శాకుంతలం మూవీ రివ్యూ

Published On: April 14, 2023   |   Posted By:

శాకుంతలం మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

శకుంతల కథ మన చిన్న నాటి నుంచీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా సినిమాలు, సీరియళ్ళు, కార్టూన్ పుస్తకాలు ఈ కథ ఆధారంగా తీస్తూనే ఉన్నారు. మహాభారతంలో ఉన్న దుష్యంత శకుంతల ప్రస్తావన కన్నా కాళిదాసు నాటకం రాయడం వల్లనే, అందులో తప్పొప్పుల, నైతికానైతిక ద్వంద్వాలని తీసేసి అంతా విధి యాడు వింత నాటకమ్ము అని కథని కవి తిరిగి ఊహించుకోవటం లేదా రీ ఇమైజేన్ చేసుకోవడం వల్లనే అనీ చెప్తుంటారు. ఇంతకీ ఈ సంస్కృత డ్రామా సినిమాగా ఎంతవరకు మనలని ఆకట్టుకుందో చూద్దాం.

స్టోరీ లైన్ :

రాజర్షి, మహా కోపిష్టి అయిన విశ్వామిత్రుని తపస్సుని భగ్నం చేయడానికి మేనక (మధుబాల)ను దేవేంద్రుడు భూలోకానికి పంపిస్తాడు. అప్పుడు మేనక తన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో విశ్వామిత్రుడితో శారీరకంగా ఒక్కటై బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత తను వచ్చిన పని పూర్తవటంతో ఆ బిడ్డను భూమి మీదే వదిలేసి స్వర్గానికి వెళ్లిపోతుంది. ఆ బిడ్డను చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు కణ్వ మహర్షి (సచిన్ ఖేద్కర్). ఆ చిన్నారే శకుంతల (సమంత). కణ్వ మహర్షి ఆశ్రమంలో అల్లారు ముద్దుగా పెరిగి పెద్దయిన శకుంతల ఇక యుక్త వయసు వచ్చాక తన ఆశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు (దేవ్ మోహన్)తో ప్రేమలో పడి అతణ్ని గాంధర్వ వివాహం చేసుకుంటుంది. తాను రాజ్యానికి వెళ్లి తిరిగి తనను రాజ లాంఛనాలతో తీసుకెళ్తానని చెప్పి వెళ్తాడు దుష్యంతుడు. కొంతకాలం అక్కడ ఉండి ఇక తన రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైందని దుష్యంతుడు, శాంకుతలకు తన గుర్తుగా ఉంగరాన్ని ఆమె వేలికి తొడుగుతాడు. కానీ అతను ఎంతకీ తిరిగిరాడు. ఈ లోపు శకుంతల గర్భవతి అవుతుంది. అలా వెళ్ళిన దుష్యంతుడు రాక్షసులకు శత్రువు. పగతో రగిలిపోయిన రాక్షసులు దుష్యంతునికి పుట్టబోయే బిడ్డను నాశనం చేయాలని చూస్తారు.

ఇక తిరిగివచ్చిన కణ్వ మహర్షి శాకుంతల గురించి విషయం తెలుసుకుని దుష్యంతుని రాజ్యానికి పంపిస్తాడు. కానీ అక్కడ నిండు సభలో ఆమె ఎవరో తనకు తెలీదని చెప్పడంతో శాకుంతల కులట అంటూ అందరూ రాళ్ళతో తరిమి కొడతాడు. దుష్యంతుడు ఇచ్చిన ఉంగం ఆమె చూపించాలని చూస్తే చేతికి ఉంగరం వుండదు. అది ఏమయింది? ప్రజలు తరిమికొట్టిన శాకుంతల ఎక్కడికి వెళ్ళింది? ఆ తర్వాత కథ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.

