Reading Time: 3 mins

సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఇంటర్వ్యూ

అహింస, జయం లాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది: సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ అహింస తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అందించిన అహింస పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా అలరిస్తున్నాయి. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

చాలా విరామం తీసుకున్నారు ఈ విరామంలో ఏం చేశారు ? అహింస ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ?
సినిమా వున్నా లేకపోయినా రోజుకి 18 గంటలు పని చేస్తాను. కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే దర్శకత్వంకు సంబధించిన కొన్ని కథలు రాస్తున్నాను. ఐతే నాకు మ్యూజిక్ ఎక్కువ పేరు తీసుకొచ్చింది. కానీ ఒక సందర్భంలో మానేశాను. ఐతే బాలు గారు నేను ఎక్కడ కనిపించినా మళ్ళీ సంగీతం ఎప్పుడు మొదలు పెడుతున్నావ్ అని అడిగేవారు. అడిగిన ప్రతిసారీ చేస్తాను గురువు గారు అని చెప్పేవాడిని. సమస్య ఏమిటంటే నాకు కథ నచ్చితేనే చేస్తాను. మధ్యలో చాలా వచ్చాయి. కానీ చేయాలనిపించలేదు. బాలు గారు వెళ్లిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చలేక పోయాననే గిల్ట్ ఎక్కువైపోయింది. బాలు గారు నాకు స్ఫూర్తి. ఆయన పాటపై వున్న అభిమానంతో పరిశ్రమలోకి వచ్చాను. ఆయనకి ఇచ్చిన మాట తీర్చలేక పోయాననే బాధ ఎక్కువైంది. ఈ క్రమంలో ఒకసారి తేజ గారిని కలవడం జరిగింది. మళ్ళీ మ్యూజిక్ చేయాలి. అది బాలు గారి కోరిక అని తేజ గారికి చెప్పాను. కొన్ని రోజుల తర్వాత తేజ గారు ఫోన్ చేసి సినిమా చేస్తున్నాం అని చెప్పారు. అదే అహింస.

సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడుఈ మూడింటిలో ఏది ఎక్కువ తృప్తిని ఇచ్చింది ?
నేను నమ్మిందే చేస్తాను. నేను నమ్మిందే చేశాను కాబట్టి ప్రతిది నాకు ఇష్టమే.

అహింస ట్రైలర్ చూస్తుంటే తేజ గారు జయం, నువ్వు నేను సినిమాలు గుర్తుకు వచ్చాయి. ఇందులో మ్యూజిక్ కి ఎంత స్కోప్ వుంది ?
అహింస కథ చాలా కొత్తది, నేపధ్య సంగీతం చేసేటప్పుడు చూశాను. చాలా కొత్తగా వుంటుంది. కథ కొత్తగా ఉన్నప్పుడు సంగీతం కూడా సహజంగానే కొత్తగా వినిపిస్తుంది.

ఇప్పుడు ట్రెండ్ మారింది కదా మీకు ఎలా అనిపిస్తుంది ?
నేను ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వలేదండీ. సినిమాకి ఏం కావాలో దానిపై దృష్టి పెట్టాను. ట్రెండ్ అనేది ప్రత్యేకంగా వుండదని నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఇచ్చేది జనాలకు నచ్చితే అదే ట్రెండ్.

అహింస పాటలకు మంచి రెస్పాన్స్ రావడం ఎలా అనిపిస్తుంది?
అహింస పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా రావాలి. రిలీజ్ తర్వాత అది ఇంకా పెరుగుతుందని భావిస్తున్నాను. జయం సినిమాలో ప్రియతమా పాట సినిమా విడుదల తర్వాత మరో స్థాయికి వెళ్ళింది. అహింస కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను. తేజ గారు, నా కాంబోలో ఏ రేంజ్ మ్యూజిక్ ఇవ్వాలో ఆ రేంజ్ మ్యూజిక్ చేశాం.

