రౌడీబాయ్స్ మూవీ రివ్యూ
రివ్యూ: రౌడీబాయ్స్
దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాత సొంత కుటుంబం నుంచి హీరోగా లాంచింగ్ అవుతున్న కుర్రాడు సినిమా ఎలా ఉంటుంది…రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా…అన్నట్లు దిల్ రాజు తలుచుకుంటే తగ్గేదేలే అన్నట్లు ఉండదూ. దానికి తోడు చాలా కాలం తర్వాత కాలేజీ బ్యాక్ గ్రౌండ్ లో సినిమా, పవర్ ఫుల్ టైటిల్, హుషారు వంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ …కాంబినేషన్ కేక పెడుతోంది..మరి సినిమా ఎలా ఉంది? దిల్ రాజు తమ ఫ్యామిలీ హీరో కోసం ఎలాంటి కథను ఎంచుకున్నారు?స్టోరీ లైన్:
LIT ఇంజినీరింగ్ కాలేజీ కుర్రాడు అక్షయ్ (ఆశిష్).BMC మెడికల్ కాలేజీ అమ్మాయి కావ్య (అనుపమ పరమేశ్వరన్). ఈ రెండు కాలేజీ స్టూడెంట్స్ మధ్యా ఎప్పుడూ గ్యాంగ్ వార్. ఈ లోగా ఖాళీగా బేవార్స్ తిరిగే మన బాబు అక్షయ్..వెళ్లి అందంగా అమాయికంగా కనిపించే కావ్యతో ప్రేమలో పడతాడు. సర్లే అందగత్తెను ప్రపంచంలో ఒక్కరే ప్రేమిస్తారా…కావ్య క్లాస్మేట్ విక్రమ్ (విక్రమ్ సహిదేవ్) కూడా ఆమెని ప్రేమలో ఉంటాడు. అయితే కావ్య… అక్షయ్ కు పడిపోయింది అని తెలిశాక ఊరుకుంటాడా..పగ ప్రతీకారం అంటూ బయిలుదేరతాడు. మన హీరోని రకరకాలుగా ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ క్రమంలో కావ్య..మరింతగా అక్షయ్ కు పడిపోతుందని అర్దం చేసుకోడు. దాంతో ఆమె ఏకంగా లివ్ ఇన్ రిలేషన్ లోకి వెళ్లిపోతుంది. కానీ కథ ఇలా సవ్యంగా వెళ్తే కష్టం కదా…ఓ కొత్త ట్విస్ట్ పడుతుంది. కథ మలుపు తిరుగుతుంది. అసలా ట్విస్ట్ ఏమిటి…అక్షయ్ లవ్ స్టోరీ ఫైనల్ గా ఏమౌతుంది తెలియాలంటే సినిమా చూడాలి.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …
అప్పుడెప్పుడో వినీత్, టబు, అబ్బాస్ కాంబినేషన్ లో కదిర్ దర్శకత్వంలో ప్రేమదేశం సినిమా వచ్చింది. దానికి అప్ డేట్ వెర్షన్ లా ఈ సినిమా తీద్దామనుకున్నట్లున్నారు. అయితే ఇది అవుట్ డేటెడ్ వెర్షన్ .ఎక్కడా ప్రెషనెస్ అనేది కనపడదు. కొత్త బంగారు లోకం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బ్యానర్ నుంచి ఇలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేయము. ముఖ్యంగా ఎంతో అనుభవం ఉన్న దర్శకులు కొందరి పర్యవేక్షణలో ఈ సినిమా మార్పులు,చేర్పులు జరిగాయని అన్నారు. వాళ్ళెవరూ ఈ సినిమా లో ఎమోషన్ కనెక్ట్ కావటం లేదనే విషయం గమనించలేకపోయారు. కాలేజీ సీన్స్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లు..