Reading Time: 3 mins

మిస్ట‌ర్ మ‌జ్నుమూవీ రివ్యూ

మ్యాజిక్ మిస్సైంది 

Rating: 2/5

హిట్ కొట్టాలంటే ఎలాంటి కథ చేయాలి…ఏది జనాలకు నచ్చుతుంది… ఇది సినిమా పరిశ్రమ పుట్టిన నాటి నుంచి నలుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా కనుక్కోలేకపోయినా, నిజాయితీగా ప్రయత్నం చేసిన వాళ్లకు హిట్ సినిమా దొరుకుతోంది.  అయితే ఆ హిట్ అయిన సినిమా నే ఓ ఫార్ములాగా భావించి …అదే రూట్ లో కథ,కథనం రాసుకుంటే ఇంకో హిట్ కొట్టచ్చా..రొటీన్ సినిమా అనిపించుకుని ప్లాఫ్ అవుతుందా…ఈ రోజు రిలీజైన అఖిల్ ‘మిస్ట‌ర్ మ‌జ్ను’  చిత్రం రొటీన్ గా సాగే హిట్ ఫార్ములాతో వచ్చింది. ఫార్ములా హిట్ కాబట్టి సినిమా హిట్ అవుతుందా…లేక రొటీన్ గా ఉందని జనం తిరస్కరిస్తారా… అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి (అఖిల్)…అమ్మాయిలని పడేయటంలో పీహెడీ చేసినట్లుంటాడు. ఇట్టే ఎట్రాక్ట్ అయిపోయి..ఎఫైర్ పెట్టేసుకుంటారు. అతికి ప్రేమ, పెళ్ళి వీటి మీద పెద్ద నమ్మకం ఉన్నట్లు కనపడడు. అలాంటివాడికి నిక్కీ (నిధి అగ‌ర్వాల్) పరిచయం అవుతుంది. ఆమే అతని భాగస్వామి అని మనకు అర్దం అవుతుంది. కానీ ఆమె మనస్తత్వం ఇతని క్యారక్టర్ కు పూర్తిగా అపోజిట్. తనను పెళ్లి చేసుకోబోయేవాడు శ్రీరాముడిలా ఉండాల‌ని క‌ల‌లు కనే ఓ సాధారణ అమ్మాయి. 
దాంతో సర్వ సాధారణంగానే విక్కీని,  అతని పద్దతని, అతను అమ్మాయిని డీల్ చేసే విధానాన్ని చూసి  అస‌హ్యించుకుంటుంది. కానీ ముందే అనుకున్నాం కదా వీళ్లిద్దరూ ఒకరికొకరు రాసి పెట్టి ఉన్నారని..దాంతో ఒకే ప్లైట్ లో ఇద్దరూ ఒకే పెళ్ళికి లండన్ నుంచి వస్తారు. తర్వాత తాము రెలిటివ్స్ అనే విషయం తెలుసుకుంటారు. ఆ పెళ్లిలో ..రకరకాల సంఘటనలతో ..విక్కీతో ఆమె ప్రేమలో పడి ప్రపోజ్ చేస్తుంది. కానీ విక్కీ స్కూల్ వేరు కదా..తాను ఎక్కువకాలం ఒకరితోనే ఉండలేనని  చెప్పేయటంతో ..సర్లే ఓ రెండు నెలలు డేటింగ్ చేసి చూద్దాం అంటుంది. 
అక్కడ నుంచి వీళ్లిద్దరి జర్నీ మొదలవుతుంది. అయితే రెండు నెలలు పూర్తయ్యాక..నీతో కష్టం అని విక్కీ ఆమెకు తెలిసేలా బిహేవ్ చేస్తాడు. ఆమె ప్రేమలో అతి ఉందని ఫీలవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నిక్కి..అతని నుంచి దూరం వెళ్లిపోతుంది. షరా మామూలే..ఆమె వెనక అతను బయిలుదేరతాడు. లండన్ వెళ్లి ఆమె మనస్సు గెలుచుకుని వెనక్కి వస్తాడు. ఈ క్రమంలో అతను పడ్డ ఇబ్బందులు ఏమిటి…అతను ప్లే బోయ్ మనస్తత్వం మారిందా వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎక్కడ తప్పు దొర్లింది

