శేఖర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో, లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. గురువారం (ఫిబ్రవరి 4న) రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ “ప్రియాతి ప్రియమైన, నన్ను ప్రేమించే నా వాళ్లందరికీ, నేను ప్రేమించే నా అభిమానులకు అతి భయంకరమైన కొవిడ్-19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకువెళ్లినా మీ ప్రేమాభిమానాలు, నిరంతర ప్రార్ధనలు నన్ను మళ్లీ, ఈ నా పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే స్థితికి తీసుకు వచ్చాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్లైన మీకు, సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను” అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ “రాజశేఖర్ గారి 91వ చిత్రమిది. పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లుక్ కి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.
ఈ చిత్రానికి కళ: దత్తాత్రేయ, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లలిత్.