Reading Time: 2 mins

రజాకార్ దర్శకుడు యాటా స‌త్య‌నారాయ‌ణ మీడియా సమావేశం

జరిగిన చరిత్రను తెరపైకి తీసుకు రావాలనే ప్రయత్నం చేశాను.. ‘రజాకార్’దర్శకుడు యాటా స‌త్య‌నారాయ‌ణ

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. మార్చి 15న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు యాటా స‌త్య‌నారాయ‌ణ మీడియాతో పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..

చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాను. మన జీవిత చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా తీశాం. అలాంటి సినిమాకు, అలాంటి చరిత్రకు రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే రేటింగ్స్ ఇవ్వొద్దు అన్నాను.సినిమా నచ్చలేదని, దర్శకుడు బాగా చేయలేదని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది.

చిన్నతనం నుంచీ నాకు సినిమాలంటే పిచ్చి. పైగా మన చరిత్రను చెప్పాలని కోరిక ఉండేది. నాకు ఈ నిర్మాతతో పదేళ్ల నుంచి పరిచయం ఉంది. కానీ ఆయనకు సినిమాల్లోకి రావాలనే కోరిక లేదు. కానీ కొన్నేళ్లకు ఓ మంచి సినిమా తీయాలని, చరిత్రలో నిలిచిపోవాలనే సినిమా తీయాలని అన్నారు. రజాకార్ సినిమా చేద్దామని అన్నాను. ఆయన కూడా ఓకే అన్నారు. బడ్జెట్ సెట్ అవ్వదేమో అనుకున్నా. కానీ ఆయనే పట్టుబట్టి తీద్దామని అన్నారు. అలా రజాకార్ మొదలైంది.

మా నిర్మాత ఓ రాజకీయ నాయకుడు కాబట్టి కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారేమో. కానీ నేను ఓ క్రియేటర్‌గా అలా ఆలోచించడం లేదు. చరిత్రను చూపించాను. మన చరిత్ర చెప్పాలనుకున్నాను.. తెరపైకి తీసుకొచ్చాను. రేపు సినిమా చూశాక అది కాంట్రవర్సీ కాదని అందరికీ అర్థం అవుతుంది.

మా భూమి లాంటి గొప్ప కథను చెప్పారు. మళ్లీ ఇప్పుడు అలాంటి మరో గొప్ప కథను చెప్పే అదృష్టం నాకు వచ్చింది. ఆర్కా మీడియాలో ఎన్నో ప్రేమ కథలు పట్టుకుని తిరిగాను. హారర్ కథలు కూడా రెడీ చేశాను. కానీ అన్నీ మధ్యలో ఆగిపోయాయి. కానీ ఇలా రజాకార్ నాకు రావడం ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాను.

సెన్సార్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఓ పదహారు పాయింట్లు అడిగారు. వాటికి అన్ని ఫ్రూప్స్ చూపించాను. కొన్ని మితి మీరిన వయలెన్స్ సీన్లు ఉన్నాయని, వాటికి మాత్రం కట్స్ చెప్పారు. పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఎన్నికల హడావిడి వచ్చింది. కానీ అప్పటికీ షూటింగ్ కాలేదు. టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా షూటింగ్ పూర్తవ్వలేదు. సీజీ వర్క్ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎన్నికల కోసం ఈ సినిమాను తీయలేదు.

మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలీదు. అందరూ 1947 ఆగస్ట్ 15న వచ్చిందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు కదా?.. అందుకే ఆ విషయం అందరికీ తెలియాలనే ఈ రజాకార్ సినిమాను తీశాను. రజాకార్ వ్యవస్థ పాల్పడిన దురాగతాలను తెరపై చూపించాను. ఈ చిత్రంలో ఒక ఊరు, ఒక ప్లేస్ అంటూ చూపించలేదు. 1947 ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగిన ఘటనలను ఇందులో చూపించాం. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా కనిపిస్తాయి.

ఎన్నో పుస్తకాలు చదివాను. ఎంతో మంది ప్రత్యక్ష వ్యక్తుల్ని కలిశాను. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్రను చూశాను. అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా రజాకార్ సినిమాను తీశాను. దాదాపు ఈ చరిత్రను పదిహేను చిత్రాలుగా తీయొచ్చు. ఎంత చూపించినా కొంత తక్కువే అనిపిస్తుంది.

రజాకార్ వ్యవస్థ వల్ల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో జరిగింది. ఆ టైంలో చాలా ప్రాంతాలకు చాలా మంది పారిపోయారు. నాకు ఈ సినిమా చేస్తున్న టైంలో కేరళ, చెన్నై నుంచి ఫోన్‌లు వచ్చాయి. మన వాళ్లు ప్రతీ ఏరియాలో ఉన్నారు.

తెలుగు కంటే హిందీలోనే ఎక్కువగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ ఒక్కరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. టీజర్‌కు నేషనల్ వైడ్‌గా డిబేట్లు జరిగాయి. మరాఠీ, ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ స్టోరీ మీద సినిమా చేయమని అక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి.

బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే ఇలా అన్ని భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాకు పని చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద పని చేసిన అనుభవంతో ఈ సినిమాను అవలీలగా చేసేశాను. అందరూ తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు.

భారతీ భారతీ పాటకూ, బీజేపీ పార్టీకి సంబంధం ఏంటి?.. భారతి అంటే నా అమ్మ, నా మాతృభూమి.. నా దేశం.. దానికీ పార్టీకీ సంబంధం లేదు. మా కష్టాలను భారత మాతకు చెబుతున్నామనే ఉద్దేశంలో ఆ పాట ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ గారు రెండు పాటలు అద్భుతంగా రాశారు.

నేను చరిత్రను తప్పుగా చెప్పలేను. తప్పుగా చెబితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతాను.  కల్పితం చేసి, హీరోయిన్లు పెట్టి చరిత్రను తప్పుగా చెప్పలేను. జరిగిన చరిత్రను చెప్పాలనుకున్నాను. అందుకే రజాకార్ తీశాను.