Reading Time: 3 mins

రైటర్ పద్మభూషణ్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji 

చిన్న సినిమాని ఇవాళ ప్రొడ్యూస్ చేయటం, తర్వాత దాన్ని థియేటర్ లోకి తీసుకొచ్చి నిలబెట్టడం పెద్ద ఫీట్ గా మారింది. చిన్న సినిమా అంటే ఓటిటి లో చూసుకోవచ్చు కదా అనే పరిస్దితి ఆడియన్స్ లో వచ్చేసిన ఈ టైమ్ లో ధైర్యం చేసిన వచ్చిన ప్రాజెక్టు ఈ రైటర్ పద్మభూషణ్. టైటిల్ కొంచెం గమ్మత్తుగా ఉండటంతో ఖచ్చితంగా సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటుందనిపిస్తుంది. అందులోనూ డిఫరెంట్ చిత్రాలు చేస్తున్న సుహాస్ హీరో అవటం కూడా ఈ సినిమాపై కొద్దో గొప్పో ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది. కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ :

ప‌ద్మభూష‌ణ్ (సుహాస్‌) లైబ్రరీలో పనిచేస్తూంటాడు. అతని జీవితాశాయాల్లో ఒకటి రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలి. దాంతో ఓ పుస్తకం రాసి, ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండా తొలి అడుగు అనే టైటిల్ తో ఓ పుస్తకం వేస్తాడు అయితే ఆ పుస్తకం ఎవరూ కొనరు దాంతో డబ్బులు వెనక్కి తిరిగి రాక, అందుకు చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేక నానా యాతన పడుతూంటాడు. ఈ లోగా అతనికి తెలియకుండా అతని పద్మభూషణ్ పేరుతో ఓ పుస్తకం బయిటకు వస్తుంది ఓ బ్లాగ్ కూడా ఏర్పాటై మంచి పేరు వస్తుంది దాంతో కొన్ని కుటుంబ గొడవలతో విడిపోయిన డబ్బున్న మేనమామ (గోపరాజు రమణ) వచ్చి భూషణ్ కి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు ఎంగేజిమెంటు అవుతుంది. అంతేకాదు మేనమామ అతడ్ని చాలా గొప్ప రైటర్ వి అంటూ ఆకాశానికెత్తేస్తాడు దాంతో పద్మభూషణ్ కి భయం పట్టుకుంటుంది. ఆ నవల తను రాయలేదని చెప్దామనుకుంటాడు కానీ ఆ విషయం తెలిస్తే మేనమామ ఎంగేజిమెంటు క్యాన్సిల్ చేస్తాడని భయపతాడు. ఇంతకీ ఆ నవల ఎవరు పద్మ భూషణ్ పేరు మీద ఎవరు రాశారు, ఎందుకు రాశారు?చివరకు పద్మ భూషణ్ పెళ్లి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ రోజుల్లో నవల్లు ఎవరు చదువుతున్నారు బ్లాగ్ లు ఎవరు రాస్తున్నారు అంటే ఈ కథ అక్కడే ఆగిపోతుంది కానీ డైరక్టర్ అక్కడే ఆ అనుమానం రాకుండా ఆ కథా ప్రపంచం క్రియేట్ చేయటంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మదర్ సెంటిమెంట్ తో నిలబెట్టేసింది. మరదలితో ప్రేమ,ఆ ప్రేమాయణంలో అసలు రచయిత తను కాదన్న గిల్టీ ఫీలింగూ బాగా పండింది. అతనిపై ఓ రకమైన సింపతీ ఏర్పడింది అయితే ఈ కథ చూస్తూంటే ఆరేళ్ల క్రీతం బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన బరేలికి బర్ఫీ సినిమాను గుర్తు రావటం ఖాయం. కథలో మేయిన్‌ పాయింట్‌ తీసుకుని కాస్త అటు ఇటుగా మార్చారని తెలిసిపోతుంది అయితే అది బరేలికి బర్ఫీ వాళ్ల ఇష్యూ కాబట్టి మనకు అనవసరం ఇక ఈ సినిమాకు కలిసొచ్చిన మరో అంశం. స్క్రీన్ ప్లే డిజైన్. ఎనభైల నాటి ఓల్డ్ నావెల్ పాయింట్ అయినా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో ఉండటంతో ఎక్కడా విసిగించదు. అలా సాగిపోతుంది. కాసేపు ఫన్, మరికాసేపు ప్రధాన పాత్రపై సానుభూతి, చివరకు ఓ చిన్న సెంటిమెంట్ టచ్ తో సినిమా మల్టిఫ్లెక్స్ ఫిల్మ్ లా ముందుకు వెళ్ళిపోతుంది స్మాల్ ఈజ్ బ్యూటీ అనుకునే వాళ్లకు ఇది నచ్చేస్తుంది.

ఎవరెలా చేసారంటే :

నవలా రచయిత అవుదామనుకుని అవ్వలేక , అయ్యినట్లు నటించే పాత్రలో సుహాస్ ఇమిడిపోయాడు. క్యారక్టరైజేషన్ గేమ్ తో ఫన్ బాగానే పడించారు. టీనా శిల్పరాజ్‌, రోహిణి, ఆశిష్‌ విద్యార్థి మనకు ఎప్పటిలాగా తెలిసున్న పాత్రల్లో జీవించేసారు. కొత్తగా అనిపించలేదు కానీ గోపరాజు రమణ బాగా చేసారనిపిస్తుంది.

టెక్నికల్ గా :

శేఖర్ చంద్ర సంగీతం బాగుంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది వెంకట్ శాఖమూరి కెమెరా వర్క్ కూడా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. కానీ ఇలాంటి కథను సపోర్ట్ చేసి నిర్మాతలు తమ అభిరుచిని చాటుకున్నారు రైటర్ కమ్ డైరెక్టర్ షణ్ముఖ్ ప్రశాంత్ తొలి సినిమాలా అనిపించదు. అక్కడక్కడా ఫన్ బాగా పండించారు అలాగే ఎమోషన్స్ ని బాగా పండించటంలో అనుభవం ఉన్న డైరక్టరల్ లా కనిపించాడు ఎడిటింగ్ అక్కడక్కడా కొన్ని అనవసరమైన సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.

చూడచ్చా:

ఓ వీకెండ్ ప్యామిలీతో హ్యాపీగా ట్రై చేయొచ్చు.

నటీనటులు :

సుహాస్‌, టీనా శిల్పరాజ్‌, రోహిణి, ఆశిష్‌ విద్యార్థి, శ్రీ గౌరీ ప్రియ, గోపరాజు

సాంకేతికవర్గం :

సంగీతం: శేఖర్‌ చంద్ర;
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ఆర్‌.శేఖమూరి;
ఎడిటింగ్‌: పవన్‌ కల్యాణ్‌, సిద్ధార్థ్‌;
నిర్మాత: అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చండ్రు మనోహరన్‌;
దర్శకుడు: షణ్ముఖ ప్రశాంత్‌;
రన్ టైమ్ : 123 మినిట్స్
విడుదల తేదీ: 03-02-2023