రాధేశ్యామ్ మూవీ రివ్యూ

Published On: March 11, 2022   |   Posted By:

రాధేశ్యామ్ మూవీ రివ్యూ

👎

బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ప్రభాస్. సాహో అంతంత మాత్రం అనిపించుకోవటంతో తాజాగా రాధేశ్యామ్ అంటూ థియోటర్స్ లోకి దిగాడు. సాధారణంగా ప్రబాస్ సినిమాలు అంటే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. అయితే ఈ సినిమాలో యాక్షన్‌ ఉంటుంది కానీ ఫైట్స్‌ ఉండవు. పూర్తి లవ్ స్టోరీ అంటున్నారు. అందులోనూ హీరో జ్యోతిష్యం చెప్పేవాడు. అయితే భారీ బడ్జెట్ తో తీసిన సినిమా . విజువల్స్ గ్రాండియర్ గా కనపడుతున్నాయి. అలాగని రిలీజ్ కు ముందు ప్రభాస్ రెగ్యులర్ సినిమాలకు వచ్చే స్దాయిలో బజ్ క్రియేట్ కాలేదు.  రాధేశ్యామ్‌ ఒక థ్రిల్లర్‌ లవ్‌స్టోరి అంటున్నారు.అలాగే  రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో హస్త సాముద్రిక నిపుణినిగా కనిపించారు. పూజ హెగ్డే ప్రేరణ కేరెక్టర్ లో కనిపించింది. విక్రమాదిత్యగా ప్రభాస్, పూజ హెగ్డే ప్రేరణ అయితే రాధే శ్యామ్ ఎవరు? అసలు రాధే శ్యామ్ టైటిల్ ఎలా వచ్చింది ఈ సినిమాకి? టైటిల్ కి ప్రభాస్, పూజ పాత్రలకి, సినిమా కథకి ఉండే సంభందం ఏమిటి? ఇన్నాళ్లుగా రాధే శ్యామ్ యూనిట్ మొత్తం హైప్ చేసి, ఆ అంశాన్నే చాలా గుట్టుగా దాచి ఉంచిన సినిమాలోని అసలు సీక్రెట్  ఏమిటి?  ఇలాంటి సందేహాలు రేకిత్తిస్తూ  కొత్త కథతో వస్తున్నా అంటూ ప్రభాస్  ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  అయితే అది నిజంగా కొత్త కథేనా, సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా మిగతా సామాన్యులకు నచ్చుతుందా ? అసలు కథేంటి ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

Storyline:

విధిని ఎదురించి తమ ప్రేమని దక్కించుకోవాలని ఓ ఇద్దరు ప్రేమికులు చేసే సాహసం రాధేశ్యామ్ సినిమా కథ.  1970లలో   మొదలయ్యే  ఈ కథలో  విక్రమాదిత్య (ప్రభాస్) ప్రపంచవ్యాప్తంగా పేరున్న హస్తసాముద్రికుడు. ఆదిత్య ఏది చెప్తే అది జరిగిపోతూంటుంది. ఇక ప్రపంచ సంచారిగా తిరిగే విక్రమాదిత్య ప్రస్తుతం ఇటిలిలో ఉంటాడు. అక్కడ ఓ ట్రైన్ లో పరిచయం అయిన  ప్రేరణ( పూజ హెగ్డే)అనే డాక్టర్ తో ప్రేమలో పడతాడు. అయితే తన జాతకం ప్రకారం  తన జీవితంలో ప్రేమ,పెళ్లికు చోటు లేదు. అందుకే ఆమెను వదిలేసి వెళ్లిపోవాలనుకుంటాడు. అయితే చిత్రంగా ఆమే ఈ భూమిని వదిలేసి వెళ్లబోతోందని తెలుస్తుంది. ఆమెకు మందులు కూడా లేని ఓ జబ్బు ఉందని తెలుస్తుంది. దాంతో కంగారుపడ్డ ఆదిత్య ఆమె చెయ్యి చూస్తాడు. అయితే ఆమె వందేళ్లు బ్రతుకుతుందని తెలుస్తుంది. అదెలా సాధ్యం. మరో ప్రక్క ఆదిత్యకు కూడా ఓ సునామీలో మరణం రాసి పెట్టి ఉందని జాతకంలో ఉంది.  ఆ రెండు జాతకం ప్రకారం జరుగుతాయా? ప్రేరణ బ్రతికి ఆదిత్య చనిపోతాడా? భవిష్యత్ లో ఏమౌతుందో తెలుసుకున్న ఆదిత్య దాన్ని తప్పించుకునేందుకు ఏం చేసాడు. తనను, తన ప్రియురాలిని ఎలా కాపాడుకున్నాడు అనేదే మిగతా కథ.

Screenplay Analysis:

