Reading Time: 3 mins

రిపబ్లిక్‌ మూవీ రివ్యూ

లేదండీ కిక్ : సాయి తేజ ‘రిపబ్లిక్‌’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE) :

?

కొందరు డైరక్టర్స్ సినిమాలు హిట్ ఫ్లాఫ్ లకు అతీతంగా వస్తూంటాయి. వాటి కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ఉంటారు. అలాంటి డైరక్టర్స్ లో దేవకట్టా ఒకరు.  ఆయన తాజా చిత్రం ‘రిపబ్లిక్’ ట్రైలర్ చూడగానే క్యాస్టింగ్, క్వాలిటీ,కంటెంట్ అన్నీ పుష్కలంగా ఉన్నాయని అనిపించింది.  అందులోనూ పూర్తి స్దాయి పొలిటికల్ డ్రామాలు వచ్చి చాలా కాలం అయ్యింది. వర్తమాన రాజకీయాలు బేస్ చేసుకుని ఈ సినిమా చేసారన్నారు. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం  
 
స్టోరీ లైన్

బ్రిలియెంట్ స్టూడెంట్ అభిరామ్(సాయి ధరమ్ తేజ్) అమెరికా వెళ్లటానికి రెడీ అవుతూంటాడు. అయితే ఈ లోగా వచ్చిన ఎలక్షన్స్ లో తన ఓటు వేరే వారు వేసేయటంతో అక్కడే ఉన్న కలెక్టర్ (సుబ్బరాజు) తో గొడవ పడతాడు. ఆ తర్వాత తను కలెక్టర్ అవ్వాలని డెసిషన్ తీసుకుని అవుతాడు. ఆ తర్వాత పస్ట్ పోస్టింగ్ కృష్ణా జిల్లాకు వేస్తారు. అక్కడ తెల్లేరు (కొల్లూరు) లో అనేక అక్రమాలు జరుగుతూంటాయి. వాటిని అక్కడ రాజకీయ నాయకురాలు విశాఖ వాణి(రమ్యకృష్ణ) లీడ్ చేస్తూంటుంది. ఆమె కొడుకు ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి.  ఆ ప్రాంతానికి కలెక్టర్‌గా వచ్చిన పంజా అభిరామ్‌ తెల్లేరు సరస్సు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకోవటం మొదలెడతాడు. ఇది ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశాఖవాణికు నచ్చదు. ఆమె డైరక్ట్ గా సీన్ లోకి వస్తుంది. అభిరామ్ కు వార్నింగ్ ఇస్తుంది. అక్కడ నుంచి ఈ కొత్త కలెక్టర్ కు, పాత పొలిటీషన్ కు మధ్య జరిగే వార్ లో ఎవరు గెలిచారు.  చివరకు ఏమైంది, కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి  అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే విశ్లేషణ

పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా కొల్లేరు నేపధ్యంలో కథ జరుగుతుంది. కానీ ఆ విషయం మనకు సెకండాఫ్ లో కానీ రివీల్ అవదు.  ఫస్టాఫ్ అంతా కథను దాచి పెట్టి సెకండాఫ్ లో ఒక్కసారిగా రివీల్ చేయటం మొదలెడతారు. ఈ క్రమంలో హీరో తండ్రికో ప్లాష్ బ్యాక్, హీరోయిన్ కో ప్లాష్ బ్యాక్, విలన్ కో ప్లాష్ బ్యాక్ ఇలా అందరికీ తలో ప్లాష్ బ్యాక్ లు చెప్పాల్సి వచ్చింది. దాంతో సెకండాఫ్ లో చాలా భాగం లైవ్ కన్నా ఫ్లాష్ బ్యాక్ లకే స్క్రీన్ టైమ్ కేటాయించారు. మొత్తం ఇవన్నీ సెకండాఫ్ లో రావటంతో ఫస్టాఫ్ అసలు ఆ  పాత్రల వెనక ఉన్న విషయం తెలియక ఎమోషన్ గా వాటితో కనెక్ట్ కాలేకపోతాము. దానికి తోడు హీరో,విలన్ మధ్య జరిగే వార్ ఎక్కడో సెకండాఫ్ లో కానీ మొదలు కాదు. పాతుకుపోయిన పొలిటీషన్ రమ్యకృష్ణని, ఓ నిజాయితీ కల కలెక్టర్ ఎలా ఎదిరిస్తాడు ధర్మం, న్యాయం ఎలా ప్రతిష్టాడు అనే అంశం చుట్టూ సీన్స్ తిరుగుతాయని,హై ఇంటెన్సిటీ డ్రామాని ఆశిస్తాం.  అవి లేవు పోనీ అంతకు మించి ఏమైనా ఉందా అదీ లేదు.  అసలు రిపబ్లిక్ మొదలైన గంట దాకా అసలు కథలోకే వెళ్లదు.వ్యవస్దను ఎదిరించలేక,ఓడిపోయిన కలెక్టర్ కధగా నిరాశవాదంతో సినిమా ముగిస్తాడు. రియాలిటీ టచ్ ఇచ్చాడు అనుకుందామనుకున్నా..మిగతా సినిమా అంతా సినిమాటెక్ గానే నడుస్తుంది.

