మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ
నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
కోవిడ్ తర్వాత కంటెంట్ డ్రైవన్ ఫిల్మ్స్ కే జనం ఓటేస్తున్నారు. రొటీన్ ఫార్ములా చిత్రాలకు నో చెప్పేస్తున్నారు. అరెస్టింగ్ స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్ నేరేషన్ లేకపోతే రెండు గంటలు పైగా సమయాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఇలా ప్రేక్షకాభిరుచి మారిన నేపధ్యంలో రిలీజైన మాచర్ల నియోజక వర్గం ఏ మేరకు జనాలను ఆకట్టుకుంది. పక్కా మాస్ మసాలా సినిమాగా చెప్పబడుతున్న ఈ చిత్రం భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అవుతుందా….నితిన్ కు హిట్ అందిస్తుందా రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
సిద్దు(నితిన్) ఓ IAS ఆఫీసర్. పోస్టింగ్ ఇంకా ఇవ్వక వెయిటింగ్ లిస్ట్ లో ఉండి, ఖాళీగా ఉండటం ఎందుకన్నట్లు స్వాతి (కృతి శెట్టి) తో ప్రేమలో పడతాడు. అయితే ఆమెని రాజప్ప (సముద్ర ఖని) కొడుకు వీర ఇబ్బంది పెడుతూంటాడు. రాజప్ప ఎవరూ అంటే …గత ముప్పై ఏళ్లుగా ‘మాచర్ల నియోజకవర్గం’నుండి ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న ఏకైక ఎమ్మెల్యే. రాజప్ప అక్కడ ఎలక్షన్స్ జరగనివ్వడు. మరొకడుని రానివ్వడు. ఈ క్రమంలో సిద్దు …గుంటూరుకు కలెక్టర్ గా వెళ్తాడు. అక్కడకు వెళ్లాక ఇద్దరి మధ్యా వార్ ప్రారంభమవుతుంది. అక్కడ కొన్ని ఏళ్లపాటు ఎన్నికలు జరగటం లేదని, అందుకు కారణం రాజప్ప అని తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో సిద్ధార్థ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ….
ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్ వున్న సగటు సినిమా కథ ఇది. ఈ విషయంలో ప్రేక్షకుడికి ముందే ఒక ప్రిపరేషన్ చేద్దామని ఇది ఫక్తు కమర్షియల్ సినిమా అని చెప్తూ వచ్చారు. అయితే కమర్షియల్ సినిమా అంటే ఇంత నాశిరకంగా ఉంటుందని ఎవరూ భావించరు. సినిమా ప్రారంభమైన కాస్సేపటికే ఓపిక నశించే వ్యవహరంగా మారే పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత దారుణంగా కథ,కథనం రెడీ చేసారో అర్దం చేసుకోవచ్చు. విలన్ ,హీరో, ఓ చిన్న కాంప్లిక్ట్ అనుకున్నారు. కానీ ఆ కాంప్లిక్ట్స్ రొటీన్ గా ఉండటంతో డ్రామా పండలేదు. అందుకే ఈ చిత్రంలోని సన్నివేశాలు అలా సాగుతూనే వుంటాయి. అయితే ఎక్కడా మనం కనెక్ట్ కాము. ఎక్కడో చోట ఎమోషనల్ జర్నీకి లీడ్ ఇస్తుందేమో అని ఎదురుచూస్తాము కానీ అది జరగదు. 1990 లో వచ్చి ఉంటే ఆడి ఉండేది. అప్పటి ప్రేక్షకుల మూడ్ వేరు. ఇలాంటి యాక్షన్ సినిమాని చూడటానికి కూడా ఎలాంటి ఫిర్యాదులు ఉండేవి కాదు. అయితే అప్పటి కథని, స్క్రీన్ ప్లే ని 2022లో ప్రజంట్ చేస్తున్నపుడు నిడివి, టెక్నిక్ విషయంలో మార్పులు చేస్తుంటే బావుండేది. ఎలాంటి మార్పులు లేకుండా అదే స్క్రీన్ ప్లేని ఫాలో కావడం ఈ సినిమాకు పెద్ద లోపం. అసలు ఆ పాత సినిమా ఏదన్నా రీమేక్ చేసారేమో అని డౌట్ కూడా వచ్చేస్తుంది.
అలాగే విలన్ ని ఇంట్రడ్యూస్ చేయగానే … ఫస్ట్ సీన్ నుంచే అసలు పాయింట్ చుట్టూ సన్నివేశాలు నడపుతున్నాడని ఆశపడతాం. కానీ అది అక్కడే ఆగిపోతుంది. ఎనభయ్యో దశకంలోని సినిమాలా.. హీరో వీరుడు శూరుడని చూపించడానికి చాలా రన్ టైమ్ తినేశారు. మిగతా టైమ్ లవ్ ట్రాక్ ముంచెసింది. అది చాలదన్నట్లు ఇద్దరు హీరోయిన్స్. ఆ హీరోయిన్ కు విలన్ కొడుకుతో ఎటాక్ వంటివి దర్శకుడి అవుట్ డేటడ్ ఆలోచనలు అద్దం పడతాయి. నిజానికి ఒక మాస్ హీరోతో సినిమా ఎలా చేయాలి ?! ఆల్రెడీ అతనికి ఒక ఇమేజ్ వుంటుంది. ఒక్క సీన్ తో ఒక మాస్ హీరో క్యారెక్టర్ చెప్పొచ్చని డైరక్టర్ కు ఆలోచన రాలేదు. ఎందుకంటే నితిన్ వంటి హీరోకి ఇమేజ్ వుంటుంది కాబట్టి ప్రేక్షకులు దాన్ని చాలా సులువుగా అర్ధం చేసుకుంటారు.
