విడుదల 1 మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
తమిళంలో చాలా తక్కువ సినిమాలే చేసినా గొప్ప దర్శకులులో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. తన తొలి చిత్రం పొల్లాదవన్ మొదలుకుని.. లేటెస్ట్‌గా రిలీజైన విడుదలై వరకు అన్నీ కల్ట్ మూవీసేగా గుర్తింపు తెచ్చుకున్నాయి. విడుదలై సినిమా తమిళంలో మంచి క్రేజ్ క్రియేట్ చేసింది. మరి ఈ డబ్బింగ్ వెర్షన్ తెలుగులోనూ అదే స్దాయి బజ్ తెచ్చుకోగలదా..వెట్రిమారన్ పెద్దగా పరిచయం లేని సామాన్యుడుని ఈ సినిమా ఆకట్టుకుంటుందా..తమిళ నేటివిటి మనవాళ్లకు ఎక్కుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ :
ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకు పోలీస్ లు రాత్రింబవళ్లూ కష్టపడుతూంటారు. ఆ ప్రత్యేకమైన పోలీస్ దళంలో డ్రైవర్‌గా చేరతాడు కుమరేశన్ (సూరి) . పోలీస్ లకి రోజూ జీప్‌లో ఆహారం సరఫరా చేయడమే కుమరేశన్ పని. అక్కడ ఓ సంఘటనతో లోకల్ గా ఉండే తమిళసై అలియాస్ పాప (భవానీ శ్రీ)తో కుమరేశన్ కు పరిచయం…. అది కాస్త ప్రేమకి దారితీస్తుంది. ఒక పక్క ప్రేమ, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేటలో బిజిగా ఉంటూంటాడు. అయితే పోలీస్ డిపార్టమెంట్ మరో అడుగు ముందుకు వేస్తుంది. పెరుమాళ్ ఆచూకీ కోసం తోపాటు మరికొందరు మహిళలను నగ్నంగా నిలబెట్టి పోలీసులు హింసిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో పెరుమాల్ ఆచూకీ తనకు తెలుసని, కొంత మంది సిబ్బందిని ఇస్తే తాను పట్టుకొంటానని, వాళ్లను వదిలేయమని ఉన్నతాధికారి మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్)ను కోరడంతో అందుకు సదరు అధికారి సమ్మతించి కుమరేశన్‌కు అధికారాలిస్తాడు. అప్పుడేమైంది.. కుమరేశన్ ఎలాంటి సంఘర్షణకి గురవుతాడు, పెరుమాళ్ దొరికాడా..అసలు అతను ఎవరు అనేది మిగతా కథ.
ఎనాలసిస్ :
మనకంటే తగ్గిపోయింది కానీ … తమిళంలో ఇంకా ఇప్పటికీ సాహిత్యం నుంచి సినిమాలు రూపొందుతూనే ఉన్నాయి. అక్కడ నవలా, కథా సాహిత్యం వైపు సినిమా వాళ్లు చూస్తూనే ఉన్నారు. తమిళంలో లబ్దప్రతిష్టులైన ఎందరో రచయితలు, నవలాకారులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో రచనలకు ఆదరణ తగ్గినా, ఒకప్పుడు ఆయా రచయితల నవలల ఆధారంగానే ఎన్నో చలనచిత్రాలు రూపొందాయి. ఇప్పటికీ అడపా దడపా నవలా సాహిత్యం వైపు తమిళ సినిమా ఓ కన్ను వేస్తూనే ఉంది. సినిమాగా తీయగల మంచి నవలా లేదా కథ స్క్రిప్టు దొరికితే.. వాటిని తెరకెక్కించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు పలువురు దర్శకులు. ఇలాంటి వారిలో వెట్రిమారన్ ముందుంటారు. ఆయన సినిమాలు సాహిత్యం నుంచే పుడుతూంటాయి. ఇదిగో ఈ తాజా చిత్రం కూడా అదే కోవలోది. తమిళనాట ప్రముఖ రచయితగా వెలుగుతున్న బి.జయ మోహన్ రాసిన ‘తునైవన్’ అనే చిన్న కథ ఆధారంగా ఈ సినిమా తీసారు. జయమోహన్ ఈ సినిమాకు వెట్రిమారన్ తో కలిసి స్క్రీన్ ప్లే సైతం రాసారు. హక్కు, బాధ్యత మధ్య ఎంతటి సంఘర్షణ ఉంటుందో ఈ కథ ద్వారా జయమోహన్ చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ఈ సినిమా లో ఆ విషయం పూర్తిగా ఎలివేట్ అయ్యిందో లేదో చెప్పలేం. ఎందుకంటే ఇది రెండు పార్ట్ లు గా చెప్పబడిన కథ. సినిమాను రెండు భాగాలుగా చేసినప్పుడు అది కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందేమో కానీ చూసేపటప్పుడు ఎంతో కొంత అసంతృప్తిని కథా పరంగా మిగిలిస్తుంది. అందులోనూ కరెక్ట్ గా ఎక్కడ ఆపుచేయాలో అక్కడ సినిమాని ఆపనప్పుడు..రెండో బాగానికి లీడ్ కోసమే సినిమా మొత్తం లాగినప్పుడు మరింత విసుగొస్తుంది. అదే ఈ సినిమాకూ జరిగింది. కథలో ఎక్కడా చెప్పుకోదగ్గ మలుపులు,మెరుపులు ఉండవు. కాబట్టి ఈ కథను విశ్లేషించాలంటే రెండు పార్ట్ లలో కథ తెలిస్తే కానీ సాధ్యపడదు. కేవలం ఇక్కడ దాకా ఈ కథ మాత్రం సోసోగా ఉందనే చెప్పాలి. అసలు కథ రెండో పార్ట్ కు దాచారు అని ఊహించుకుని ఆనందపడాల్సింది.
టెక్నికల్ గా :
ఎంతగానో ఊహించుకునే ఇళయరాజా సంగీతం తేలిపోయింది. ఆయన సమకూర్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంటే.. సౌండ్ డిజైన్ ఈ చిత్రానికి బాగా హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. కథ జరిగే లొకేషన్ అడవిని అంతే అందంగా,సహజంగా ఆర్.వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ పట్టుకుంది. అతని కెమెరా వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ఛేజింగ్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసారు. ఆర్ట్ వర్క్ చాలా సహజంగా ఉంది. వెట్రిమారన్ మార్క్ సీన్స్ అడుగడుగునా ఉన్నాయి.ఎఢిటింగ్ మరింత స్పీడుగా ఉండేలా చూస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో :
కమెడియన్ గా చూసిన సూరిని.. మొదటిసారి సీరియస్ రోల్లో చూడడం ఆశ్చర్యపరుస్తుంది. విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ అని చెప్పాలి. హీరోయిన్ భవానీ శ్రీ బాగా చేసింది. పోలీస్ పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒదిగిపోయాడు.
చూడచ్చా :
వెట్రిమారన్ సినిమాల మీద మమకారం ఉంటే ఖచ్చితంగా చూడదగ్గ చిత్రం.
నటీనటులు :
సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో విజయ్ సేతుపతి
సాంకేతికవర్గం :
పాటలు : చైతన్య ప్రసాద్ (తెలుగులో)
సినిమాటోగ్రఫీ : ఆర్. వేల్ రాజ్
సంగీతం : ఇళయరాజా
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
రచన, దర్శకత్వం : వెట్రిమారన్
తెలుగులో విడుదల : అల్లు అరవింద్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్)
Running time: 2h 36m
విడుదల తేదీ: ఏప్రిల్ 15, 2022