ఎలా ఉంది :

కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి . అభిజ్ఞాన శాకుంతలం నాటకం తో విశ్వ వ్యాప్త కీర్తి నార్జించిన వాడు .ఉపమా కాళిదాసస్య అనే టాగ్ ఉన్న కవి . అంత గొప్ప రచనని.వినీ వినీ ఉన్న కథని కాళిదాసు సృష్టించిన పాత్రలను సినిమా ఆర్టిస్ట్ లలో చూస్తూవారి నోట వెంట ఆ డైలాగులు వినడం మహానుభూతి. అయితే ఆ రసానుభూతి పూర్తిగా దక్కనివ్వలేదు గుణశేఖర్. తనకు సాధ్యంకాని,మోయలేని భారాన్ని భుజాన్న ఎత్తుకుని క్రిందకు పడేసాడనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో డ్రామా ఉన్న ఈ కథను పెద్ద రామారావు టైంలోనే అప్పట్లో అప్పటి భాషకు అనుగుణంగా తీశారు. ఆ తర్వాత తమిళంలోనూ వచ్చింది. కానీ ఎక్కడా వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్లకి గుణశేఖర్‌ తీశారు. 3డి ఫార్మెట్‌లో వదిలాడు. కానీ సినిమాకు సరపడ కథగా ఈ నాటకాన్ని మలచలేకపోయారు. ఆసక్తికరమైన మలుపుతో ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీలయ్యే అంశాలతో ఆకట్టుకోవడం రాజమౌళిలా చేయలేకపోయాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న తరహాలో బాహుబలిని చూసి ఈ సినిమా ప్రయత్నించినట్లు అయ్యింది. పాతకాలం కథ కాబట్టి నింపాదిగా కథనం నడపటం ఇబ్బందిగానే అనిపిస్తుంది. శాకుంతలం సినిమా మొత్తంలో వావ్ ఫీలింగ్ కలిగించే ఒక్క ఎపిసోడ్ సన్నివేశం కూడా సినిమాలో లేదు

టెక్నికల్ గా :

ఇలాంటి సినిమాని మన ముందు ఉంచటానికి   ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్, త్రీడీ వర్క్ అసలు బాలేదు. సన్నివేశాల్లో అసలు బలం లేదు. కథలో బలమైన కాంప్లిక్ట్ లేదు. ఏదో డైలీ4 సీరియల్ సాగినట్లు సన్నివేశాలు సాగాయి. ఈ సినిమాకు అనవసరమైన యుద్ధ సన్నివేశాలు సైతం పేలవంగా సాగాయి. రీరికార్డింగ్, సాంగ్స్ ,ఎడిటింగ్ ఒకటేమిటి అన్నీ తేలిపోయాయి. ఏదీ నిలబడలేదు. సినిమాటోగ్రఫీ సైతం చాలా చోట్ల తడబడింది. ప్రొడక్షన్ వాల్యూస్ మరింత రిచ్ గా ఉండాలి.

నటీనటుల్లో :

సమంత పూర్తిగా శకుంతల పాత్రలో ఫెయిలైందనే చెప్పాలి. ఆమె సూట్ కాలేదు. ఇక దేవ్ మోహన్ దుష్యంతుడుగా బాగున్నాడని కానీతెలిసున్న ఫేస్ అయితే ఇంకా బాగుండేది. మోహన్ బాబు నిజ జీవిత పాత్రనే తెరపై చూసినట్లుంది కోపం కంఠభూషణం అన్నట్లు సాగిపోయింది. అల్లు అర్హ మాత్రం ఫెరఫెక్ట్

చూడచ్చా :

శకుంతల కథ తెలుసుకోవటానికి అయితే ఈ సినిమాకు వెళ్లచ్చు. అంతకు మించి ఆశించటం వృధా

నటీనటులు :

సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అదితి బాలన్‌, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, గౌతమి, అల్లు అర్హ

సాంకేతికవర్గం :

సంగీతం: మణిశర్మ;
సినిమాటోగ్రఫీ: శేఖర్‌ వి.జోసెఫ్‌;
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి;
సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా
నిర్మాణ సంస్థ: గుణ టీమ్‌వర్క్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌
స్క్రీన్‌ప్లే దర్శకత్వం: గుణశేఖర్‌;
రన్ టైమ్ : 142 మినిట్స్
విడుదల: 14-04-2023