విరాట పర్వం మూవీ రివ్యూ

Published On: June 17, 2022   |   Posted By:

విరాట పర్వం మూవీ రివ్యూ

Virata Parvam:సాయి పల్లవి ‘విరాట పర్వం’ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji
👍🏻

రకరకాల కారణాలతో చాలా కాలం ఆగి ఆగి ఈ రోజు మన ముందుకు వచ్చింది ‘విరాట పర్వం’ . ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘భీమ్లానాయక్’ మూవీలో డేనియల్ శేఖర్‌గా నటించి ఆకట్టుకున్న రానా ఇందులో నక్సలైట్ రవన్న గా కనిపించాడు. ‘శ్యామ్‌ సింగరాయ్’ మూవీలో దేవదాసిగా నటించిన సాయిపల్లవి నక్సలైట్ వెన్నెలగా ఇప్పుడు జనం ముందుకు వచ్చింది. ‘నీదీ నాదీ ఓకే కథ’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విభిన్న కథా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల డైరెక్టర్ కావటంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే నక్సలైట్ నేపథ్యం , సాయి పల్లవి క్లైమాక్స్ లో చనిపోయిందన్న విషయం బయటకు రావడంతో,సినిమాకు హిట్ టాక్ వస్తే చూద్దామని కొందరు భావిస్తున్నారు. ఈ సిట్యువేషన్ లో రిలీజైన ఈ సినిమా ఏ మేరకు సగటు ప్రేక్షకులను ఆకట్టుకుంది..అసలు చిత్రం కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ

అవి నక్సలిజం బాగా ఉన్న 1990 రోజులు. నక్సల్స్ కు, పోలీసులకు మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న సమయం. ఆ సమయంలో టీనేజర్ గా ఉన్న వెన్నెల(సాయి పల్లవి) విప్లవ సాహిత్యం చదివి…అడవి దారి పట్టాలని నిర్ణయించుకుంది. కామ్రేడ్ రవన్న (రానా) …అరణ్య పేరుతో రాసిన కవితలు రాస్తూంటాడు. వాటిని చదివి ప్రభావితురాలవుతుంది వెన్నెల. చిన్నప్పటి నుంచి వెన్నలది కాస్త మొండితనం ఉన్న వ్యక్తిత్వం. తను అనుకున్నదే జరగాలి అనుకుంటుంది. ఆమెకు ఇంట్లో పెద్దలు పెళ్ళి సంబంధం చూస్తారు. దాన్ని కాదని, రవన్నను వెతుక్కుంటూ అడవి దారి పడుతుంది. తండ్రి(సాయిచంద్‌) ఒగ్గుకథలు చెబుతుండగా, అందులో మీరా భాయ్‌ కృష్ణుడి ప్రేమ కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పిన మాట విని తను కూడా రవన్న కోసం, తన ప్రేమ కోసం ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. ఇష్టం లేని పెళ్లిని ఎదురించి ప్రేమికుడి కోసం వెళ్లిపోతున్నట్టు లెటర్‌ రాసి వెళ్లిపోతుంది వెన్నెల. రవన్న కాంటాక్ట్ కోసం ఊరూరా తిరుగుతూ ఉద్యమ నాయకులను కలుస్తుంది.

ఆ క్రమంలో ఆమెకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ ఛేదించుకుని తన లక్ష్యం దిశగా సాగే ప్రయత్నం చేస్తుంది. చివరకు తన కలల నాయకుడు లాంటి కామ్రేడ్ రవన్నను కలుస్తుంది. అయితే రవన్నకు ప్రేమ అంటే సదభిప్రాయం లేదని అర్థమవుతుంది. దీంతో రవన్న ఆమెను తిరస్కరిస్తాడు. తల్లిదండ్రులను కాదని, రవన్న మీద ప్రేమతో ఇల్లు వదిలి అడవికి వచ్చిన వెన్నెల పరిస్థితి ఏమీ అర్థం కాని పరిస్థితి..అప్పుడు ఆమె ఏం నిర్ణయం తీసుకుంది.చివరకు వెన్నెల, రవన్నల ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది? ఈ పరిణామ క్రమంలో ఆమె జీవితంలో రాజకీయ నాయకులు , పోలీసులు ఎలాంటి ప్రభావం చూపించరనేదే విరాట పర్వం కథ.

విశ్లేషణ

ఖమ్మం జిల్లాకు చెందిన తూము సరళ జీవిత కథను తీసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. 1992లో ఇంటర్మీడియెట్ లో ఉండగా ఆమె విప్లవ సాహిత్యం చదివి, దళంలో చేరి సాయుధ పోరాటం చేయాలనుకుంది. అయితే దళంలో చేయడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. అయినా అక్కడా ఆమె కు కలిసి రాలేదు. అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. సరళను పోలీస్ ఇన్ఫార్మర్ గా అనుమానించి నక్సలైట్లు హింసించి, కాల్చి చంపేశారు. ఆమె శవాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందించలేదు. అయితే ఆ తర్వాత తాము పొరపాటు చేశామని, ఆమె వామపక్ష పార్టీల సానుభూతి పరులైన కుటుంబానికి చెందిన వ్యక్తి అని గ్రహించి బహిరంగ క్షమాపణ కోరారు. దీన్నే సినిమాగా తీయాలనుకున్నారు. ఇందులో డ్రామా డైరక్టర్ ని ఎట్రాక్ట్ చేసింది. కాకపోతే సినిమాగా కొంత సినిమాటెక్ లిబర్టీ తీసుకున్నారు. అది తప్పదు. అది మనకు ప్రారంభంలో వచ్చే సీన్స్ లోనే అర్దమవుతుంది. నక్సల్స్ కు, పోలీసులకు మధ్య పోరు సాగుతున్న సమయంలో హాస్పిటల్ కు వెళ్ళే దారిలో డాక్టరైన లేడీ నక్సలైట్ సాయంతో ఆడబిడ్డ జన్మించడం, ఆ నక్సలైటే ఆ బిడ్డకు వెన్నెల అనే పేరు పెట్టడం, అదే క్షణంలో పోలీస్ కాల్పుల్లో చనిపోవడం ఇలాంటివన్నీ తన క్రియేటివిటీతో రాసుకున్నవే. అయితే సినిమాలో ఆ తర్వాత అలాంటి ఇంటెన్స్ సంఘటన ఏదీ కనపడదు.

వాస్తవానికి ఈ జనరేషన్ కు నక్సలిజం కథలు కొత్తే. అయితే ప్రేమ కథ కాబట్టి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని భావించి ఉండవచ్చు. అయితే సినిమాలో అటు లవ్ స్టోరీ కానీ, ఇటు విప్లవం కానీ రెంటికి న్యాయం చేయలేకపోయారు. అలాగే వెన్నెల విషయంలో రవన్న పాత్ర ప్రవర్తించే తీరు కూడా కన్వీన్సింగ్ గా అనిపించదు. అలాగే నక్సలైట్స్ చేసిన అతి పెద్ద తప్పును చాలా చిన్న విషయంగా, మామూలు ఘటనగా దర్శకుడు తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అవేమీ వర్కవుట్ కాలేదు. థిన్ గా నడిచే స్టోరీ లైన్ సినిమాకు విస్తరణ అవకాశం ఇవ్వలేదు. అలాగే ఈ కథలో మొదటే చెప్పుకున్నట్లు పాయింట్‌లో ప్రేమ ఉంది, స్ట్రగుల్‌ ఉంది, ఎమోషన్‌ ఉంది. మంచి ఫీల్‌ ఉంది. కమర్షియాలిటీ కి తగ్గ అంశాలన్ని ఉన్నాయి. ఎంతో లిబర్టీ తీసుకుని కూడా సినిమాని తీయొచ్చు. కానీ దర్శకుడు వేణు ఊడుగుల వాటిని పట్టించుకోకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్‌. సినిమా ప్రారంభం నుంచి వెన్నెల.. రవన్నని కలవాలని, ఆయన్ని ప్రేమలోనే మునిగి తేలుతున్న అంశంపైనే ఫోకస్‌ పెట్టారు. బలమైన స్ట్రగుల్స్ వెన్నెల జీవితంలో లేకపోవడంతో ఆమె ప్రేమలో ఎమోషన్‌ కు మనం కనెక్ట్ కాము. సినిమా మొత్తం రవన్నని వెన్నెల కలిసేందుకు చేసే జర్నీ నే ఉంటుంది. మధ్య మధ్యలో పోలీసులకు, నకల్స్ కి మధ్య కాల్పులు వచ్చి పోతుంటాయి. తప్పితే ఎందులోనూ ఎమోషన్‌ ఉండదు. దీంతో ఆత్మ లేని శరీరంలా అనిపిస్తుంటుంది.

టెక్నికల్ గా …

డైరక్టర్ గా వేణు ఊడుగుల విరాట పర్వం ఓ ఆర్ట్ ఫిల్మ్ తీసినట్లు తీసే ప్రయత్నం చేసారు. కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా తెరకెక్కించాడు. అక్కడదాకా అతని నిబద్దతని మెచ్చుకోవాలి. అయితే స్క్రిప్ట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బోర్ కొట్టించాడు. ఒక అమ్మాయి ప్రేమను విప్లవం కంటే గొప్పగా చూపించాలనే ప్రయత్నం వికటించింది. ఒక ప్రేమకథను నక్సల్ బ్యాక్ డ్రాప్‌లో చెప్పడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు.. ఆ విషయంలో కొంతవరకూ సక్సెస్. ఇక మిగతా టెక్నిషియన్స్ లో దివాకర్ మణి, డాని షన్‌చాజ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. తెలంగాణ పల్లెలు, అడవులను తన కెమెరాలో అందంగా చూపించటం నచ్చుతుంది. సురేష్ బొబ్బలి ఈ సినిమాకు ఇచ్చిన పాటల సంగతి ఎలా ఉన్నా.. ఆర్ ఆర్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

డైలాగులు కొన్ని బాగున్నాయి. ‘మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’అని రాహుల్‌ రామకృష్ణతో చెప్పించిన డైలాగులుకు మంచి స్పందన వస్తోంది . ‘మీరాభాయి కృష్ణుడు కోసం క‌న్న‌వాళ్ల‌ను, క‌ట్టుకున్న‌వాళ్ల‌ను వ‌దిలేసి ఎలా వెళ్లిపోయిందో! అలానే నేను నీకోసం వ‌స్తున్నాను’ అంటూ చేసిన పోలిక బాగుంది. ‘చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు’ లాంటి కవిత్వం లాంటి డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి.

నటీనటుల్లో …

సాయి పల్లవి సినిమాకు ప్లస్ మైనస్ కూడా. ఆమె లేకపోతే ఆ పాత్ర ఎవరూ చేయలేరనిపిస్తుంది. అలాగే ఆమె ఉండటం వల్ల ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగి..అవి రీచ్ కాలేదనిపిస్తుంది. యాక్షన్‌ సీన్స్‌లో సాయిపల్లవి మరో యాంగిల్ కనిపించింది. కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడనే చెప్పాలి. ఇక దళ సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్‌ చంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు. వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్‌, ఈశ్వరీరావు మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. రాహుల్‌ రామకృష్ణ, నివేదిత పేతురాజ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

ప్లస్ లు

రానా, సాయి పల్లవిల నటన

సంగీతం

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ లు

డాక్యుమెంటరీ నేరేషన్

కమర్షియల్ అంశాలకు ప్రయారిటీ ఇవ్వకపోవటం.

చూడచ్చా

సాయి పల్లవి సినిమాగా నమ్మి వెళితే విరాట పర్వం విసుగు తెప్పిస్తుంది. అయితే ఉద్యమం పట్ల సానుభూతి ఉంటే.. నిజాయితీతో చేసిన ప్రయత్నంగా పరిగణించాలనిపిస్తుంది. అంతకు మించి ఆశించటం కష్టమే.

ఎవరెవరు…

నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్‌, జరీనా వాహబ్‌, ఈశ్వరీరావు, నవీన్‌ చంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు
దర్శకత్వం : వేణు ఊడుగుల
సంగీతం : సురేశ్‌ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్‌ లోపెజ్‌
ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌
రన్ టైమ్: 2 Hr 31 Mins
విడుదల తేది : జూన్‌ 17, 2022