శ్రీకారం మూవీ రివ్యూ

Published On: March 12, 2021   |   Posted By:
శ్రీకారం మూవీ రివ్యూ
 
వ్యవసాయంపై మమకారం: ‘శ్రీకారం’ మూవీ రివ్యూ

రేటింగ్: 2.5/5

ఎంతోమంది ఎన్నో పై చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొంటారు. కానీ ఎంత ఎత్తుకెళ్లినా తినాల్సింది మాత్రం అన్నదాత పండించిన పంటలనే కదా.. రైతు లేకుండా ప్రపంచం మనుగడ సాగించలేదు. ఏ దేశానికైనా రైతే వెన్నెముక. ఎంత డబ్బు సంపాదించాం అనేది ముఖ్యం కాదు.. ఏం చేసి సంపాదించాం అనేది చాలా ముఖ్యం. భవిష్యత్‌ తరాలకు మనం ఉపయోగపడాలంటే ముఖ్యంగా రైతు బాగుండాలి. ఆ రైతులు తమ పంటోత్పత్తులపై లాభాలను ఆర్జించిననాడే ప్రజలు బతికి బట్టకడతారు. ఈ విషయాలన్ని అందరికీ తెలిసినవే. కానీ ఇలా తెలిసిన విషయాలను తెరమీదకు ఎక్కించి  కమర్షిల్ సినిమా తియ్యాలంటే మాత్రం ఎంత కష్టం. ఈ వారం రిలీజైన శ్రీకారం అలాంటి ప్రయత్నమే. ఈ సినిమా కథేంటి…జనాలకు నచ్చే సినిమాయేమో….వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

అనంతపురంలో నీటి సమస్య చాలా మంది రైతులను ..కూలీలను చేసేసింది. సిటీలకు తోలేసింది. అప్పులు పాల్జేసింది. తమ సొంత పొలాలను అయిన కాడికి అమ్ముకునేలా చేసి ఊరి విడిచి పొమ్మంది. అయితే అందరిలా అతను చేస్తే అతను హీరో ఎందుకు అవుతాడు. కసితో కష్టపడ్డాడు. రైతు బిడ్డగా పుట్టి సాప్ట్ వేర్ ఇంజినీర్ గా సిటీలో తేలాడు. నాన్న అప్పులు తీర్చాడు. అందరూ ఆనందపడ్డారు. రేపో మాపో అమెరికా వెళ్తాడనుకున్నారు. కానీ అనుకోని నిర్ణయం తీసుకున్నాడు. తన ఊళ్లో ఉంటానన్నాడు కార్తీక్ (శర్వానంద్). అతని తండ్రి కేశవులు (రావు రమేష్) చాలా చెప్పి చూసాడు. కానీ వింటేగా సొంతూరికి తిరిగి వచ్చేసాడు.

ఉన్నత చదువులు చదివినా.. తనను అంత చదువు చదివించిన మట్టి వాసన మరచిపోలేదు. ఆ మట్టినుంచి బంగారాన్ని సృష్టించి.. వందలాది రైతు కుటుంబాలను కష్టాల నుంచి బయటకు తీసుకొనిరావాలి. ప్రతి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం చూడాలి. అందుకోసం తనదైన శైలిలో పోరాటం ప్రారంభించాడు.  తన తండ్రి నేర్పిన వ్యవసాయాన్ని నమ్ముకుని పదిమందికి అదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం అనేక మాటలు పడ్డాడు. ఇబ్బందులు ఎదిరించాడు. అలాంటి ఓ యువరైతు ప్రస్తానమే ఈ శ్రీకారం.

స్క్రీన్ ప్లే సంగతులు…

రైతులు మీద సినిమా తీయటం అంటే కత్తిమీద సామే. కొత్తగా చెప్పేదేముంది. ఈ దేశంలో రైతు గురించి, అతను చేస్తున్న నిత్య పోరాటం గురించి అందరికీ తెలుసు. అయితే రైతే రాజుని చెప్పే మనం అతనికి సముచిత స్దానం ఇవ్వము. చివరకు అతనికు పిల్లను కూడా ఇవ్వము. మట్టి పిసుక్కునేవాడు అని ప్రక్కన పెట్టేస్తాము. ఆ రైతుని హీరోగా చేసే స్దాయిని తెలుగు సినిమా దాటేసింది. ఏదో ఆ మధ్యన మహర్షి వచ్చింది. మళ్లీ ఇప్పుడు శ్రీకారం అన్నారు.

ఈ క్రమంలో చెప్పే కథ కొత్తగా ఉండాలి. ఇన్నోవేటివ్ గా ఉండాలి. మన ఆలోచనలు కుదపాలి. రైతుపై అభిమానం కలగాలి. ఇవన్ని ఉండే సీన్స్ కావాలి. వాటికి తగ్గ స్క్రీన్ ప్లే సెట్ కావాలి. అందుకోసం టీమ్ అయితే కష్టపడ్డారు. కానీ కొన్ని సీన్స్ తేలిపోయాయి. కొన్ని డాక్యుమెంటరీ లుక్ తెచ్చుకున్నాయి. మరికొన్ని మెసేజ్ లు మయం అయ్యిపోయాయి.

అయితేనేం ఓ మంచి సినిమా అనే ముద్రను మాత్రం తప్పించుకోలేకపోయాయి. స్క్రీన్ ప్లేలో మట్టివాసనలు కోసం ప్రయత్నం చేసారు కానీ … రైతు నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు రావడంతో ఈ సినిమా తెలిసిన కథే కదా.. అన్న భావన ప్రేక్షకుల్లో ఏర్పడింది. అలాగే.. సినిమాలో కొన్ని సన్నివేశాలు మరీ స్లో గా సాగడంతో.. సాగదీతగా అనిపించింది.
 
టెక్నికల్ గా
 
ఈ సినిమా కు స్పెషల్ ఎట్రాక్షన్, ఎస్సెట్  సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అని చెప్పవచ్చు. రైతు గొప్పతనాన్ని వివరిస్తూ సాయి మాధవ్‌ రాసిన డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుంటున్నాయి. అలాగే కెమెరా వర్క్  బాగుంది.మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జే మేయర్.. సంక్రాంతి పాట, టైటిల్ సాంగ్ బాగున్నాయి. వచ్చానంటివే పాట జస్ట్ ఓకే. మెలోడీలు మాత్రం మిస్సయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓవర్ అయ్యింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బ్యానర్ కు తగ్గట్లే ఉన్నాయి.  నటీనటుల్లో .. సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో శర్వానంద్‌ ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్‌ ప్రియాంకా అరుళ్‌ కూడా చైత్ర పాత్రలో ఓకే అనిపించుకుంది. ఎమోషనల్‌ సీన్స్ లో హీరో తండ్రిగా నటించిన రావు రమేశ్‌ కంటతడి పెట్టించాడు. విలన్ గా సాయికుమార్‌ మంచి నటనను కనబరిచాడు.  ఇక  నరేశ్‌, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఆమని, రావు రమేష్,సాయి కుమార్ తమదైన శైలిలో గుర్తుండిపోయేలా చేసారు.

చూడచ్చా…

వీకెండ్ ఓ లుక్కేయానికి మంచి ఆప్షన్


తెర వెనుక….ముందు

నిర్మాణ సంస్థ : 14 రీల్స్‌ ప్లస్‌
నటీనటులు :  శర్వానంద్, ప్రియాంకా అరుళ్‌ మోహన్, సాయికుమార్‌, మురళీ శర్మ, రావు రమేశ్‌ తదిరులు
సంగీతం : మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ : జే యువరాజ్‌
ఎడిటింగ్‌ : మార్తండ్‌ కె వెంకటేశ్‌
నిర్మాతలు : రామ్‌ ఆచంట, గోపీ ఆచంట
దర్శకత్వం : బి.కిశోర్‌
రన్ టైమ్ : 2 గంటల 12 నిమిషాలు
విడుదల తేది : మార్చి 11, 2021