే ఈ జర్ని ఇక్కడ రాసినంత ఈజీగా జరగలేదు. ఒకానొక టైమ్ లో ఆత్మహత్య చేసుకునేంత నిరుత్సాహాన్ని సైతం వచ్చింది. వాటిని ఎలా మల్లేశం తన అధిగమనించాడు. అందరికీ ఎలా స్పూర్తిగా నిలిచాడో తెరపైనే చూడాల్సిన సినిమా. ఏముందీ సినిమాలో మల్లేశం కనుక్కున్న లక్ష్మీ ఆసు యంత్రం ఎంతగా సక్సెస్ అయ్యిందంటే ఇది కనుక లేకపోతే ఈ రోజున చేనేత పరిశ్రమ అనేది కేవలం మనం పుస్తకాల్లో చదువుకుందుము. ఇది ఓ ఓ విజయగాధ. ఆశయం ఉన్నతమైనది అయ్యినప్పుడు దానికి డబ్బు,చదువు వంటివి అడ్డంరావు అని నొక్కి మరీ చెప్తుంది. ఈ నిజ జీవిత కథను వాస్తవిక ధృక్పధంలో స్క్రిప్టు రాసుకుని ఆర్ట్ ధోరణిలో తెరకెక్కించారు. దాంతో సినిమా చూస్తున్నట్లు కాకుండా ఓ కుటుంబాన్ని చూస్తున్నట్లే అనిపిస్తుంది. అంతవరకూ దర్శకుడు సక్సెస్. అయితే ఇది కమర్షియల్ గా ఎంత వరకూ సక్సెస్ అవుతుందనే విషయం చెప్పలేం. కాకపోతే లోబడ్దెట్ సినిమా కాబట్టి పెట్టుబడి వెనక్కి రావటం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే రిలీజ్ కు ముందు వచ్చినంత బజ్ కు తగ్గట్లుగా అయితే సినిమా నిలచేలా మాత్రం లేదు. అయితే సినిమాలో భాగంగా తెలంగాణ సంస్క్రృతి, జీవన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం మాత్రం ప్రశంసనీయం. ఫస్టాఫ్ అలా..సెకండాఫ్ ఇలా.. మల్లేశం చివరికి ఆసు యంత్రాన్ని కనుక్కున్నాడన్న సంగతి సినిమా మనకి ముందే తెలుసు కాబట్టి …దాన్ని ఎంత ఇంట్రస్టింగ్ గా , ఎమోషనల్ గా చూపెడతారనేదే టాస్క్. ఈ సినిమా ఫస్టాప్ ..మల్లేశం జీవితంలో చిన్నతనం నుంచి మొదలెట్టి వరసపెట్టి చూపెడుతూ సరదాగా నడిపారు. ఎప్పుడైతే ఆసు యంత్రం కనుక్కోవాలన్న ఆలోచన మల్లేశంలో పుట్టిందో అప్పుడు కథలోకు సీరియస్‌నెస్ తెచ్చారు. సెకండాఫ్ మొత్తం ఆసు యంత్రం కోసం మల్లేశం చేసే కష్టమే కనిపిస్తుంది. ప్రయత్నించడం, ఓడిపోవడం, మళ్లీ ప్రయత్నించటం.. క్లైమాక్స్ దాకా ఇదే సాగుతుంది. టెక్నికల్ గా…. అభిరుచి ఉన్న దర్శకుడు తీసిన ఈ సినిమా అని మొదటి సీన్ నుంచే అర్దం అవుతుంది. ముఖ్యంగా కమర్షియల్ సూత్రాలకు లొంగిపోకుండా ఈ కథని నిజాయతీగా చెప్పే ప్రయత్నం ప్లస్ అయ్యింది. సీన్స్ అందుకు రాసుకున్న మాటలు చాలా సహజంగా ఉన్నాయి. పాటలూ ఆకట్టుకుంటాయి. ఆనాటి వాతావరణాన్ని తెరపై ప్రతిబింబించేందుకు టీమ్ పడ్డ కష్టం, కృషి ప్రసంశనీయం. మార్క్ రాబిన్ మ్యూజిక్ , శాండిల్యస కెమెరా వర్క్, ఏలే లక్ష్మణ్ కళా దర్శకత్వం ఒక దానకొకటి పోటీ పడ్డాయి. పెద్దింటి అశోక్ కుమార్ తెలంగాణా మాటలు…డైలాగుల్లా కాకుండా నిజాయితీ గా ఉన్నాయి.ఎక్కడా అనవసర ప్రాసల కోసం పాకులాడలేదు. సెట్స్ వేయడం కాకుండా నేచురల్ లొకేషన్స్ లో తీయడం వల్ల కూడా సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. ఇదొక్కటే ఈ సినిమాకు సమస్య మొదటే చెప్పుకున్నా ఈ సినిమా ఆర్ట్ సినిమాలో ధోరణిలో ఉంటుందని. స్లో నెరేషన్ లో కథ నడుస్తుంది. అలాగే సెకండాఫ్ లో సినిమాలో ఏమీ జరిగినట్లు అనపించదు. అలాగే కథకు అవసరం లేని కొన్ని కామెడీ సీన్స్ ను లేపేయాల్సింది. ప్రియదర్శి ఎలా చేసాడు కెరీర్ ప్రారంభం నుంచి కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి తనలో ఓ మంచి నటుడు ఉన్నాడన్న విషయం ఈ సినిమాతో ప్రూవ్ చేస్తాడు. యాంకర్ ఝాన్సీ మల్లేశం తల్లిగా మంచి నటన కనపరిచింది. తండ్రిగా చక్రపాణి నూటికి నూరుశాతం మార్కులు పడతాయి. ఆర్.ఎస్ నంద, గంగవ్వ, తాగుబోతు రమేష్ పాత్రల పరిధిమేరకు మెప్పించారు.
చూడచ్చా…
వాస్తవిక చిత్రాలు చూడటం మీద ఆసక్తి ఉంటే…ఖచ్చితంగా నచ్చుతుంది.
చివరి మాట…
సినిమాటిక్ మలుపులేం కనిపించని ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా లవర్స్ కు ఎంతవరకూ నచ్చుతుందో చూడాలి.
నటీనటులు:
ప్రియదర్శి, అనన్య నాగల్ల, చక్రపాణి ఆనంద, జగదీశ్ ప్రతాప్, ఝాన్సీ తదితరులు
సంగీతం: మార్క్ కే రాబిన్
నిర్మాణ సంస్థ: శ్రీ అధికారి బ్రదర్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ రాచకొండ
విడుదల తేదీ: 21-06-2019