రాజుగారి గది 3 మూవీ రివ్యూ

Published On: October 18, 2019   |   Posted By:

రాజుగారి గది 3 మూవీ రివ్యూ

తమిళ ఫన్ ఇది(‘రాజుగారి గది 3’ రివ్యూ)
 
Rating: 2.5/5
 
అప్పుడెప్పుడో ప్రేమ కధా చిత్రమ్ అనే సినిమా వచ్చి, ఓ ట్రెండ్ సెట్ చేసి పోయింది. ఆ ట్రెండ్ ని పట్టుకుని అటు లారెన్స్..ఇటు ఓంకార్…దయ్యాలతో సినిమా థియోటర్స్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నారు. బ్రేక్ ఇవ్వకుండా సీక్వెల్స్ అంటూ శివాలెత్తిపోతున్నారు. ఆ కోవలోనే  ‘రాజుగారి గది 3’కూడా వచ్చింది. పేరున్న నటులు ఎవరూ సినిమాలో లేకపోవటంతో  ప్రాజెక్టుకు పెద్దగా క్రేజ్ రాలేదు. సినిమాలో విషయం ఉంది కాబట్టి అవన్నీ ఆలోచించాల్సిన పనిలేదని నమ్మి నడింపించాడు ఓంకార్. అందులోనూ రాజుగరి గది 2 ప్లాఫ్ కావటంతో ఈ సినిమా హిట్ అవ్వాల్సిన అవసరం మరీ ఎక్కువ ఉంది. ఈ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది…మన జనాలకు నచ్చుతుందా…ఓంకార్ మరో సారి రాజుగారి గది సీక్వెల్ కు శ్రీకారం చుట్టే ధైర్యం ఇస్తుందా..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీలైన్
 
ఆటో డ్రైవర్ అశ్విన్ (అశ్విన్ బాబు) తాగి కాలనీలో రచ్చ రచ్చ చేస్తూంటాడు. అతనో పెద్ద తలనొప్పిగా మారటంతో…ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూంటారు కాలనీ జనం. మరో ప్రక్క మాయ (అవికా గోర్)అనే డాక్టర్ ని ఓ యక్షణి దెయ్యం బాడీ గార్డ్ లా కాపలా కాస్తూంటుంది. ఆమె  ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆ ఆత్మలాంటి దెయ్యం వచ్చి టార్చర్ పెట్టేస్తుంటుంది.  ఈ టార్చర్ స్వయంగా అనుభవించిన డాక్టర్ (బ్రహ్మాజీ) …ఆ దెయ్యాన్ని తెలివిగా అశ్విన్ వైపు తిప్పితే అతని బాధ తప్పుతుందని ప్లాన్ చేస్తారు. అందుకోసం అస్విన్ ని మాయతో ప్రేమలో పడేలా చేస్తారు. ఆమెను కరెక్ట్ గా ప్రపోజ్ చేసే సమయంలో అశ్విన్ పై యధావిధిగా ఆ బాడీ గార్డ్ దెయ్యం దాడి చేస్తుంది. మిగతా వాళ్ళు అయితే అక్కడ నుంచి పారిపోదురు కానీ ..అశ్విన్ తెలివైన వాడు, ధైర్యవంతుడు..  ఈ సినిమా హీరో కూడా కావటంతో ఆమె ని అంటిపెట్టుకుని దాడులకు దిగుతున్న ఆ బాడీగార్డ్ దెయ్యం గురించి ఎంక్వైరీ మొదలెడతాడు. అందులో భాగంగా మాయ తండ్రి గ‌రుడ‌ పిళ్లై(అజ‌య్ ఘోష్‌) ని కేరళ వెళ్లి కలుస్తాడు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. మాంత్రికుడైన గరుణ పిళ్లై ఏమంటాడు..అసలు మాయ ఎవరు..ఆ బాడీ గార్డ్ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ఏమిటి…చివరకు అశ్విన్ లవ్ స్టోరీ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే  సినిమా చూడాల్సిందే.

స్టోరీ లైన్ లో సత్తా ఉన్నా…

ఈ సినిమా ఓంకార్ స్వంత కథ వచ్చిందేమో కాదు. తమిళంలో రిలీజైన  ‘దిల్లుకు దుడ్డు 2’  నుంచి తీసుకున్నది. అక్కడ సంతానం ఈ సినిమా చేసాడు. ఆడుతూ, పాడుతూ,నవ్విస్తూ అలవైన ఫన్ తో ఆకట్టుకున్నాడు. సినిమా కథలో పెద్దగా విషయంలేకున్నా తన సత్తాతో లాగేసాడు. అదే ఇక్కడ తెలుగులో కొరవడింది. ఓంకార్ సోదరుడు అశ్విన్ కు ఇన్ని సినిమాలు చేసినా దెయ్యాల సినిమాలో ఎలా నవ్వించాలో తెలియలేదు. ఈ సినిమాని అశ్విన్ కాకుండా వేరే వారు చేసినా అలాగే ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే నటుడుగా అశ్విన్ ఈ కథలో తనదైన ముద్ర వేయలేకపోయారు. అక్కడికీ మిగతా ఆర్టిస్ట్ లు సపోర్ట్ ఇచ్చినా అశ్విన్ అదోలా చేసాడు తప్ప కామెడీ సినిమా కు తగిన ఎక్సప్రెషన్స్ ఇవ్వలేకపోయాడు.  ఇక స్క్రీన్ ప్లే కూడా మార్చుకోవాల్సింది. లూజ్ ఎండ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. అసలే ఇలాంటి సినిమాలకు లాజిక్స్ ఉండవు. దానికి తగినట్లు లాగ్ ఎక్కువ. ఒక కామెడీ సీన్ వస్తే మరో కామెడీ సీన్ కోసం వెయిట్ చెయ్యాల్సిన పరిస్దితి ఫస్టాఫ్ లో ఉంది..  అయితే సెకండాఫ్ లో దాన్ని దాటారు. బంగ్లాలో జరిగే ఓ ఇరవై నిముషాల ఫన్ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుంది. అది కనక ఎక్కితే సినిమా వర్కవుట్ అయినట్లే. అయితే ఎంత ఫన్ ఉన్నా సినిమాలో కొంత సీరియస్ నెస్ ఉంటే ఆ లెక్కే వేరు. ఆ కిక్కే వేరు.
 
రెండు విభాగాలు కేక

ఈ సినిమాకు ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి ఎంచుకోవటమే సగం గెలుపు.. ష‌బీర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది.   బుర్ర సాయిమాధవ్‌ డైలాగుల్లో అంత ఫన్ తొణికిసలాడలేదు. డైరక్టర్గా ఓంకార్ మేకింగ్ బాగుంది.

చూడచ్చా…
నవ్వుకోవటానికి ఈ సినిమా మంచి ఆప్షనే. అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తేనే సమస్య


తెర వెనక..ముందు

న‌టీన‌టులు: అవికా గోర్‌, అశ్విన్ బాబు, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్ ఘోష్‌,  ఊర్వశి త‌దిత‌రులు
ద‌ర్శక‌త్వం: ఓంకార్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్రవ‌ర్తి
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌: గౌతంరాజు
ప్రొడక్షన్‌ డిజైన‌ర్‌: సాహి సురేశ్‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
పాటలు: శ్రీమ‌ణి
ఆడియోగ్రఫీ: రాధాకృష్ణ
స్టంట్స్‌: వెంక‌ట్‌
బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల‌: 18-10-2019