మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ రివ్యూ

Published On: November 21, 2020   |   Posted By:

మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ రివ్యూ

Rating:2.5/5

ఆ మధ్యన యండమూరి గారు ఇడ్లీ – వడ – ఆకాశం  అనే పుస్తకం రాసారంటే… హోటల్ బిజినెస్ మీద ఈ పుస్తకాల బిజినెస్ ఏమిటా అని సరే చదివితే తెలిసిపోతుంది కదా …మొదలెడితే ఆపలేకపోయాము. అంత అద్బుతం ఆ పుస్తకం. సినిమాల్లో ఏవో సర్వర్ సుందరం లాంటి సినిమాలు అడపాదడపా తప్పించి, హీరో హోటల్ పెట్టి డవలప్ అవటం అనే మ్యాటర్ చుట్టూ తిరిగే కథలు అరుదు. కానీ ఓ కొత్త దర్శకుడు తన తొలి చిత్రం నేపధ్యం ఓ హోటల్ పెట్టుకుందామనే కుర్రాడు చుట్టూ నడపటం అనేది ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పుడు కుర్రాళ్లంతా సాప్ట్ వేర్ అంటూ పరుగెడుతూంటే..హోటల్ పెట్టుకుంటా..బొంబై చెట్నీ చేసుకుంటా అనటం వింతే కదా. ఆ వింతకు దారి తీసిన సంఘటనలు ఏమిటి..ఏమిటా కుర్రాడి ధైర్యం…హోటల్ పెట్టి ఏం సాధిద్దామని..ఏ ఉద్యోగం చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వక అని వచ్చే అనేక సందేహాలు కు ఈ సినిమాలో ఏ స్దాయి సమాధానం ఇచ్చారో రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్


అనగనగా గుంటూరు దగ్గరలో ఓ విలేజ్ లో రాఘవ (ఆనంద్ దేవరకొండ) అనే కుర్రాడు. అతనికి తను బొంబై చెట్న అద్బుతంగా చేయగలనని పెద్ద నమ్మకం. దాంతో ఈ విలేజ్ లో తన టాలెంట్ వృధా అవుతుందని గుంటూరులో హోటల్ పెట్టుకోవాలని బయిలుదేరతాడు. ఉన్న ఊరు వదిలేసి, బోలెడెంత పెట్టుబడి పెట్టి హోటల్ పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారు. కానీ కన్న తల్లితండ్రులు కదా..మొదట కసురుకున్నా ఆ తర్వాత సరే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..కాస్తంత ఆర్దిక సాయిం కూడా చేసాడు. అయితే అక్కడ నుంచే అసలు కథ మొదలైంది. రాఘవ పెట్టిన వ్యాపారం క్లిక్ అవటానికి దారిలో ఎన్నో అడ్డంకులు..చివరకు ప్రేమించిన అమ్మాయితో సహా ఎవరూ ఎంకరేజ్ చేసేవాళ్లు లేరు. కానీ కుర్రాడు గుంటూరోడు…వెనక్కి తిరక్కూడదనుకున్నాడు. తన హోటల్ బిజనెస్ నిలబెట్టుకున్నాడు. అదే ఎలా నిలబెట్టుకున్నాడు అనేదే కదా మీ ప్రశ్న. దానికి సమాధానం సినిమాలో దొరుకుతుంది.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్

మళయాళ సినిమాల్లో ఇలాంటి కథలు కనపడుతూంటాయి. ఉస్తాద్ హోటల్ లాంటి సినిమాలు అక్కడ బాగా ఆడాయి. కానీ ఆడతాయో లేవే అని రీమేక్ చేయటానికి కూడా భయపడ్డారు. మళయాళీలు ఆవిష్కరించే ఆఫ్ బీట్ ధోరణి ఎంతవరకూ మనవాళ్లకు నచ్చుతుందో ఇప్పుటికీ డౌటే. అయితే ఇప్పుడిప్పుడే ఆహా వాళ్లు మళయాళ డబ్బింగ్ లు దింపుతున్నట్లు..మనవాళ్లూ మళయాళ సినిమాల తరహా వైవిధ్యమైన వాటిని ఇక్కడా అందించాలనే తాపత్రయం మొదలైంది. అందులో భాగంగా ఇది వచ్చిందని అనిపిస్తుంది. సినిమాలో ఒరిజినాలిటీ కనపడింది కానీ స్టీరియో టైప్ క్యారక్టర్స్ ఆ ఫ్రెష్ నెస్ ని మింగేసాయి. కామెడీ కోసం పాత్రలను కాస్త ఓవర్ చేయటం బోర్ కొట్టిస్తుంది. ఇక కథ విషయానికి వస్తే…సినిమా స్టోరీలైన్ చాలా చిన్నది..కాంప్లిక్ట్ అనేది చెప్పుకోదగిన రీతిలో లేదు. అలాంటప్పుడు అదిరిపోయే,ఆకట్టుకునే సీన్స్ ఎలా వస్తాయి.

