Reading Time: 3 mins

వారసుడు మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

విజయ్ వారసుడు మూవీ రివ్యూ

ద‌ళ‌ప‌తి విజ‌య్ వారిసు చిత్రం మొదట తమిళంలో రిలీజైంది. తెలుగులో వార‌సుడు పేరుతో నాలుగు రోజులు లేటుగా విడుదల చేసారు తమిళ హీరో విజయ్ చిత్రం అయినా ఇందులో తెలుగు వారి పాత్ర ఎక్కువ. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు సినిమాను నిర్మించారు. త‌మిళంలో ఆయ‌న నిర్మించిన మొద‌టి సినిమా ఇదే కావ‌డం విశేషం. అలాగే తెలుగు స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. తెలుగువారి అభిమాన స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా విజ‌య్ స‌ర‌స‌న న‌టించింది. తెలుగు నుంచి జ‌య‌సుధ‌, శామ్‌, శ్రీకాంత్‌, సంగీత‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగులో ఎలా ఉంది, కథేంటి వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

రాజేంద్ర (శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ టైకాన్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్) వీళ్లలో ఎవరికి అప్పచెప్పాలనే ఆలోచనలో ఉంటాడు. విజయ్ తన తండ్రి విధానాలు నచ్చక, అభిప్రాయాలు భేదాలు వచ్చి ,విభేధించి,తనకు నచ్చినట్లు బ్రతుకుతానంటూ ఇంటినుంచి బయిటకు వెళ్లిపోతాడు. జై,అజయ్ ల కన్ను మాత్రం ఈ చైర్మన్ కుర్చీపైనే ఉండి తండ్రిని అంటిపెట్టుకుంటారు. మరో ప్రక్క ఎప్పుడు ఇలాంటి సిట్యువేషన్ వస్తుందా అని వ్యాపార ప్రత్యర్ది జయ్ ప్రకాష్(ప్రకాష్ రాజ్) ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో రాజేంద్రన్ తనకు అనారోగ్యం అనే విషయం తెలసి టైమ్ అయ్యిపోయిందని గ్రహిస్తాడు. తన సామ్రాజ్యానికి అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. చిన్న కొడుకుకి కబురు వెళ్తుంది. ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్ .తన మంచితనం, కుటుంబం పట్ల ప్రేమ, బిజినెస్ తెలివితో ఎలా తనే వారసుడు అనిపించుకున్నాడు. తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు. ప్రత్యర్దిగా ఉండి కుట్ర చేస్తున్న జయప్రకాష్ కి ఎలా బుద్ది చెప్పాడు. బీటలు తీసిన తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు రష్మికతో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 ఎనాలసిస్

ప్రెషెనెస్ అనే పదాన్ని దూరంగా పెట్టి రొటీన్ రాజాలా రాసుకున్న కథ ఇది. సినిమా చూస్తూంటే అల వైకుంఠపురములో మొదలుకుని అత్తారింటికి దారేది, డార్లింగ్ లాంటి అనేక సినిమాలు వరస పెట్టి కళ్లదెరుగా కనపడుతాయి. అలాగే వాటిలో మసాలాలు, ఫైట్లు, ఆహ్లాదపరిచే పాటలు అన్నీ ఇక్కడ రిపీట్ అవుతూంటాయి. ఇదే వంశీ పైడిపల్లి తీసిన బృందావనం సీన్స్ కూడా ఇక్కడ కనపడతాయి. విజయ్ పాత సినిమాలు తమిళ వాళ్లకు కనపడతాయి. ఉమ్మడి కుటుంబంలో ఏ లోపాలు లేకుండా ఎవరూ ఉండరు, వాటిని అర్థం చేసుకుని సర్దుకుంటూ జీవితం గడపితేనే అసలైన ఆనందం అని చెప్పాలన్న తపన దర్శకుడు మెగా టీవీ సీరియల్ గా మార్చేసాడు. మైనింగ్ డీల్స్ క్లాష్ జేపి (ప్రకాష్ రాజ్) గ్రూప్ , రాజేంద్ర గ్రూప్ (శరత్ కుమార్) తో సినిమా ప్రారంభం అవుతుంది. రా తలైవా సాంగ్ తో మాసీగా విజయ్ ఇంట్రడక్షన్ చేస్తారు. అప్పుడుశరత్ కుమార్ కొడుకులు శ్రీకాంత్,కిక్ శ్యామ్, విజయ్ అని పరిచయం చేస్తారు. ఇది శరత్ కుమార్ ఫ్యామిలీ కథ అని అర్దమవుతుంది. తండ్రితో గొడవపడి ఏడేళ్లపాటు దూరంగా ఉన్న విజయ్ తిరిగి రావటంతో కథలో కదలిక వస్తుంది. అలా కథలోకి మెల్లిగా వెళ్లి ఫ్యామిలీ సీన్స్ కు ప్రయారిటీ ఇస్తూ విజయ్ ని మధ్య మధ్యలో గుర్తు వచ్చినప్పుడు ఎలివేట్ చేస్తూ కథ కాంప్లిక్ట్ లో పడేదాకా నడుపుతారు. ఇంట్రవెల్ చిన్న ట్విస్ట్.తర్వాత విజయ్ .తన తండ్రి బిజినెస్ ఎంపైర్ ని చేతుల్లోకి తీసుకుని ఏరివేత కార్యక్రమం మొదలెట్టడం జరుగుతుంది. అంతా ప్రెడిక్టుబుల్ గానే సాగుతుంది. ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ ఏమిటి అంటే విజయ్ పాత బ్లాక్ బస్టర్ సినిమాలను గుర్తు చేస్తూ వింటేజ్ విజయ్ ని చూపిస్తూ .ఆ మెమెరీస్ ని తట్టి లేపే కొన్ని సీన్స్ ని ఎంచుకోవటమే. కెరీర్ ప్రారంభంలో విజయ్ చేసిన సినిమాల్లో హైలెట్స్ ఇక్కడ ప్లే అవుతూంటాయి. అవి ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్ కు పండగ చేసేవే.

బాగున్నవి

వింటేజ్ విజయ్ సీన్స్
కామెడీ వన్ లైనర్స్
యోగిబాబుతో ఫన్

బాగోలేనివి

ఎన్నో సార్లు చూసేసిన రొటీన్ కథ
ప్రెడిక్టబుల్ గా సాగే కథనం

టెక్నికల్ గా

ఈ సినిమా భారీతనంతో రిచ్ గా ఉండేందుకు టెక్నికల్ టీమ్ పడిన కష్టం కనపడుతుంది. అయితే అదే సమయంలో దర్శకుడుగా వంశీ పైడిపల్లి .విజయ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా హిట్ కొట్టాలనే చేసిన డిజైన్ కనిపిస్తుంది. తమన్ సంగీతంలో రంజితమే ఒకటే మంచి హుషారుగా సాగుతుంది. మిగిలినవి సోసోనే. మిగతా సాంగ్స్ పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో తన మార్క్ చూపించారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ, యాక్షన్ ఎపిసోడ్స్‌లో మ్యూజిక్‌కి ప్రశంసలు దక్కాల్సిందే.

సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. పాటల్లో, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్లలో కెమెరాపనితనాన్ని చూపించారు. ఇక రష్మిక షోను మరింత అందంగా ఆకర్షణీయంగా చూపించి ప్రేక్షకులు చూపుతిప్పుకోకుండా చూపించారు. ఎడిటింగ్ వర్క్ బాగుంది. దిల్ రాజు బాగా ఖర్చు పెట్టారని అర్దమవుతుంది.

నటీనటుల్లో

స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా విజయ్ బాగున్నాడు ఇది పూర్తిగా విజయ్ భుజాలమీద మోసిన చిత్రం. అదిరిపోయే ఫన్నీ వన్ లైనర్స్ తో టెర్రపిక్ గా తెరపై విజయ్ చెలరేగిపోయాడు. ముఖ్యంగా తన నిజ జీవితానికి సంభందించిన రిఫరెన్స్ పంచ్ లు కు మామూలు రెస్పాన్స్ రావటం లేదు. సెంటిమెంట్ సీన్స్ ని తన అనుభవంతో లాగేసాడు. రష్మిక గురించి పెద్దగా చెప్పుకోనేది ఏమీలేదు . ప్రకాష్ రాజ్, జయసుధ వంటి వారు తమదైన నటన చేసుకుంటూ వెళ్లిపోయారు. విలన్ ట్రాక్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎస్ .జె సూర్య కనపడేది కాసేపే అయినా హైలెట్ గా నిలిచాడు.

చూడచ్చా

కుటుంబ అనుబంధాలు ,ఆప్యాయతలు ,కొద్దిపాటి సెంటిమెంట్ , ఎమోషన్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది. మిగతా వాళ్లుకు బోరే.

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
నటీనటులు : విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్
డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌
Run Time: 2h 45m
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి