మోసగాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్
ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం అన్నీ ఉన్న సినిమా `మోసగాళ్లు` – ప్రీ రిలీజ్ ఈవెంట్లో డా. మోహన్ బాబు.
విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మోసగాళ్లు’. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, విష్ణు మంచు అక్కా తమ్ముళ్లుగా నటించడం విశేషం. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 19 కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు పుట్టినరోజు కానుకగా విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైద్రాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో…
మోసగాళ్లు చాలా పెద్ద హిట్ అవ్వాలి..
శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ‘మా విష్ణు ఫంక్షన్ అంటే సొంత ఫంక్షన్ లెక్క. నాకెంతో ఇష్టమైన వ్యక్తి మోహన్ బాబు. ఆయన గొప్ప నటుడు, వ్యక్తి, నిర్మాత అని అందరికీ తెలిసిందే. కానీ నాకు పిల్లలు పుట్టి పెరుగుతున్న సమయంలో ఆయన ఓ గొప్ప తండ్రి అని తెలిసి వచ్చింది. పిల్లలను అంత ప్రేమించడం, అలా పెంచడం మాములుగా విషయం కాదు. మీ లాంటి తండ్రి ఉండటం వారి అదృష్టం. మోసగాళ్లు అనే సినిమాను అద్భుతంగా మంచు విష్ణు మలిచాడు. కాజల్ లాంటి అమ్మాయిని కమర్షియల్‌గా కాకుండా కథ పరంగానే వాడుకున్నారు. గ్లామర్‌గా ఎక్కడా కనిపించకుండా తీశారు. అదే నిజాయితీ. హీరోగా ఇంత మంచి పేరు సంపాదించుకున్నా కూడా ఈ సినిమాలో ఇలాంటి పాత్ర పోషించడం మామూలు విషయం కాదు. మేకింగ్, నటించిన విధానానికి మంచు విష్ణుకు హ్యాట్సాఫ్. పెద్ద హిట్ అవ్వాలని అందరి కంటే ఎక్కువగా నేనే కోరుకుంటాను. కాజల్, నవదీప్, నవీన్ చంద్ర అందరూ కూడా అద్భుతంగా నటించారు. చాలా పెద్ద హిట్ అవ్వాలి.. చాలా డబ్బులు రావాలి“ అన్నారు.
మోసగాళ్లు సినిమాలోనూ మంచి వేషం…
రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘అన్నయ్య (మోహన్ బాబు) నాకు పెదరాయుడు సినిమాలో తమ్ముడి వేషాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రిలేషన్ ఉంది. మంచు విష్ణు కూడా ప్రతీ సినిమాలో వేషం ఇస్తుంటారు.. మోసగాళ్లు సినిమాలోనూ మంచి వేషం ఇచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
పది శాతం కలెక్షన్లు..
డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.. ‘మోసగాళ్లు సినిమా మొత్తం 4200 కోట్లు చుట్టు తిరుగుతుంది. అది ఎక్కడ దాచి పెట్టారో విష్ణు, కాజల్‌లు చెప్పాలి. దాంట్లో పది శాతం కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం ఓ నాలుగు సీన్స్ రాశాను. అలా రాసినందుకు ఇంటికి వెళ్లే సరికి అకౌంట్లో మంచి అమౌంట్ పడింది. అలా మోసగాళ్ల కోసం రాసిన సీన్స్‌తో సన్ ఆఫ్ ఇండియా సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా వల్ల మొదటగా లాభపడింది నేనే. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఎంతో ఆనందంగా ఉంది..
స్టంట్ శివ మాట్లాడుతూ.. ‘సోదరుడు మంచు విష్ణుకి థ్యాంక్స్. సూర్యం సినిమాతో మా ప్రయాణం మొదలైంది. ఢీ కూడా చేశాను. ఇప్పుడు మోసగాళ్లు చేశాను. వారితో పని చేస్తే ఓ ఫ్యామిలీతో పని చేసినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాకు పని చేయడం ఎంతో ఆనందంగా ఉంద’న్నారు.
ఎంతగా కష్టపడ్డాడో నాకు తెలుసు..
నవదీప్ మాట్లాడుతూ.. ‘మోహన్ బాబు ముందు ఇలా మాట్లాడటం మొదటిసారి. ఎవ్వరూ షూట్ చేయలేదు.. మీ ముగ్గురు పిల్లలు నాకు మంచి ఫ్రెండ్స్. ఓ మనిషికి అన్నం పెట్టి.. వారి కళ్లలో ఆనందాన్ని చూసి వీళ్లు ఆనందం వెతుక్కుంటారు. అందరూ అంత మంచి వాళ్లు. ఇంగ్లీష్ తెలుగులో కలిపి ఈ మూవీని తెరకెక్కించాం. ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో నాకు తెలుసు. పదిహేనేళ్ల తరువాత గుడికి వెళ్లాను అక్కడ కూడా ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఈ సినిమాలో నాకు మోసం జరిగింది. సునీల్ శెట్టి కాంబినేషన్లో నాకు సీన్స్ లేవు. కాజల్‌తో ఇది ఆరో సినిమా. ఆమెతో పని చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. మార్చి 19న ఈ మూవీ రాబోతోంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి ఆల్ ది బెస్ట్’ అన్నారు.
ఎంతో బాగా చూసుకున్నారు..
సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ‘మోహన్ బాబు సోదరుడులాంటి వారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫ్యామిలీతో కలిసి పని చేయడమంటే నా కల నెరవేరినట్టుంది. ఈ మూవీ ఆఫర్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీని తెలుగు, ఇంగ్లీష్‌లో ఒకే సారి షూట్ చేశాం. మార్చి 19న మాకు ఎంతో ప్రత్యేకం. ఈ మూవీ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం.. ప్రతీ సినిమా హిట్ అవ్వాలి.. అలా పరిశ్రమ బాగుండాలి.. అప్పుడే మేమంతా బాగుంటాం. నా తెలుగును భరించినందుకు థ్యాంక్స్. నేను బాగానే మ్యానేజ్ చేశానని అనుకుంటున్నాను. ప్రతీ రోజూ మధ్యాహ్నం మోహన్ బాబు ఇంటి నుంచి వచ్చే ఫుడ్ వల్ల బరువు కూడా పెరిగాను. వారు ఎంతో బాగా చూసుకున్నారు. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
ఇది నా మొదటి సినిమా.
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మోహన్ బాబు గారు, సునీల్ శెట్టి గారు ఈ సినిమా వెనకాల ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్.పెళ్లి తరువాత థియేటర్లోకి రాబోతోన్న మొదటి సినిమా. పెళ్లి తరువాత ఇలా మొదటి సారి మీ ముందుకు వస్తున్నాను. ప్రతీ ఒక్కరూ కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మేమేంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం.. అందరూ ఈ మూవీని థియేటర్లోనే చూడండి.. 2020లో రిలీజ్ చేయాలని చూశాం.. కానీ మొత్తానికి 2021లో వస్తోంది“ అన్నారు.
నా పుట్టిన రోజునే మూవీని రిలీజ్ చేస్తున్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘మీ(సునీల్ శెట్టి) గురించి నేను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాను. నా మాతృ భాష తెలుగు. నేను ఇంగ్లీష్‌లో మాట్లాడలేను. కానీ మీ కోసం మాట్లాడుతున్నాను. మీరు అద్భుతమైన నటులు. మీ సినిమాలు నేను చూస్తుంటాను. మీరు గొప్ప ఆర్టిస్ట్‌లు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. మీకు విష్ణు అవకాశం ఇవ్వలేదు.. విష్ణుకే మీరు అవకాశం ఇచ్చారు. కాజల్ ఎంత మంచి నటి అన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు పక్కన అక్కగా నటించేందుకు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ పాత్రను ఒప్పుకున్నందుకు ప్రశంసిస్తున్నాను. ఒక వేళ నీ (కాజల్) స్థానంలో నేను ఉంటే కచ్చితంగా ఒప్పుకునే వాడిని కాదు. జీవితంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక విధంగా మోసపోతారు. మంచి తెలివితేటలున్నాయ్ మోసపోను అని చెబుతుంటారు. భారతదేశంలో ఇటువంటి స్కాం ఇప్పటి వరకు జరగలేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న యువత చూడాల్సిన సినిమా. అలాంటి కథను ధైర్యం చేసి విష్ణు తీశాడు. దాదాపు ఏడాది పాటు పరిశోధన చేశాడు. అలా ఎందుకు మోసం చేశారంటే.. తల్లిదండ్రులు పడిన అవమానం భరించ లేక.. ఆ అక్కాతమ్ముడు ఇలా మోసం చేస్తుంటారు. అక్కాతమ్ముడి సీన్స్ చూసి కంటతడి పెట్టేశాను. ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం ఉన్న సినిమా. సునీల్ శెట్టి పాత్ర అద్భుతంగా ఉంటుంది. మార్చి 19న నా పుట్టిన రోజు. అందుకే ఈ మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు విష్ణు. ఈ మూవీ హిట్ అవ్వాలని ఆ దేవుళ్లను కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి…
రానా మాట్లాడుతూ.. ‘విష్ణు ఫోన్ చేసి బెదిరించాడు. అందుకే ఈ ఈవెంట్‌కు వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి సునీల్ శెట్టికి అభిమానిని. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన సినిమా చూసి కండలు పెంచాలని ఫిక్స్ అయ్యాను. ఆయన ఇంకా తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలి. మార్చి 19న ఓ ప్రత్యేక వ్యక్తి (మోహన్ బాబు) బర్త్ డే. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు.
సక్సెస్ మీట్లో మాట్లాడుతాను…
మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు సునీల్ శెట్టి గారికి థ్యాంక్స్. మీతో పని చేసిన ప్రతీ మూమెంట్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా అక్క కాజల్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్. టాప్ పొజిషన్లో ఉన్న ఓ నటి ఇలా అక్క పాత్రను చేయడం మామూలు విషయం కాదు. కథ పంపించగానే అను పాత్ర బాగుందని చెప్పింది. అర్జున్ పాత్ర ఎవరు అని అడిగింది. నేనే చేస్తున్నాను చెప్పింది. ఓకే కానీ బాగానే ఉంటుంది కదా? అని అడిగింది. నవదీప్ అద్భుతమైన నటుడు. నవీన్ చంద్ర బాగా నటించాడు. గౌతం రాజు గారు చేసిన ఎడిటింగ్‌ను ఇంగ్లీష్ వాళ్లు కూడా తీసుకున్నారు. ఇక్కడ అద్భుతమైన ప్రతిభ ఉంది. అక్కడ కొన్ని సమస్యలున్నాయని అంటే స్టంట్ శివ వెంటనే అమెరికా వచ్చి చేశారు. శ్యాం గారు సంగీతాన్ని అద్భుతంగా అందించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. సక్సెస్ మీట్లో మళ్లీ మాట్లాడుతాను. మార్చి 19న సినిమా రాబోతోంది.. మీ అందరూ సినిమాను చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను’ అని అన్నారు.