కలెక్టర్ గా అభిరాం ఛార్జ్ తీసుకున్నాక ఒక గూండాను చంపడానికి సగటు కమర్షియల్ హీరో స్టైల్ లో ఒక పోలీస్ ని వెంటబెట్టుకుని రాత్రి పూట ఫైట్ చేయడానికి వాళ్ళ డెన్ కు వెళ్లడం సింక్ కాదు. అసలు ఓ జిల్లాకు కలెక్టర్ అని ఎక్కడా అనిపించడు. కేవలం తెల్లేరు ప్రాంతం కోసం వచ్చిన ఓ స్పెషల్ ఆఫీసర్ లా బిహేవ్ చేస్తాడు. హీరోయిన్ మైరా రేప్ ఎపిసోడ్ తో మనకు గ్లామర్ మాట దేవడెరగు..అసలు హీరోయిన్ ఈ కథలో ఉందా అని డౌట్ వస్తుంది. ఆ రేప్ సీన్ తర్వాత మరీ డల్ గా జరుగుతుంది నేరేషన్.  ఏదో చెప్పాలి, వ్యవస్ద గురించి మాట్లాడాలి అనే డైరక్టర్ దేవకట్టా ఉద్దేశం అడుగడుగునా కనపడుతూనే ఉంటుంది. కానీ మాటలే సినిమా కాదు కదా. ఇక ఎత్తుగడ అయిన హీరో ఓటు వేరే వాళ్లు వేసేయటం సీన్ మనకు విజయ్ హీరోగా వచ్చిన సర్కార్ గుర్తు చేస్తుంది. ఇక రమ్యకృష్ణ క్యారక్టర్ ..బాహుబలిలో శివగామిని గుర్తు చేసినా అంత పరవ్ ఫుల్ గా అయితే అనిపించదు. జగపతిబాబు క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్నారు. మంచి  డెప్త్ ఉన్న క్యారక్టర్. క్లైమాక్స్ ఊహించము కానీ గొప్పగా అయితే లేదు. ఎందుకంటే అంతకు ముందే క్లైమాక్స్ మూవ్ మెంట్స్ అయ్యిపోయి..సాగతీత ఫీలింగ్ వచ్చింది.

డైరక్షన్ ,మిగతా డిపార్టమెంట్స్

దేవకట్టా అంటే డైలాగులు బాగుంటాయి అని మనకు గత సినిమాలు గుర్తు చేస్తాయి. కానీ ఈ సినిమాలో చాలా చోట్ల స్పీచుల తరహాలో డైలాగులు ఉండటం జరిగింది.భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టుల గురించి రాసుకున్న డైలాగులు అవసరం ఉన్నా లేకపోయినా చాలా చోట్ల చెప్పించేసారు. దాంతో హీరో మైక్ తీసుకుంటే కంగారుపుడుతుంది. అలాగే శివసేన పైనా కొన్ని కౌంటర్స్ వేసారు. అయితే అది రాజకీయాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికే అర్దమయ్యే కంటెంట్.

మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ గొప్పగా అయితే లేదు.  పాటలు ఏమీ గుర్తు పెట్టుకునే స్దాయిలో లేవు. ఎం సుకుమార్  కెమెరా వర్క్ బాగుంది.  కెఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ మాత్రం  ట్రిమ్మింగ్ కి కొంత అవకాశం ఉందనిపిస్తుంది. జెబి-జీ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. తేల్లేరు లొకేషన్ ని బాగా ఎస్టాబ్లిష్ చేసారు.

నటీనటుల్లో..

అభిరాం పాత్రలో  సాయి తేజ లీనమై చేసారు. రమ్యకృష్ణ సోసోగా ఉంది. జగపతిబాబు రెగ్యులర్ విలనీ నుంచి బయిటకువచ్చి హీరో తండ్రి పాత్రను అద్బుతంగా చేసారు.ఎన్నారై యువతి మైరా(ఐశ్వర్య రాజేశ్‌) తన పాత్రకు న్యాయం చేసింది. అవినీతి ఎస్సీగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కలెక్టర్‌గా సుబ్బరాజ్‌, జగపతిబాబు భార్యగా ఆమని, మిగతా పాత్రల్లో పోసాని,రాహుల్ రామకృష్ణ వంటి వారు ఒదిగిపోయారు.


నచ్చినవి

సాయి తేజ్ నటన
రమ్యకృష్ణ క్యారక్టరైజేషన్
మూసలో వెళ్లని స్టోరీ లైన్
డైలాగ్స్

నచ్చనవి

స్లో నేరేషన్
రీరికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు
ఎమోషన్స్  పండకపోవటం
ఎంటర్ టైన్మెంట్ అసలు లేకపోవటం
కథలో ఎక్కువైన ఫ్లాష్ బ్యాక్ లు
 
చూడచ్చా
పొలిటికల్ డ్రామాలు చూసే ఆసక్తి ఉంటే ఓ లుక్కేయవచ్చు..అదీ అంచనాలు లేకుండా

తెర ముందు..వెనక
సంస్థలు: జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్;
న‌టీన‌టులు: సాయిధరమ్‌ తేజ్, ఐశ్వర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామ‌కృష్ణ, పోసాని కృష్ణముర‌ళి తదితరులు;
ఛాయాగ్రహ‌ణం: ఎం.సుకుమార్‌;
 సంగీతం:  మ‌ణిశ‌ర్మ;
ఎడిటింగ్: కె.ఎల్‌.ప్రవీణ్;
స్క్రీన్‌ప్లే: దేవా క‌ట్టా‌, కిర‌ణ్ జ‌య్‌కుమార్‌;
నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు;
 క‌థ‌, మాట‌లు, ద‌ర్శక‌త్వం: దేవా క‌ట్టా;
రన్ టైమ్: 2 గంటల 32 నిముషాలు
 విడుద‌ల తేదీ‌: 1 అక్టోబ‌ర్ 2021