Reading Time: < 1 min
 
యాంకర్‌ సుమ కనకాల స్వచ్ఛంద సేవ
 
ప్రతి పండగకీ నేనుంటా – సుమ కనకాల
 
సుమ కనకాల యాంకర్‌ గా, నటిగా గత 20 ఏళ్లుగా మన ఇంటి ఆడపడుచులా మనందరితో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
 
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ’ఫెస్టివల్స్‌ ఫర్‌ జాయ్‌’ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు ఆమె. దసరా సందర్భంగా ప్రారంభమైన ఈ సంస్థ  ప్రజ్వల అనే ప్రముఖ సేవా సంస్థ అధినేత సునీత కష్ణన్‌ సంరక్షణలో ఉన్న పది మంది మహిళలకు జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సహాయం, అక్కడే  ఉంటున్న పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్‌ ఏర్పాటు చేసారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చిత్ర పరిశ్రమ కు చెందిన 10 మంది మహిళలకు ఏడాది పాటు నిత్యావసర వస్తువులను, వారికి అవసరమైన మెడిసిన్‌ అందించారు.
 
తాజాగా  ఆదివారం నాడు  రానున్న క్రిస్మస్‌ సందర్భంగా మొదటిసారి ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రేస్‌ ఫౌండేషన్, తానా సహకారంతో చిత్ర, టెలివిజన్‌ పరిశ్రమలకు చెందిన 250 మందికి  క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ను నిర్వహించారు. ఈ స్క్రీనింగ్‌ లో 10 మందికి క్యాన్సర్‌ లక్షణాలు కనిపించాయని గ్రేస్‌ ఫౌండేషన్‌ వైద్యులు డాక్టర్‌ ప్రమీల, డాక్టర్‌ చినబాబు తెలిపారు. ఈ 10 మందికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
 
ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ–‘‘భారతదేశంలోని అన్ని ముఖ్యమైన పండగల సందర్భంగా ‘ఫెస్టివల్స్‌ ఫర్‌ జాయ్‌’ సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం. కుల, మతాలకు అతీతంగా మా సంస్థ సేవలు ఉంటాయి’’ అన్నారు.
 
డాక్టర్‌ చినబాబు మాట్లాడుతూ–‘‘స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేసిన ప్రతి ఒక్కరితో టచ్‌లో ఉంటాం. వ్యాధి నిర్ధారణ అయిన వారికి తక్కువ ఖర్చుతో ఎక్కడ వైద్యం చేస్తారో తగిన సలహాలు, సూచనలను మా ‘గ్రేస్‌ ఫౌండేషన్‌’ తరఫు నుంచి అందిస్తాం’’ అన్నారు.
 
ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రమీల, తానా తరపున తానా ట్రస్టీ విద్య గారపాటి పాల్గొన్నారు.