మిస్‌ ఇండియా మూవీ రివ్యూ

Published On: November 4, 2020   |   Posted By:
మిస్‌ ఇండియా మూవీ రివ్యూ
 
 
మిస్ అయితే బాగుండేదయ్యా: ‘మిస్‌ ఇండియా’ రివ్యూ
 
Rating:2/5
 
ఓ అమ్మాయి అమెరికా వెళ్లి అక్కడ మెల్లగా ఓ టీ స్టాల్ పెట్టి క్రమంగా మహోజ్వలమైన  టీ సామ్రాజ్యాథినేతగా ఎదిగింది అదే సినిమా కథ అని చెప్తే నమ్మి తీస్తారా? జనం చూస్తారా…అనేది పెద్ద డైలమోతో కూడిన క్వచ్చినే. కానీ ‘మిస్‌ ఇండియా’ నిర్మాత అధిగమించారు. అక్కడ ఉన్నది కీర్తి సురేష్..కాబట్టి ధైర్యం చేయచ్చు..అనుకున్నారు. అదీ ఓ బయోపిక్ అయితే కాస్తంత ఇన్సిప్రేషన్ గా ఉండేదామో కానీ ఊహాత్మక కథ,కథనం తో దర్శకుడు ఈ ‘మిస్‌ ఇండియా’ ని తీర్చిదిద్దాడు. టైటిల్ చూసి ఇదేదో ‘మిస్‌ ఇండియా’ పోటీలకు సంభందించిన సినిమా అనుకుని ఉత్సాహపడతే మాత్రం అది మన తప్పే. ఇది ఖచ్చితంగా ఆ కథ కాదు. మరి ఏముంది ఈ కథలో ..అంతలా నమ్మి కీర్తి సురేష్ డేట్స్ ఎలా ఇచ్చింది. ఈ సినిమా ఆమె నమ్మకాలను నిలబెడుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

మానసా సంయుక్త (కీర్తి సురేష్)కు టీ అంటే మహా ఇష్టం. ఆ ఇష్టం ఏ స్దాయి అంటే..అనారోగ్యం వస్తే టీ తాగి తగ్గించుకుంటుంది. అఫ్ కోర్స్ అది ఆమె తాతగారు చేసే ప్రత్యేకమైన హెర్బల్ టీ అనుకోండి. తాతగారు విశ్వనాధ శర్మ (రాజేంద్రప్రసాద్) ఆ టీతోనే తన ఆయుర్వేద క్లినిక్ లో అనేక మందికి వైద్యం చేస్తారు. అది చూస్తూ పెరిగిన మన సంయుక్త..పెద్దయ్యాక అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లి అక్కడ టీ దొరకటం లేదని గమనించి, అక్కడో టీ స్టాల్ పెడుతుంది. అక్కడో టీ సామ్రాజ్యం స్దాపించాలని కలలు కంటుంది. ఆమె ఇంట్లోవాళ్లు, ప్రక్కింటివాళ్లు, తెలిసున్నవాళ్లు, తెలియనివాళ్లు అందరూ ఆమెను వెనక్కి లాగుదామనే చూస్తారు. ఆడపిల్ల ..బిజినెస్ చేయటం ఏమిటని బోలెడు ఆశ్చర్యపోతారు. చివరకు ఆమెను ఇష్టపడి ప్రేమించిన నవీన్ చంద్ర కూడా దూరమైపోతాడు. కానీ సంయుక్త అలాంటివాటికి బెదిరే అమ్మాయి కాదు. టీని ఎలాగైనా అమెరికా జనాలకు ఎడిక్ట్ అయ్యేలా చేయాలనుకుని నడుం బిగిస్తుంది. అయితే అదే సమయంలో అక్కడ ఆల్రెడీ మరో ఇండియన్ కైలాష్ (జగపతిబాబు) కాఫీతో కోట్ల రూపాయల టర్నోవర్ బిజినెస్ చేస్తూంటాడు. అతని వ్యాపారానికి ఈమె టీ బిజినెస్ దెబ్బకొడుతుంది. దాంతో అతను ఊరుకుంటాడా…ఆమెను దెబ్బ కొడతాడు. కానీ ఆమెలో ఉండే నిజాయితి,నీతి వగైరా ఆమెను నెంబర్ వన్ గా చేస్తాయి. ఇంతకీ కైలాష్ ఎలా దెబ్బ కొట్టాడు. ఆమె ఎలా తట్టుకుని నిలదొక్కుకుంది అనే విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ ఉండే మొహమాట పడకుండా ఈ కాఫీ ..టీ వార్ ని ఎంజాయ్ చేయచ్చు.
 