ఈ విషయంలో దర్శకుడి ఆలోచనలు బీసీ కాలంలో వుండిపోయాడని సినిమా చివరిదాకా ప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఇంట్రవెల్ వరకూ అసలు కథలోకి వెళ్ళలేదు. కథలోకి వెళ్ళిన విధానం కూడా ఇంట్రస్టింగ్ గా వుండదు. ఎలక్షన్స్ చుట్టూ కథ రాసుకున్న దర్శకుడు మొదట్లో కొంత క్యూరీయాసిటీ క్రియేట్ చేయగలిగారు. అయితే సెకండాఫ్ లో హీరో ఆ సమస్యని చేధించే క్రమంలో చేసిన సీన్స్ ,విధానం ఏ మాత్రం ఆసక్తికరంగా వుండదు. కథ ఇప్పడు జరుగుతుంది కానీ ట్విస్ట్ లు టర్న్ లు మాత్రం ఆనాటివే. స్క్రీన్ ప్లే ఎక్కడా వేగం వుండదు. ఫైట్లు కథలో ఇమిడలేదు. ప్రతి పదినిమిషాలకు ఏదో గ్యాంగ్ హీరో పై ఎటాక్ చేయడం, హీరో వాళ్ళని చిత్తకొట్టడం.. ఇదే యాక్షన్ తంతు నడుస్తుంది. మధ్యలో హీరోయిన్ తో పాటలు, ఓ ఐటం సాంగ్..ఇంతకు మించి మాస్ హీరోలకు ఏమి కావాలనుకున్నారేమో ..అదే చేసాడు డైరక్టర్.
హైలెట్స్:
నితిన్ మాస్ అప్పీల్
రారా రెడ్డి సాంగ్
వెన్నెల కిషోర్ కామెడీ
జాతర ఫైట్
మైనస్ లు :
పాతికేళ్ల క్రితం నాటి కథ,కథనం
ఆ కధను తెరకెక్కించిన తీరు
లెంగ్తీ యాక్షన్ ఎపిసోడ్స్
టెక్నికల్ గా ….
ప్రసాద్ మూరేళ్ళ కెమెరా వర్క్ బాగుంది. ఫైట్ కొరియోగ్రాఫర్స్ కష్టం బాగా కనపడింది. దర్శకుడు స్వతహాగా ఎడిటర్ అయినా కొంత ల్యాగ్ లు వదిలేసాడు. ఫస్ట్ హాఫ్ లో విషయం లేకపోయినా ట్రిమ్ చేయకుండా వదిలేసాడు. సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. పాటల్లో ‘రారా రెడ్డి’, ‘రాను రాను’ తప్ప మిగతావి ఆకట్టుకోవు. డైలాగ్స్ అసలు బాగోలేవు. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కమర్షియల్ సినిమా అని లెక్కలేసుకుని ఒక కమర్షియల్ సినిమా ఎలా తీయకూడదో అలా తీసాడు.
నటీనటుల్లో … విలన్ గా సముద్ర ఖని లుక్ డిఫరెంట్ గా ఉంది కానీ క్యారక్టర్ లో విషయం లేదు. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ ఫరవాలేదు. మంచి రిలీఫ్. నితిన్ గెటప్ మార్చాడు కానీ నటన మారలేదు. కలెక్టర్ అయినా మరొకరు అయినా ఒకటే అన్నట్లు సాగిపోయింది. స్పెషల్ సాంగ్ ‘రారా రెడ్డి’ లో నితిన్, అంజలి ల కెమిస్ట్రీ, మాస్ డ్యాన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కృతి శెట్టి ఓకే. కేథరిన్ థ్రెసా గురించి అయితే చెప్పుకోవటానికి ఏమీ లేదు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాజీ, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, శ్యామల వంటి వారు సినిమా చేస్తున్నాం కాబట్టి చేసాం అన్నట్లు కనపడి వెళ్లిపోతారు.
చూడచ్చా
రొటీన్ సినిమాలు చూడటం ఇష్టం అనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా నచ్చే ఫిల్మే.
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, అంజలి (స్పెషల్ సాంగ్), వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాజీ, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, శ్యామల తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్ : మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్, రవివర్మ, అనల్ అరసు
రన్ టైమ్ : 160 నిముషాలు
రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి
సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
విడుదల తేదీ: ఆగస్ట్ 12, 2022