హీరో పెద్ద కష్టాన్ని ఎదుర్కొవటమో లేక పెద్ద లక్ష్యాన్ని సాధించాలని తిరిగితేనే కదా…మనకు దాన్ని సాధించగలడా లేదా అనే సందేహం..డౌట్..సస్పెన్స్…ఆసక్తి వగైరా.ఇక్కడ హోటల్ పెట్టాలనుకున్నాడు. పెట్టకపోయినా జీవితంలో కోల్పోయేదీ లేదు. ఆ బొంబై చెట్నీ ఏదో మళ్లీ తన ఊరు వచ్చి తన తండ్రి హోటల్లో చేసుకోవచ్చు. అలాగే హీరోయిన్ తో లవ్ మ్యాటర్ అయితే ఇంకా ఈజీ. ఆ అమ్మాయే మనసుపడి వెనకబడుతోంది. ఈ హోటల్ క్లిక్ అవటంతో ఆమెకు సంభందం లేదంది. ఇక కథలో సంఘర్షణ ఎక్కడుంది. ఏవో సీన్స్ నడుస్తూంటాయి. కొన్ని నవ్విస్తే..మరికొన్ని బ్లాంక్ ఫేస్ వేసుకుని చూసేలా ఉంటాయి. అయితే స్టోరీలైన్ కొత్తది కావటంతో కొంత కొత్తదనం అయితే చోటు చేసుకుంది. దాన్ని ఎంజాయ్ చేయచ్చు.

ఎవరెలా

ఈ సినిమాతో  ఆనంద్ దేవరకొండ పెద్దగా సాధించింది లేదు..పోగొట్టుకుందీ లేదు. గుంటూరు జిల్లా కథ చెప్తూంటే తెలంగాణా యాసలో డైలాగులు చెప్పటమే అతను చేసింది. అదే సమయంలో ఆ మిడిల్ క్లాస్ క్యారక్టర్ లో కూడా పెద్దగా అతని నుంచి ఏమీ డిమాండ్ చేయలేదు. ఇదో సేఫ్ గేమ్ లాంటిదే. ఇక తమిళ నటి వర్ష బొల్లమ్మ విషయానికి వస్తే ఆమె మిడిల్ క్లాస్ సెటప్ కు ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. కానీ ఆమె క్యారక్టరైజేషన్ సరిగ్గా రాసుకోలేదు.
 
 
దర్శకత్వం ,మిగతా డిపార్టమెంట్స్

ఇక కొత్త దర్శకుడు వినోద్ ..ఈ కథను ఫ్రెష్ ట్రీట్మెంట్ తో గెలవాలనే ప్రయత్నం చేసారు. అయితే ఇలాంటి సినిమాలకు ఈ స్దాయి కామెడీ సరిపోదు..మరింతగా ఉండాలి.  అలాగే ఎమోషన్స్ సైతం మరింత హై గా ఉండాలి. లవ్ స్టోరీ సైతం మరింత ఇంప్రెసివ్ గా చెయ్యాల్సింది. ఆ విషయంలో సక్సెస్ అయితే సినిమా మరింతగా నిలబడేది. మిగతా డిపార్టమెంట్స్ విషయానికి వస్తే కెమెరా వర్క్ బాగుంది. గుంటూరు సాంగ్, కీలు గుర్రం పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్,ప్రొడక్షన్ వ్యాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ చెప్పుకోదగిన రీతిలో ఉంది.

చూడచ్చా

కాలక్షేపానికి ఢోకాలేదు
 
ఎవరెవరు

నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, ప్రేమ్‌ సాగర్‌, ప్రభావతి వర్మ తదితరులు.
సంగీతం: స్వీకార్‌ అగస్తీ, ఆర్‌హెచ్‌ విక్రమ్‌
కెమెరా: సన్నీ కురపాటి
ఆర్ట్: వివేక్‌ అన్నామళై
ఎడిటర్‌: రవితేజ గిరజాల
స్క్రీన్‌ ప్లే: జనార్దన్‌ పసుమర్తి, వినోద్‌ అనంతోజు
మాటలు, కథ, కథనం: జనార్దన్‌ పసుమర్తి
దర్శకత్వం : వినోద్‌ అనంతోజు
నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్‌
రన్ టైమ్: 2 గంటల, 15 నిముషాలు
విడుదల: 20/11/20 (అమెజాన్‌ ప్రైమ్‌)