విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు, లలిత్ కుమార్ కాంబినేషన్లో బ్రహ్మాండమైన యాక్షన్ త్రిల్లర్ చిత్రం!
తాను నటించే ప్రతి పాత్రను.. కంటిని కాపాడే కనురెప్పలా భావించి అద్భుతమైన నటనతో రక్తికట్టించే నటుడు, ప్రేక్షకులను రెప్పపాటు క్షణం చూపును కూడా పక్కకు మరల్చనివ్వకూడదనుకునే దర్శకుడు కలసి ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తే?.. అంతేనా, ఆ కొత్త చిత్రానికి 7 స్క్రీన్ స్టూడియో బ్యానరుపై లలిత్ కుమార్ నిర్మిస్తే.. ఇంతకీ, ఆ హీరో విక్రమ్, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు అయితే.. ఆ వార్త చిత్ర పరిశ్రమకే ఓ పండగ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఆసక్తికర అంశాన్నే ప్రకటనగా చేస్తున్నారు లలిత్ కుమార్. 7 స్క్రీన్ స్టూడియో, వయాకమ్ 18 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా నటిస్తున్నారు.
తన దర్శకత్వంలో వచ్చిన “డిమాంటి కాలనీ”, “ఇమైకా నొడిగల్” వంటి రెండు చిత్రాలు అజయ్ జ్ఞానముత్తుకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఇక నటన కోసం తనను తాను అంకితం చేసుకునే విక్రమ్ ఈ సినిమా కోసం సిద్ధం అయ్యారు. ఎంతో ఆసక్తికరమైన వీరిద్దరి కాంబినేషన్లోని కొత్త చిత్రం షూటింగ్ ఆగస్టులో ఆరంభం కానుంది. 2020 వేసవి వినోదాత్మక చిత్రంగా దీన్ని విడుదల చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక కళాకారుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ వంటి భిన్నమైన కథాంశంతో బ్రహ్మాండమైన బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ పూర్వ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. భారతీయ సినిమాలోనే ఇది చాలా ముఖ్యమైన చిత్రంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.