కెరీర్ ప్రారంభంలో పెద్ద డైరక్టర్స్ తో భారీ సినిమాలు కానీ వరసగా రెండు ప్లాఫ్ లు.ఓ మాదిరివాడైతే ఈ పాటకి మూటా ముళ్లూ సర్దేయ్యాల్సిన పరిస్దితి. కానీ వెనక అక్కినేని వారసత్వం ఒరిగిపోకుండా కాపాడుతోంది. మూడో సినిమా కీలకం.ఈ సారి రీసెంట్ గా హిట్ కొట్టి కుర్రకారు పల్స్ పట్టాడని పేరు తెచ్చుకున్న డైరక్టర్,పెద్ద బ్యానర్, లవ్ స్టోరీ ..అన్నీ పాజిటివ్ ఎలిమెంట్సే. కానీ అఖిల్ కు అవన్నీ ప్లస్ అయ్యినా ఈ సినిమాకు ఎంచుకున్న కథే దెబ్బకొట్టేసింది..ఇలాంటి పాత రొటీన్ ప్రేమ నగర్ కాలం నాటి కథతో   హిట్ అందుకోవటం కష్టమే అని తెలియచెప్పింది. ముఖ్యంగా ఈ సినిమా కథని అల్లుకున్న విధానమే బోర్ కొట్టించింది. ఫస్టాఫ్ సరదాగా గడిచిపోయినా కథలో సమస్య మొదలు కావాల్సిన చోటే సమస్య వచ్చి పడింది. సెకండాఫ్ అంతా పరమ రొటీన్ గా మారిపోవటానికి ఇంటర్వెల్ లీడ్ ఇచ్చింది. హీరోని వదిలేసి వెళ్లిపోయిన హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్లటం..ఆమెను తన వైపు తిప్పుకోవటానికి ట్రై చేయటం ఎన్ని సినిమాల్లో చూడలేదు. అదీ కొత్తగా చూపెడితే ఓకే..కానీ అవే సన్నివేశాలు రిపీట్ చేస్తే  విసుగువస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది. 

చెప్పేదేముంది

అఖిల్ కాన్ఫిడెంటో ..ఓవర్ కాన్ఫిడెంటో కానీ  బాగానే చేస్తున్నాడు. ఎమోషన్ సీన్స్ లో కాస్త డల్ అవుతున్నాడు కానీ, మిగతా డైలాగు డెలవరీ, డాన్స్ లలో వంటి చోట్ల దుమ్ము దులుపుతున్నాడు. కానీ అసలైన సమస్య కథలను ఎంచుకోవటంలోనే వస్తోంది.  ఇప్పటికే సెటిలైన స్టార్ హీరోల చేసే  కథలను ఎంచుకుంటున్నాడు. తను కెరీర్ ప్రారంభంలో ఉన్నాడు…దానికి తగ్గ కథ,కథనాలు వర్కవుట్ చేసుకోవాలని అతను ఎందుకు భావించటం లేదో మరి. ఈ పరాజయాలుంచైనా అతను పాఠాలు నేర్చుకుంటాడేమో చూద్దాం. 

సాంకేతికంగా..

కథ, స్క్రీన్ ప్లే విషయం తప్పిస్తే సాంకేతికంగా సినిమా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. త‌మన్ సంగీతం ఛల్తా హై అన్నట్లు సాగింది. జార్జ్ కెమెరా వర్క్ ఈ సినిమాకు పూర్తి ప్లస్. మిగతా   విభాగాలు కూడా సినిమాకు తమదైన స్దాయిలో కలిసి వచ్చాయి. నిర్మాణ విలువ‌లు  హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి మాత్రం తన  తొలి సినిమా ‘తొలిప్రేమ’ గుర్తు చేసాడు. అయితే ఆ మేజిక్ ఇందులో మిస్సైంది.

ఆఖరి మాట

లవ్ స్టోరీ  అంటేనే చక్కటి మ్యూజిక్..డైరక్టర్ చేసే మ్యాజిక్. ఆ రెండు మిస్సైతే మొత్తం సోలే గాయబ్.
 తెర వెనక, ముందు
 

న‌టీన‌టులు: అఖిల్ అక్కినేని, నిధి అగ‌ర్వాల్‌, ప్రియ‌ద‌ర్శి, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, హైప‌ర్ ఆది, సితార‌, ప‌విత్ర లోకేష్‌, విద్యుల్లేఖ రామ‌న్ త‌దిత‌రులుసంగీతం: త‌మన్‌ ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్‌ సి. విలియమ్స్‌ కూర్పు: నవీన్‌ నూలి క‌ళ‌: అవినాష్‌ కొల్లా నృత్యాలు: శేఖర్‌ నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌విడుద‌ల‌: 25-01-2019నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌నటీనటులు: అఖిల్ అక్కినేని, నిధిఅగ‌ర్వాల్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, రావు ర‌మేష్‌, నాగబాబు, విద్యుల్లేఖారామ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ అది, అజ‌య్‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులుసంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌కూర్పు: న‌వీన్ నూలిఆర్ట్‌: అవినాష్ కొల్ల‌నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి