Reading Time: 2 mins

రాజా రవీంద్ర ఇంట‌ర్వ్యూ 

రెండు గంట‌ల పాటు టెన్ష‌న్స్ అన్నీ మ‌ర‌చిపోయి హాయిగా న‌వ్వుకునే ఎంట‌ర్‌టైన‌ర్ ‘క్రేజీ అంకుల్స్’:  రాజా ర‌వీంద్ర‌

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌లో రాజుగారి పాత్ర‌ను చేసిన రాజా రవీంద్ర ఇంట‌ర్వ్యూ విశేషాలు.

మంచి ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. పాండ‌మిక్ స‌మ‌యంలో ఇలాంటి మూవీ రాలేదు. కాబ‌ట్టి ఇది త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుడు రెండు గంట‌ల పాటు న‌వ్వుకుంటారు.

నా పాత్ర విష‌యానికి వ‌స్తే.. సాధార‌ణంగా యాబై ఏళ్లు దాటిన వ్య‌క్తికి భార్య‌తో ఎక్కువ అనుబంధం ఉంటుంది. కానీ మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లు వ‌చ్చిన త‌ర్వాత భార్య స‌రిగ్గా ప‌ట్టించుకోక‌పోతే, ఫేస్‌బుక్ స‌హా ఇత‌ర సోష‌ల్ మీడియాల్లో ఎవ‌రో ఒక అమ్మాయితో చాటింగ్ చేయ‌డం స్టార్ట్ చేస్తాడు. ఓ చిన్న త‌ప్పు కార‌ణంగా హ్యాపీగా ఉండాల్సిన జీవితం ఎలాంటి స‌మ‌స్య‌ల్లో ఇరుక్కుంద‌నేదే క‌థ‌. అలాగే మిగిలిన ఇద్ద‌రి (మ‌నో, భ‌ర‌ణి) పాత్ర‌లు కూడా ఉంటాయి.

ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు. భ‌విష్య‌త్తులో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని యూత్ కూడా క‌నెక్ట్ అవుతారు. జీవితంలో ఎలాంటి టెన్ష‌న్స్ లేక‌పోతేనే పిచ్చి ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. అలాంటి ఓ పాయింట్‌ను ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో చెప్పాం.

ఇందులో నా పాత్ర పేరు రాజుగారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. రెడ్డిగారు పాత్ర చేసిన మ‌నోగారు గోల్డ్ షాప్ ఓన‌ర్‌. రావుగారి పాత్ర చేసిన ధ‌ర‌ణిగారేమో ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు.

ముగ్గురు స్నేహితులే .. కానీ ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు, ఒకే అమ్మాయిని లైన్‌లో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.

శ్రీముఖి మంచి యాంక‌ర్‌, ఎన‌ర్జిటిక్ ప‌ర్స‌న్‌. మాకు ఇంత‌కు ముందే ప‌రిచ‌యం ఉంది. మ‌నోగారు, శ్రీముఖిగారైతే చాలా షోస్ కూడా చేసి ఉన్నారు.

విలన్ పాత్ర‌లు చేయ‌డం ఈజీ. మ‌న‌కు ఫేస్ అడ్వాంటేజ్‌తో పాటు డైలాగ్‌ను స‌రిగ్గా చెబితే స‌రిపోతుంది. కానీ కామెడీ చేయ‌డం చాలా క‌ష్టం. అలాంటి పాత్ర‌లు చేయాలంటే టైమింగ్ ఉండాలి.

కోవిడ్ స‌మ‌యంలో షూటింగ్ చేయ‌డం కాస్త టెన్ష‌న్‌గానే ఉండింది. దీన్ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ సినిమా చూసిన త‌ర్వాత థియేట‌ర్స్‌కు వెళితేనే క‌రెక్ట్ అనిపించింది. అదే స‌మ‌యంలో కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. దాని వ‌ల్ల సినిమా కాస్త ఆల‌స్య‌మైంది.

ఓటీటీ వ‌చ్చాక న‌టీన‌టులకు, టెక్నీషియ‌న్స్‌కు అవ‌కాశాలు పెరిగాయి. దాదాపు 100 నుంచి 120 సినిమా షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. ఇప్పుడే షూటింగ్స్ బాగా జ‌రుగుతాయి.

నాకు సినిమా అంటే చాలా పిచ్చి. ఒక‌వేళ ఆర్టిస్టుగా వేషాలు రాక‌పోయినా ఇండ‌స్ట్రీలో టీ, కాపీలు ఇచ్చుకునైనా ఉండిపోతాన‌ని ఓ సంద‌ర్భంలో స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాను.

చిరంజీవిగారి ఆచార్య‌లో ఇప్ప‌టికే ఓ మంచి రోల్ చేశాను. రోజ్ విల్లా, సోహైల్ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాను..ఇలా  చాలా సినిమాలు చేస్తున్నాను.