Reading Time: 3 mins

వినయ విధేయ రామ మూవీ రివ్యూ

ఇదేం మాస్  మామా : ‘వినయ విధేయ రామ’ రివ్యూ 

రేటింగ్ :  2.5/5

రంగస్ధలం సినిమాతో ట్రాక్ లో పడ్డాడు రామ్ చరణ్. తన బలమేంటో…తన అభిమానులు ఏం కోరుకుంటున్నారో అర్దం చేసుకునే అవకాసం ఇచ్చిందా సినిమా. దాంతో అందరి దృష్టీ రామ్ చరణ్ తదుపరి ఎలాంటి సినిమా, ఏ దర్శకుడుతో చేయబోతున్నారనే చర్చకు తావిచ్చింది. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి తో ముందుకు వెళ్లాడు. ట్రైలర్స్, టీజర్స్ తో మనం చూడబోయేది పూర్తి యాక్షన్ చిత్రం ఇచ్చేసాడు.

ఈ నేఫధ్యంలో విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుంది. అసలు కథేంటి..బోయపాటి తో చేయాలనే రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా…వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

కథేంటి

అనాధలైన (ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌, రామ్‌ చరణ్‌) చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఓ కుటుంబంలా బ్రతుకుతూంటారు.  వాళ్లలో అందరి కన్నా చిన్నవాడు రామ్ కొణిదెల (రామ్ చరణ్).  తన అన్నలంటే ప్రాణం పెట్టే రామ్ అంటే మిగతా వాళ్లందరికీ ప్రేమ, ఇష్టం. ఇక రామ్ పెద్ద‌న్న భువన్ కుమార్ (ప్ర‌శాంత్‌) ఐఏఎస్ చేసి విశాఖపట్నంకు  ఎలక్షన్ కమిషనర్‌గా వస్తాడు. నీతి,నిజాయితో ముందుకు వెళ్లే భువన్ కుమార్ అక్కడ అవినీతిలో కూరుకుపోయిన  పందెం పరశురాం (ముఖేష్ రుషి)  వల్ల ఇబ్బందులు పడతాడు. దాంతో వీరి మధ్య గొడవ మొదలై, రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేసే స్దాయికి వెల్తుంది.  కరెక్ట్ గా పరుశురాం మనుష్యులు ఈ ఫ్యామిలీని లేపేస్తారనే సమయంలో బీహార్ సీఎం వచ్చి సేఫ్ చేస్తాడు.  ఆ క్రమంలో రామ్ ని చంపటానికి మరో విలన్ రాజూ భాయ్‌ (వివేక్ ఒబెరాయ్‌) సిద్దంగా ఉన్నాడని రివీల్ అవుతుంది. అసలు బీహార్ సీఎంకు ఇక్కడకు రావాల్సిన పనేంటి..వచ్చి…రామ్ కొణెదల కుటుంబాన్ని కాపాడటం ఎందుకు..రామ్ కు రాజు భాయ్ కు మధ్య గొడవేంటి…తన కుటుంబాన్ని రామ్ ఎలా రక్షించుకున్నాడు వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాలి. 

ఎలా ఉంది

సినిమా పూర్తిగా రావణ కాష్టంలా యాక్షన్ ఎపిసోడ్స్ తో రగులుతూనే ఉంది. ఫస్టాఫ్ లో ముఖేష్ రుషి , అతని గ్యాంగ్ తో ఫైట్స్ …సెకండాఫ్ లో వివేక్ ఒబరాయ్ తో ఫైట్స్ తో నిండిపోయింది. మధ్య మధ్యలో కుటుంబ అనుబంధాలు, హీరోయిన్ తో సరాగాలు ఎపిసోడ్స్ వస్తాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నా అది యాక్షన్ ఎపిసోడ్స్ లో మరుగున పడిపోయింది. ముఖ్యంగా కథ,కథనం సరిగ్గా డవలప్ చేయకపోవటం అనే విషయం స్పష్టంగా అర్దమవుతుంది. రామ్ చరణ్ తో యాక్షన్ కథ చేయాలని, కొన్ని ఎపిసోడ్స్ అనుకుని…అల్లేసినట్లు అనిపిస్తుంది కానీ, హీరో…ఓ సమస్య రావటం దాన్ని పరిష్కరించటంలో అవరోధాలు…వంటివేమీ దృష్టిలో పెట్టుకోలేదు. అలాగే ఈ సినిమాలో సూపర్ హీరోయిజం కు అవకాసం ఇచ్చారు బోయపాటి. అలాగే ఎమోషన్స్ సైతం …చాలా కృత్రిమంగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ ..ఫరవాలేదనిపించుకున్నా..సెకండాఫ్ కు వచ్చేసరికి… విలన్ అతిగా కనిపిస్తాడు. అంతకు మించి హీరోయిజం ఎస్టాబ్లిష్ అవుతూంటుంది. క్లైమాక్స్ అయితే ..ఇక తేల్చేయాలి తప్పదు అన్నట్లు ఫైట్ సీక్వెన్స్ తో ముగుస్తుంది.

అలాగే ఈ సినిమాలో మరో విశేషం ఉంది.  దాదాపు  ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ ప‌ది, ప‌దిహేను మంది క‌న‌ప‌డేలా ప్లాన్ చేసారు. ప్యామిలీ సీన్స్ దీ అదే పరిస్దితి..యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మరింత ఎక్కువ మందితో సీన్స్ నిండిపోతాయి . అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు, ఇటు మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉండాల‌న్న‌ది బోయ‌పాటి తాపత్రయం వికటించినట్లే క‌నిపిస్తుంది.

ఇక రెగ్యులర్ బోయపాటి సినిమాల్లోలాగే  హీరోయిజం ఎలివేట్ చేసే స‌న్నివేశాలు పీక్స్ లో ఉంటాయి. యాక్ష‌న్ సీక్వెన్స్ ముందు వ‌చ్చే సీన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు.ఓవరాల్ గా  ఇంటర్వెల్ బ్లాక్ వరకూ బోయపాటి చేతిలోనే ఉంటుంది. కానీ ఆ తర్వాతే విధ్వంసం మొదలైపోతుంది.  ఎన్ని చెప్పుకున్నా  బోయ‌పాటి.. రామ్‌కు స‌రిపోయే క‌థ‌ను మాత్రం ఎంచుకోలేక‌పోయాడ‌ని అర్దమవుతుంది.

టెక్నికల్ గా ..

పాటల విషయానికి వస్తే.. రెండు పాటలు బాగున్నాయి. వాటికి రామ్ చరణ్ వేసే స్టెప్స్ కూడా బాగున్నాయి. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా బాగోలేదు. డైలాగులు …బోయపాటి స్టైల్లోనే  ప‌దునుగా సాగాయి. రామ్ కొ..ణి..దె..ల‌.. అంటూ చెప్పే డైలాగ్‌ మంచి రెస్పాన్స్ వచ్చింది.  సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఎడిటింగ్ ..సెకండాఫ్ లో మరీ దారుణంగా ఉంది. మొదటనుంచీ చెప్పుకుంటన్నట్లు ఇది సగం వండిన స్క్రిప్టే..పూర్తి అవుట్ లుక్ వచ్చేదాకా చూసుకోలేదు.

ఎవరు ఎలా చేసారు

రామ్ చరణ్ ఈ కథని ఎలా ఒప్పుకుని చేసాడనేది ప్రక్కన పెడితే .. ఈ సినిమాలో   రామ్ పాత్ర‌లో ఫెరఫెక్ట్ ఛాయిస్ అనిపిస్తాడు.   సిక్స్‌ప్యాక్ చేసి  మరీ రామ్ చరణ్ చేసిన యాక్ష‌న్ సీన్స్ ఫ్యాన్స్ కు నచ్చుతాయి.  ఇక హీరోయిన్ కియారా కు సినిమాలో పాటల్లో వచ్చి వెళ్లిపోయే పాత్ర..కాబట్టి మాట్లాడుకునేదేం లేదు. బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబరాయ్ విలన్ గా మంచి అవుట్ ఫుటే ఇచ్చాడు.

ఆఖరి మాట

ఈ సినిమా రామ్ చరణ్ అభిమానులకు, కథ లేకపోయినా కేవలం యాక్షన్ సీన్స్ ని చూస్తామనేవాళ్లకు బాగా నచ్చుతుంది. 

నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్‌ ఎ.విల్సన్‌

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు

నిర్మాత: డీవీవీ దానయ్య

దర్శకత్వం: బోయపాటి శ్రీను

సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌

విడుదల :11-01-2019