రాజు యాదవ్ సినిమా ప్రారంభం
గెటప్ శ్రీను హీరోగా సూడో రియలిజం (Pseudo Realism) జానర్‌లో ‘రాజు యాదవ్’ సినిమా ప్రారంభం
గెటప్ శ్రీను హీరోగా సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రాజు యాదవ్’. ఐఐటీ మద్రాస్‌లో ఇంటర్నేషనల్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేసి, ‘విన్సెంట్ ఫెరర్’ అనే స్పానిష్ ఫిల్మ్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అనంతరం తెలుగులో ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన ‘నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
గెటప్ శ్రీను సరసన నాయికగా అంకిత కరత్ నటిస్తున్నారు.
శనివారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ సాగర్ కె. చంద్ర క్లాప్ నిచ్చారు. డైరెక్టర్ వేణు ఊడుగుల, ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సంయుక్తంగా స్క్రిప్టును దర్శకుడు కృష్ణమాచారికి అందజేశారు.
ఒక టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రం సహజసిద్ధమైన పాత్రలతో, ఆర్గానిక్ మేకింగ్‌తో ఉంటుందని కృష్ణమాచారి తెలిపారు. కమర్షియల్ హంగులకు దూరంగా, వాస్తవికతకు దగ్గరగా, సమాజంలో మనం చూసే ఎన్నో పాత్రలకు, ఘటనలకు రిప్రజెంటేటివ్‌లా ఉంటూ, సగటు కుటుంబంలోని వైరుధ్య మనస్తత్వాలు, వారి ఊహలు, కోరికలు, ప్రయాణం, చివరగా డెస్టినీ ఏమిటనేదే ఈ సినిమా అని ఆయన చెప్పారు.
నటనకు ప్రాధాన్యం ఉన్న కథ కావడంతో, తన నటనతో పాత్రకు ప్రాణం పోసే గెటప్ శ్రీనును ముఖ్యపాత్ర కోసం అడగటం, ఆయన కథ విన్న వెంటనే ఒప్పుకోవడమే కాకుండా, ఆ పాత్రకు తగ్గట్లుగా ఆయన తన బాడీని మలుచుకుంటున్నారు. ఆ పాత్రలో ఉన్న సహజత్వానికి న్యాయం చేసే క్రమంలో రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా గెటప్ శ్రీనులోని నటుడిని కొత్త కోణంలో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు దర్శకుడు కృష్ణమాచారి చెప్పారు.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, సాక్ష్యం, కనులు కనులను దోచాయంటే లాంటి హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ‘రాజు యాదవ్’కు స్వరాలు అందిస్తున్నారు.
డిసెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని నిర్మాత ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
తారాగణం:
గెటప్ శ్రీను, అంకిత కరత్, ఆనంద్ చక్రపాణి, రూపాలక్ష్మి, ఉన్నతి, ఉత్తర ప్రశాంత్, పవన్ రమేశ్, సంతోష్ రాజ్
సాంకేతిక బృందం:
సినిమాటోగ్రఫీ: సాయిరామ్ ఉదయ్
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
పీఆర్వో: వంశీ-శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ రాజు
ప్రొడ్యూసర్: ప్రశాంత్ రెడ్డి
డైరెక్టర్: కృష్ణమాచారి