ఇవన్ని ఎప్పుడో మనవాళ్లు చూసేసారు. ఈ కాన్సెప్ట్ కు నెక్ట్స్ లెవిల్ లో ఉండే సీన్స్ వేసుకోకుండా అవే పాతపడిన సీన్స్,ఎక్సప్రెషన్స్ ,స్టోరీ లైన్ తో లాగేసే ప్రయత్నం చేసారు. కొత్తకుర్రాడుకి కొత్త కథ అయితే కష్టంగా ఉంటుందనుకున్నారేమో. కానీ కథ బాగుంటే కుర్రాడు ఎలా చేసినా సర్దుకుపోదుము. సినిమా ప్రమోషన్ మీద పెట్టిన శ్రద్ద కథ, కథనాల మీద పెట్టలేకపోయాడు. హుషారుతో ఆకట్టుకున్న శ్రీహర్ష రెండో సినిమాకు ఇంత దారుణంగా తడబడతాడు అని ఊహించము. పోనీ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచే లవ్ ట్రాక్ లో ఏమన్నా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. ఎంతసేపూ కాలేజ్ గొడవలు, లవ్ ప్రపోజల్స్ , డాన్సులతో టైమ్ పాస్ చేసేసారు. ఫస్టాఫ్ అలాగే సెకండాఫ్ సోదిలాగే నడిచింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అనుకుని వెళ్లే కుర్రాళ్లకు నిరాశ తప్పదు. సారీ బోయ్స్ అనేసి వచ్చేయ తప్పదు.
నటీనటులు విషయానికి వస్తే…:
అక్షయ్ పాత్రలో కొత్త కుర్రాడు ఆశిష్ ఓకే అనిపించాడు. బెస్ట్ అయితే కాదు. డాన్సులు బాగున్నంత మాత్రాన మంచి హీరో అవ్వలేరు. అనుపమ పరమేశ్వరన్ సినిమాకు ఎంతవరకూ ప్లస్ అయ్యిందో ఆమెకే తెలియాలి. మూడు నాలుగు సార్లు లిప్ లాక్ చేసి షాక్ మాత్రం ఇచ్చింది.. విక్రమ్ పాత్రలో సహిదేవ్ బాగా నటించాడు. కార్తిక్ రత్నం, తేజ్ కూరపాటి, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ వంటి వారు పాత్ర పరిధి మేరకు చేసుకుంటూ పోయారు.
దర్శకత్వం…మిగతా విభాగాలు
శ్రీహర్ష రాసుకున్న కథలో కొత్తదనం అనేది సున్నా…దానికి తోడు ఉన్న కాస్త కంటెంట్ ని ఎమోషనల్ గా ఆవిష్కరించగలగడంలో తడబడ్డాడు. కాలేజీ నేపథ్యంలో వచ్చే గ్యాంగ్ వార్ సీన్స్ ని తెరకెక్కించినంత బాగా మిగతా సినిమా తీయలేకపోయారు. అయితే టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ పాటల్లో ఒకట్రెండు ఛల్తాహై. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫర్ మధు ప్రతీ ఫ్రేమ్ ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. ఆర్ట్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది. డైలాగులు ఓకే. ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నచ్చినవి:
ఆశిష్ రెడ్డి డాన్స్ లు,
హీరోయిన్ బోల్డ్ సీన్స్,లిప్ లాక్ లు
పాటలు
సినిమాటోగ్రఫీ
నచ్చనవి:
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం
రొటీన్,లాజిక్ లెస్ సీన్స్
చూడచ్చా:
పనిగట్టుకుని చూసి తీరాలి అనిపించే సినిమా అయితే కాదు
ఎవరెవరు…
నటీనటులు: ఆశిష్, అనుపమ పరమేశ్వరన్, విక్రమ్ సహిదేవ్, కార్తిక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,
కూర్పు: మధు,
ఛాయాగ్రహణం: మదీ,
దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి,
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్,
రన్ టైమ్ : 2 గంటల 25 నిమిషాలు
విడుదల తేదీ: 14-01-2022.