లవ్ వర్సెస్ డెస్టినీ ఫైట్ అంటూ  ఈ సినిమా గురించి భారీగానే ప్రచారం చేసారు. అయితే సినిమాలో అంత సీన్ కనపడదు. ఎంచుకున్న పాయింట్ లో కాస్త కొత్త‌ద‌న‌మున్నా దాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చుకోవ‌డంలో క‌థ‌కుడు, ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. వాస్తవానికి ప్రభాస్ వంటి స్టార్ తో ఈ కథ అనుకోవటమే పెద్ద రిస్క్.  అలాగే ఈ సినిమా  పూర్తి ఫాంటసీ కాదు చరిత్ర కాదు, పూర్తి కల్పితమూ కాదు. చరిత్రలో ఉన్న పాత్రలను తీసుకుని కల్పిత కథను అల్లి విధికి శాస్త్రానికి ప్రేమకు మధ్య జరిగే యుద్ధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఇది.  బేసిక్ ఐడియా చంద్రశేఖర్ యేలేటిది . మనకు అక్కడిదాకా ఆ వైవిధ్యత స్టోరీ లైన్ లోనే కనిపిస్తుంది. కానీ ఇబ్బంది అంతా ఆ లైన్ ని ట్రీట్మెంట్ గా రాసుకునే క్రమంలోనే వచ్చింది. ఎగ్జిక్యూషన్ కుదరలేదు. ఇలాంటి  సబ్జెక్టులకు హీరోని ఎలివేట్ చేస్తూ కథ ప్రక్కకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే ట్రీట్మెంట్ చాలా కీలకం. అలాగే ఎమోషన్స్  పూర్తిస్థాయిలో ఎక్సప్లోర్ చెయ్యగలగాలి. అవేమీ పండకుండా ఆడియన్స్ ని మెప్పించడం చాలా కష్టం.

అవన్నీ చూసుకోకే ఫస్ట్ హాఫ్ లో అనవసరంగా మళయాళి నటుడు జయరాం మీద వచ్చే కామెడీ మిస్ ఫైర్ అయ్యింది.   విక్రమాదిత్య క్యారక్టర్ బిల్డప్ ఎలివేషన్లు బాగానే ఉంది కానీ ఆ పాత్రని కథలోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయారు. ముఖ్యంగా డ్రామాను డిమాండ్ చేసే సీన్స్, ఇంటెన్స్  కలిగించే సబ్ ప్లాట్స్ లేవు. అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ప్రభాస్ లాంటి హీరోతో డీల్ చేస్తున్నప్పుడు మాస్ ని వదలేయలేము అని. అలాగని ఈ కథలో మాస్ కోసం  మసాలా పాటలు ఉండాలని,ఫైట్స్ కావాలని పెట్టలేరు. ఇన్ని అడ్డంకులు చివరకు కథకు అడ్డంగా నిలిచాయి.  టైటానిక్ లాంటి కథ చేస్తున్నాము అనుకున్నప్పుడు అందుకు తగ్గ హై అనిపించే మూమెంట్స్ కానీ గూస్ బంప్స్ ఇచ్చే ఇన్ సిడెంట్స్ కానీ ఉండాలి. అవేమీ వర్కవుట్ చెయ్యలేదు.ఇంటర్వెల్ దాకా కాంప్లిక్ట్ పాయింట్ లోకి రారు. ఇంటర్వెల్ అయ్యాక అయినా ఆ కాంప్లిక్ట్స్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లే ప్రయత్నమూ ఉండదు. ఓ రేంజిలో పబ్లిసిటి చేసిన షిప్ ఎపిసోడ్ సైతం అంతగా తేలిపోయింది అంటే కారణం ఇదే.

Analysis of its technical content:

ఇక సినిమాకి బ‌లాన్నిచ్చిన అంశ‌మేదైనా ఉందా అంటే, అది ఆర్ట్ డైరక్షన్. సినిమాని పెయింటింగ్ లా తీర్చి దిద్దటానికి అవసరమైన సరంజామా సెట్స్ రూపంలో ఇచ్చాడు. అలాగే జస్టిన్ ప్రభాకర్ అందించిన సంగీత‌మే.  పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి కానీ హాంట్ చేసేలా లేవు. నేప‌థ్య సంగీతం కూడా ఆక‌ట్టుకునేలా ఉంది.  ఎడిటర్ క‌త్తెర‌కు మ‌రింత ప‌ని చెప్పాల్సింది.   ఛాయాగ్ర‌హ‌ణం ఈ సినిమాను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. చిత్ర నిర్మాణ విలువ‌లు ఓ రేంజిలో ఉన్నాయి.  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వీలైనంత ల్యాగ్ ని తగ్గించారు కానీ అది సరిపోలేదు. సెకండాఫ్ లో భారీ సాగతీత గా అనిపించింది.

నటీనటుల్లో ప్రభాస్ ఓకే అన్నట్లు చేసారు. బాహుబలిలాంటి భారీ పాన్ ఇండియా మూవీ సక్సెస్ తో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత ఆ లెవెల్ కి తగ్గ మాస్ మూవీ సాహో చేసారు. యాక్షన్ ప్రధానంగా సాగిన సాహో మూవీ ఆడియన్స్ కి అంతగా నచ్చకపోయినా ఆ సినిమాని ఎలాగోలా గట్టెక్కించారు. సౌత్ లో సాహో అటు ఇటు అయినా నార్త్ ప్రేక్షకులు సాహో ని హిట్ చేసారు. కానీ ఈ సినిమాలో ఆ ఉత్సాహం కనిపించదు. పూజ అందంగా కనపడింది కానీ నటనలో ప్రత్యేకత ఏమీ లేదు. భాగ్యశ్రీ ని హిందీ మార్కెట్ కోసం తీసుకున్నారని అర్దమైపోతుంది. ప్రియదర్శి వంటి ఆర్టిస్ట్ ఉన్నా కామెడీ లేదు. తమిళ నటుడు జయరాం కామెడీ చేద్దామని ప్రయత్నించి బొక్క బోర్లా  పడ్డాడు, విసిగించాడు.

CONCLUSION:

చూడచ్చా…?
ప్రభాస్ వీరాభిమానులు ధైర్యం చేయచ్చు సగటు ప్రేక్షకుడుకి కష్టమే అనిపిస్తుంది.

Movie Cast & Crew

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
పిఆర్ఓ : ఏలూరు శ్రీను
Run Time: 2 గంటల 18 నిముషాలు
విడుదల తేదీ: 11 మార్చి, 2022