Reading Time: 2 mins
విడుదలకి సిద్దమైన ఘంటసాల ది గ్రేట్ బయోపిక్
 
 
విడుదలకి సిద్దమైన “ఘంటసాల ది గ్రేట్”
 
 
 
దక్షిణ భారత దేశమంతటా మారుమోగిన మహా గాయకుడు ఘంటసాల జీవితం తరువాతి తరాలకు కూడా తెలిసేలా చేసిన వెండితెర ప్రయత్నం ‘ఘంటసాల ది గ్రేట్’. గతంలో ‘ఘంటసాల పాటశాల’ పేరుతో ఘంటసాల ప్రసిద్ధ గీతాలని సంకలనం చేసిన సి.హెచ్. రామారావు ఈ ఘంటసాల బయోపిక్ కి రచన, దర్శకత్వం చేశారు. విశేషం ఏంటంటే, ఇందులో ఘంటసాల దంపతుల పాత్రలను నిజ జీవితంలో భార్యా భర్తలైన వారు పోషించడం. ఘంటసాలగా యువ గాయకుడు, ‘సూపర్ సింగర్స్ 7’ ఫేమ్ కృష్ణ ఛైతన్య నటించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా కృష్ణ చైతన్య భార్య, టీవీ యాంకర్ మృదుల తెరపై కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసురావు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.
 
అన్యుక్త్ రామ్ ప్రొడక్షన్స్ పతాకంపై గాయకుడు జి.వి. భాస్కర్ నిర్మాణ సారధ్యంలో ఘంటసాల వీరాభిమాని శ్రీమతి లక్ష్మీ నీరజ ఈ బయోపిక్ ని నిర్మించారు.
 
దర్శకులు సి.హెచ్. రామారావు మాట్లాడుతూ, “ఘాటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఆ మహనీయుడు మహాగాయకుడిగా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, అన్ని కష్టాలూ ఈ చిత్ర నిర్మాణంలో మేం పడుతున్నాం. అయినప్పటికీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎందరు అడ్డు తగిలినా, త్వరలో  ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. అందులో ఆ ఘంటసాల గారి ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి” అని చెప్పారు.
 
ఈ చిత్ర సహ నిర్మాత జి.వి. భాస్కర్ మాట్లాడుతూ, “ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ ని విదేశంలో వందలాది మంది తెలుగు ప్రేక్షకుల సమక్షములో విడుదల చేసే అదృష్టం దక్కింది. ఈ చిత్ర సమర్పకులు, లయన్ డా. కె. శ్రీ లక్ష్మీ ప్రసాద్ నేతృత్వంలో ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది  సురేష్ అధ్యక్షతన ‘రాగ స్వర’  అనే సాంస్కృతిక  సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హాం నగరంలో ప్రఖ్యాత గాయని, సౌత్ ఇండియా నైటింగేల్ ‘పద్మశ్రీ’ చిత్ర గారి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసాం. ఈ ట్రైలర్ కి అనూహ్య స్పందన వచ్చింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం కూడా అదే రీతిలో ప్రేక్షకుల మన్ననలు పొందనుంది” అని తెలిపారు.
 
ప్రఖ్యాత హిందూస్తాను సంగీత విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ తో సుమన్ నటించారని నిర్మాత శ్రీమతి లక్ష్మీ నీరజ తెలిపారు.
 
కృష్ణ చైతన్య, మృదుల ,సుమన్, సుబ్బరాయ శర్మ, దీక్షిత్ మాస్టర్, జే.కె. భారవి, అశోక్ కుమార్, మాస్టర్ అతులి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.
 
ఈ చిత్రానికి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు మురళీధర్. వి, ఎడిటింగ్: క్రాంతి (RK), ఆర్ట్: నాని, సహ నిర్మాత: జి.వి. భాస్కర్, నిర్మాత: లక్ష్మీ నీరజ, రచన – దర్శకత్వం: సిహెచ్. రామారావు.