రొమాంటిక్ మూవీ రివ్యూ
ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE) :
రొమాంటిక్ అనే పదమే యూత్ ను ఆకట్టుకునే ఓ ట్రిక్. దాన్ని పట్టుకుని గేమ్ ఆడాలనుకున్నారు పూరి జగన్నాథ్. మోహానికి, ప్రేమకు మధ్య తేడా చెప్తానంటూ మన ముందుకు వచ్చారు. తన కుమారుడి సినిమాకు కేవలం డబ్బు మాత్రమే పెట్టకుండా కథ, మాటలు,స్క్రీన్ ప్లేని పెట్టుబడిగా పెట్టారు. తన అనుభవంతో,పరిచయాలతో ప్రమోషన్స్ తో హోరెత్తించారు. కావాల్సినదానికంటే ఎక్కువ బజ్ క్రియేట్ చేసారు. అది ఈ సినిమాకు ఏ మేరకు ఉపయోగపడింది. బజ్ తగ్గట్లుగా బాలెన్స్ తప్పకుండా సినిమా నడిచిందా..అసలు కథేంటి, హీరోయిన్ వర్కవుట్స్, పూరి హోం వర్క్ ఈ సినిమాకు ఏ మేరకు ఉపయోగపడ్డాయి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
అనాధ అయిన వాస్కోడిగామా (ఆకాష్ పూరి)కు ఓ జీవితాశయం. తన లాంటి అనాథల కోసం ఇళ్లు కట్టించాలనేది లక్ష్యం. అయితే డబ్బు ఎవరికీ ఊరికినే రాదు కదా. అందుకోసం క్రైమ్ వరల్డ్ లోకి ప్రవేశిస్తాడు. అప్పటికే గోవాలో డ్రగ్స్ స్మగ్లింగ్ భారీగా జరుగుతుంది. రెండు గ్రూప్ లో ఎప్పుడూ ఆధిపత్యం కోసం కొట్టేసుకుంటూంటాయి. వారిలో ఒకడిగా జాయిన్ అయ్యి…ఓ గ్యాంగ్ కి లీడర్ అవుతాడు. గోవా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా అవుతాడు. అప్పుడు ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ) సీన్ లోకి వస్తుంది. ఆమె వాస్కోని, అతని గ్యాంగ్‌ను అంతం చేయాలని వల వేస్తుంది. దాంతో ఇద్దరి మధ్యా వార్ మొదలవుతుంది. మరో ప్రక్క మౌనిక (కేతిక శర్మ) తో వాస్కో మోహం లాంటి ప్రేమాయణం సాగిస్తూంటాడు. తన ప్రేమను వాస్కోడిగామా సాధించుకున్నాడా… ఏసీపీ రమ్య…వాస్కో ని ఏం చేసింది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
హాట్ హాట్ ప్రోమోలు, కొంచెం గీత దాటిన డైలాగులు ఖచ్చితంగా యూత్ ని టార్గెట్ చేసేవే. అయితే అవే మొత్తం సినిమా అనుకోమంటే కష్టమే. ట్రైలర్ లో ఉన్నవి మాత్రమే సినిమాలో చూసుకోమంటే…ట్రైలరే నాలుగైదు సార్లు చూసుకుంటారు. సరిపోతుంది కదా. అదే రొమాంటిక్ సినిమాకు జరిగింది. ఈ సినిమాకు కథ,కాకరకాయ వంటివేమీ పూరి జగన్నాథ్ పెట్టుకోలేదు. తన రెగ్యులర్ టెంప్లేట్ లోకి మరో హీరో ని తీసుకొచ్చి కూర్చో బెట్టే ప్రయత్నం చేసాడు. అయితే ఆ హీరోకు ఆ సీన్స్ కు,ఎలివేషన్స్ ని నిలబెట్టే సత్తా ఉందో లేదో అని గమనించనుకోలేదు. బిజినెస్ మ్యాన్ నిలబెట్టడానికి మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్, అనుభవం సరిపోయాయి. కానీ ఇక్కడ ఈ హీరోకు ఆ రెండు లేవు. దాంతో మీసాలు రాని ఓ కుర్రాడు ఓ పెద్ద గ్యాంగస్టర్ అయ్యిపోయాడు..గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు అంటే చిత్రంగా అనిపిస్తుంది. లాజిక్ లేకపోయినా,సినిమా టెక్ అనుకుందామనుకున్నా ఈ కుర్రాడి స్టామినా దాన్ని అనుకోనివ్వదు. అలాగే సీన్స్ అన్నీ కథకు తగ్గట్లే కన్వీసింగ్ గా వెళ్లిపోతాయే తప్ప..ఎక్కడా బలమైన కాంప్లిక్ట్స్, క్యారక్టర్స్ మధ్య ఛాలెంజ్ ఉండదు. రవితేజ, మహేష్ బాబులను గుర్తు చేస్తూ ఆకాష్ తెరపై రెచ్చిపోతూంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది తప్ప ఆ ఎమోషన్ లోకి వెళ్లలేం. అప్పటికీ కేతిక శర్మ తన గ్లామర్ తోనూ రమ్యకృష్ణ తన నటనతోనూ సినిమాని రెండు వైపులా పట్టుకునే ప్రయత్నం చేసారు. ఏదైమైనా హీరోని బట్టి కథను రాసుకుంటే బెస్ట్ అనే విషయం ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది. డ్రామా స్టార్టయ్యేలోగా డైలాగులు దాన్ని మింగేసే ధోరణి కూడా పూరి జగన్నాథ్ వదులుకోవాలనిపిస్తుంది. పెద్ద హీరోలతో మాస్ సినిమాల్లో మూస ధోరణి కూడా మేజిక్ లాగ అనిపిస్తుంది. అయితే ఇలాంటి సినిమాల్లో దాన్ని హీరో మోయలేనప్పుడు అది బయిటపడి భయపెడుతుంది.
టెక్నికల్ గా …
సాంకేతికపరంగా చూస్తే..సునీల్ కశ్యప్ సంగీతం జస్ట్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. అలాగే ఎప్పటిలాగే పూరి తన డైలాగులతో మ్యాజిక్ చేసారు. నరేష్ రానా సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవిల్ లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. “పీనే కె బాద్” లో రామ్, పూరి జగన్నాథ్ ఇద్దరూ కనిపించి సందడి చేయటం బాగుంది.
గ్యాంగ్ స్టర్ వాస్కోడి గామాగా ఆకాశ్ పూరీ ఆనలేదు. నటనలో వంకపెట్టలేం కానీ పాత్రను పండించలేకపోయారు. అంతకు ముందు సినిమాలతో పోలిస్తే నటనలో మెచ్యూరిటీ ఎంతో కనిపించింది. మోనిక గా కేతికాశర్మ..గ్లామర్ తో దుమ్ము రేపింది. రొమాంటిక్ సీన్స్ ని బాగా పండించింది. క్లైమాక్స్ దాకా ఆమెకు ఫెర్పామెన్స్ చేసే అవకాసం లేదు. ఇక రమ్యకృష్ణ నటన గురించి చెప్పుకునేదేముంది. హీరో బెస్ట్‌ఫ్రెండ్‌గా దేవియాని శర్మ, గ్యాంగ్ శాంసన్‌గా మకరంద్ దేశ్‌పాండే, పోలీసు అధికారిగా ఉత్తేజ్, అతని భార్యగా యాంకర్ సునైనా తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరక్టర్ గా పరిచయం అయిన అనిల్ పాదూరి..పూరి జగన్నాథ్ లాగ ప్రయత్నించకుండా తన ముద్ర వేసి ఉంటే బాగుండేది.
చూడచ్చా…
యూత్ జనం ఓ లుక్కేయచ్చు..వాళ్లకు నచ్చచ్చు
నచ్చినవి
పూరి డైలాగులు
కేతిక శర్మ గ్లామర్
రమ్యకృష్ణ ఫెరఫార్మెన్స్
నచ్చనవి
లాజిక్ లు లేని కథ,విసుగెత్తించే స్కీన్ ప్లే
సెకండాఫ్ లో సీన్స్ విషయం లేకుండా విసుగెత్తించటం
తెర వెనుక..ముందు
నటీనటులు: ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్యకృష్ణ, ఉత్తేజ్, రమాప్రభ, దేవయాని, మకరంద్ దేశ్ పాండే తదితరులు;
సంగీతం: సునీల్ కశ్యప్;
ఛాయాగ్రహణం: నరేష్ రానా;
కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు: పూరి జగన్నాథ్;
దర్శకత్వం: అనిల్ పాదూరి;
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి;
విడుదల తేదీ: 29-10-2021
రన్ టైమ్: 2 గంటల, 12 నిముషాలు.