స్క్రీన్ ప్లే విశ్లేషణ

సినిమా  ప్రారంభంలోనే నేను ఎలా ఎదిగి నెంబర్ వన్ స్దాయికి ఎదిగానంటే అంటూ కీర్తి సురేష్ తన కథ చెప్పటం మొదలెడుతుంది. అసలు ఎవరి సొంత డబ్బా వాళ్లు కొట్టుకోవటమే ఏ సినిమా స్క్రీన్ ప్లేకు అయినా పెద్ద సమస్య. అదే ఈ సినిమా ప్రారంభంలోనే జరిగింది. అంటే ఆ తర్వాత సినిమా అంతా తన బిల్డప్ లు,స్కోత్కర్షలతో నడుస్తుందని మొహమాటం లేకుండా అర్దమవుతుంది. ఇక కీర్తి సురేష్ క్యారక్టరైజేషన్ లో స్ఫూర్తి, తెగువ‌, తెలివి ఉన్న అమ్మాయిని చెప్తారు. అయితే అవి సీన్స్ లో ఎక్కడా మచ్చుకైనా కనపడవు. ఇక `వ్యాపారం ఓ యుద్ధం` అంటూ జగపతిబాబు డైలాగులు చెప్తూంటాడు. కానీ ఆయన యుద్దం ఎప్పుడూ ప్రకటించినట్లు కనపడడు. అలాగే సినిమా ..ఓ టీ వ్యాపారం చుట్టూ తిరిగేటప్పుడు ఫస్టాఫ్ కుటుంబం అంతా పాత కాలం సినిమాల్లో లాగ ఫేధాస్ సీన్స్ తో నింపేయటమెందుకు…తండ్రి కు అల్జీమర్, తాత చచ్చిపోవటం వంటివి ఫస్టాఫ్ లో ఎక్కువ భాగం నిండిపోయాయి. అలాగే నవీన్ చంద్ర పాత్ర కూడా కథకు ఈసమంత కూడా ఉపయోగపడదు. ఆ పది సీన్స్ వేస్టే. అలా కథలో ఏమీ లేకుండా సాగతీసుకుంటూ వచ్చి ఇంటర్వెల్ ఇచ్చి సెకండాఫ్ లో జగపతిబాబుతో కాఫీ మార్కెట్ తో ఆమె పోటీ పడటం పెట్టారు. అయితే అంత పెద్ద మిలియనీర్ ..అచ్చ తెలుగు విలన్ లా బిహేవ్ చేయటం.,..మాట్లాడటం చూస్తే నవ్వు వస్తుంది. ఆ స్దాయికి వచ్చేవాడు తన ఎమోషన్స్ ని ఎవరకి కనపడనీయకుండా దాయటంలో నేర్పరి అయ్యి ఉంటాడు. అంతేకానీ విలన్ గా ఛాలెంజ్ లు చేయడు. ఇలా ప్రతీ అడుగులోనూ ఈ సినిమా తేలిపోతుంది. పోనీ ఇంత కథని నిలబెట్టే క్లైమాక్స్ ట్విస్ట్ ఏమన్నా ఉందా అంటే..చివర్లో పాతకాలం సినిమాల్లో లాగ నమ్మిన వాళ్లే మోసం చేసే ఓ సీన్ పెట్టి ముగించారు. దర్శకుడు కు ఈ కథపై ఏ మాత్రం పట్టులేదని అర్దమవుతుంది.
 
టెక్నికల్ గా చూస్తే..

ఎత్తుకున్న స్టోరీ లైన్ లో స్పూర్తి ఉన్నా దాన్ని విస్తరించే దిశలో ..కథ,స్క్రీన్ ప్లే  ఫెయిల్ అయ్యాయి. డైలాగు రైటర్..పంచ్ లు కోసం ప్రాసల కోసం ప్రాకులాడారు. అక్కడ ఉన్నది కీర్తి సురేష్ అని గుర్తు పెట్టుకోకుండా ఓ పెద్ద స్టార్ వాడినట్లు పంచ్ డైలాగులు వదిలారు. తమన్ కూడా తక్కువ వాడు కాదు. ఆ డైలాగులకు తగినట్లు మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి రచ్చ రచ్చ చేసారు. అయితే అవి ఎంత కామెడీగా మారిపోతాయో వాళ్లు గమనించలేదు.  తమన్ పాటల్లో ఒక మెలోడీ మాత్రం గుర్తిండిపోతుంది. కెమెరామన్ సుజీత్ వాసుదేవ్ మంచి విజువల్సే ఇచ్చాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే కథా కథనాల్లో విషయం లేనపుడు  ఏం చేసి ఏం ఫలితం?  ప్రేక్షకులతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేయలేని కథలు తేలిపోతాయనే విషయం కొత్త దర్శకులు గుర్తించాలి.  

నటీనటుల్లో కీర్తి సురేష్ బాగా చేసిందని ప్రత్యేకంగా చెప్పేందుకు ఏమీ లేదు. అలా చేసుకుంటూ పోయింది. కీర్తికి తల్లిగా నదియా, తండ్రిగా సీనియర్ నరేష్,

అన్నగా కమల్ కామరాజు అలవాటైన నటనలో జీవించారు. కీర్తి తాతగా రాజేంద్ర ప్రసాద్ ,  స్టైలిష్ బిజినెస్‌మెన్‌ గా జగపతిబాబు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు.  

చూడచ్చా

‘మహానటి’ ని చూసి ఆవేశపడి ఈ సినిమా చూస్తే ‘మహానస’ అని చివర్లో కాప్షన్ ఇవ్వాలనిపిస్తుంది

 
తెర వెనక..ముందు

సంస్థ‌: ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌

న‌టీన‌టులు: కీర్తి సురేశ్‌, జగపతిబాబు, సుమంత్‌ శైలేంద్ర, నవీన్‌చంద్ర, నదియ, నరేశ్‌, కమల్‌ కామరాజు, రాజేంద్రప్రసాద్‌, పూజిత పొన్నాడ, దివ్య శ్రీపాద తదితరులు

కళ: సాహి సురేష్‌

పాటలు: కళ్యాణ్‌ చక్రవర్తి, నీరజ కోన

రచన: నరేంద్రనాథ్‌, తరుణ్‌ కుమార్

కూర్పు: తమ్మిరాజు

ఛాయగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌

సంగీతం: తమన్

నిర్మాత: మహేష్‌ కోనేరు

దర్శకుడు: నరేంద్ర నాథ్‌
 
రన్ టైమ్: 137 నిముషాలు

విడుద‌ల‌: 04 నవంబర్‌ 2020 (‘నెట్‌ఫ్లిక్స్‌’లో)