మీ జడ్జ్ మెంట్ ఎలా వుంటుంది ?
నా జడ్జ్ మెంట్ కాస్త డిఫరెంట్ గా గానే వుంటుంది. ఒక పాట చేస్తున్నపుడు థియేటర్ నుంచి ఎంతమంది లేచి వెళ్ళిపోతున్నారో ఊహిస్తాను. ఇంతమంది లేచివెళ్లిపోతున్నారని నా ఊహకు అనిపిస్తే ఎంత గొప్ప ట్యూన్ అయినా పక్కన పెట్టేస్తాను. నాకు టైం లెస్ మ్యూజిక్ చేయాలనే తపన వుంటుంది.

అహింస కథ ఏమిటి ?
అహింస సిద్ధాంతం నమ్మే ఓ అబ్బాయికి పరిస్థితులు ఎలా కృష్ణతత్త్వం వైపు లాగాయనేది కథ.

మీరు నటులు, దర్శకులు కూడా అభిరామ్ కు ఏమైనా టిప్స్ ఇచ్చారా ?
అభిరామ్ బెటర్ హ్యాండ్స్ లో వున్నారు. తేజ గారు లెజండ్. కొత్తవాళ్ళతో ఎలా నటింప చేయాలో ఆయనకి తెలిసినంతగా ఇండస్ట్రీలో ఎవరికీ తెలీదు. ఆయన కన్నా గొప్పగా చెప్పే వాళ్ళు ఎవరూ లేరని నా ఫీలింగ్.

కమ్ బ్యాక్ వచ్చారు భవిష్యత్ ని ఎలా ప్లాన్ చేస్తున్నారు ? నటన కొనసాగిస్తారా ?
మ్యూజిక్ చేస్తాను. ఐతే మరీ చిన్న సినిమాలు చేయను. మ్యూజిక్ ఖర్చు పెరిగింది. సింగర్స్, కీబోర్డ్ ప్లేయర్స్ ఇలా అందరి రెమ్యునిరేషన్ పెరిగాయి. నటన విషయానికి వస్తే చాలా మంది దర్శకులు సంప్రదిస్తున్నారు. ఐతే నేను ఇంకా మెంటల్ గా ప్రిపేర్ కాలేదు. ఒక మంచి వెబ్ సిరీస్ వస్తే చేయాలని వుంది.

మళ్ళీ దర్శకత్వం ఎప్పుడు ?
నా దర్శకత్వంలో నెక్స్ట్ ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఎలక్షన్ మీద ఒక కథ వుంది. నిర్మాత దొరికితే ఎలక్షన్ సినారియో మారిపోతుంది. బ్రోకర్ అందులో ఒక శాతమే. అలాగే వెబ్ సిరీస్ కోసం కూడా ఓ రెండు కథలు రాశాను.

సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడు, గాయకుడు ఇందులో ఏది మీ బలం ?
నేను ఏం చేసినా  ముందు సంగీత దర్శకుడిగానే గుర్తిస్తారు. నా ఐడెంటిఫికేషన్ మ్యూజిక్ డైరెక్టర్. ఐతే నాకు రాయడం చాలా ఇష్టం. ఒకొక్క రోజు భోజనం చేయకుండా ఏకంగా 70 పేజీలు రాసిన సందర్భాలు వున్నాయి.

అహింస మ్యూజిక్ సిట్టింగ్స్ మధ్య ప్రదేశ్ లో చేయడానికి కారణం ?
ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. లొకేషన్ రెక్కీకి వెళ్లాం. ఇందులో చాలా ఒరిజినల్ లొకేషన్స్ వున్నాయి. ఇందులో ఉండే లొకేషన్స్ మీరు ఎక్కడా చూసి వుండరు. చాలా కొత్తగా ఉంటాయి. విజువల్ కి అరెస్ట్ అయిపోతారు. అంత గొప్పగా ఉంటాయి.

ఆల్ ది బెస్ట్
థాంక్స్