సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ

Published On: January 11, 2020   |   Posted By:

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ

సరే..కాదన్నది ఎవరు? (‘సరిలేరు నీకెవ్వరు’ రివ్యూ)
 
Rating:3/5

`దూకుడు` ,`ఖలేజా` లతో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ బయిటకు వచ్చింది. అయితే ఎందుకనో ఆయన ఆ తర్వాత ఆ జానర్ ని ప్రక్కన పెట్టి సీరియస్ డ్రామాల వైపు ప్రయాణం పెట్టుకున్నారు. వరసపెట్టి మెసేజ్ లు ఇచ్చేస్తూండంతో తనకే విసుగొచ్చి మళ్లీ మాస్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చారు. శ్రీనువైట్లకు మరో వెర్షన్ లా కనిపించే అనీల్ రావిపాటితో రచ్చ చేయాలని ఈ సినిమా చేసారు. ఇందులో కామెడీ తో పాటు, యాక్షన్ ని సమపాళ్లలో రంగరించారమని అన్నారు. ఏ మేరకు ఈ విషయంలో అనీల్ రావిపూడి సక్సెస్ అయ్యారు…మహేష్ తో మళ్లీ  కామెడీ చేయించిన ఈ చిత్రం కథేంటి, చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విజయ శాంతి పాత్ర ఏమిటి, సినిమా ఏ మేరకు అభిమానుల అంచనాలు రీచ్ అయ్యింది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

కర్నూల్ మెడికల్ కాలేజీలో పని చేసే ప్రొఫెసర్ భార‌తి( విజ‌య‌శాంతి) దేశ‌భ‌క్తి ఎక్కువ‌. దేశం కోసం త‌న ఇద్ద‌రు కొడుకులను సైన్యంలోకి పంపిస్తుంది. ఆ క్రమంలో ఒక కొడుకు సైన్యం చేసిన ఓ ఆప‌రేష‌న్‌లో చ‌నిపోతే మ‌రో కొడుకు (స‌త్య‌దేవ్‌) వేరే ఆపరేషన్ లో తీవ్రమైన గాయాలు అయ్యి…కోమాలోకి వెళ్తాడు. ఈ వార్త పర్శనల్ గా  చెప్పాల‌ని, తన కొలీగ్ కుటుంబానికి అండ‌గా వుండాల‌ని ఆర్మీ ఆఫీస‌ర్ అజ‌య్‌కృష్ణ క‌ర్నూలుకు వ‌స్తాడు. అయితే అక్కడ అత‌నికి భార‌తి కుటుంబం క‌నిపించ‌దు. ఆమె ఎక్క‌డ వుందో తెలియ‌దు. ఆ క్రమంలో ఎంక్వైరీ చేసిన అజయ్ కృష్ణకు కొన్ని విషయాలు తెలుస్తాయి. భార‌తి కుటుంబం క‌నిపించ‌కుండా పోవ‌డానికి స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర‌ (ప్రకాష్ రాజ్ ) కారణం అని తెలుస్తుంది. ఒక హత్య కేసు కోసం భారతి పోరాటం చేయడం, ఆమె కుటుంబంపై నాగేంద్ర ప్రసాద్‌ కక్ష సాధిస్తున్నాడని అర్దం అవుతుంది. దాంతో  భార‌తి కుటుంబం కోసం అజ‌య్‌కృష్ణ  రంగంలోకి దిగి నాగేంద్రకు ఎదురు నిలబడతాడు. ఈ క్రమంలో అజయ్ కృష్ణకు ఎదురైన స‌మ‌స్య‌లేంటీ? అసలు నాగేంద్రకు వ్యతిరేకంగా భారతి పోరాడుతున్న హత్య కేసు ఏమిటి? స‌ంస్కృతి (ర‌ష్మిక‌), అజ‌య్‌ల మ‌ధ్య ప‌రిచ‌యం అయ్యిన ట్రైన్ ఎపిసోడ్ విశేషం ఏమిటి..వారి ప్రేమ కథ ఎక్కడికి దారి తీసింది?. వంటి విషయాలు తెలుసుకోవాలంటే  సినిమా చూడాల్సిందే.

కథ,కథనం ఎనాలసిస్

స్టార్స్ తో సినిమా చేయటం అనేది ఎప్పుడూ కత్తిమీద సామే. ఎక్సపెక్టేషన్స్ వాటితో పాటు లిమిటేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దాంతో రిస్క్ చేయటమెందుకు అని దర్శకులు..స్టార్ ఇమేజ్ ని బేస్ చేసుకుని , హీరోయిజం ఎలివేట్ అయ్యేలా సీన్స్ రాసుకుని, దాని చుట్టూ కథ అల్లుతారు. అందుకు కమర్షియల్ ఫార్మెట్ స్క్రీన్ ప్లే సాయిం తీసుకుంటారు. ఇదే అనీల్ రావిపూడి ఈ సినిమాకు సైతం చేసాడు. తనకు బాగా తెలిసిన కామెడీ ట్రీట్మెంట్ ని ఈ సినిమాకు అప్లై చేసాడు. అదే సమయంలో మహేష్ ని మాస్ గానూ చూపించి విజిల్స్ వేయించాడు. అంతవరకూ బాగానే ఉంది..అయితే స్క్రిప్టు దగ్గరకు వచ్చేసరికే తన ప్రతీ సినిమా లాగే …లైట్ తీసుకున్నాడు. వరస సీన్స్ పండుతున్నాయా లేదా అనేదానికే ప్రయారిటీ ఇచ్చుకున్నాడు. అయితే అదీ ఒక్కోసారి బెడిసికొడుతుంది. ఉదాహరణకి ఎంతో హైప్ చేసిన ట్రైన్ ఎపిసోడ్…కథకు సంభందం లేకుండా సాగటంతో కాసేపటికి విసుగెత్తించింది. దాన్ని ట్రిమ్ చేస్తే బాగుండును అనిపించింది.

ఇక ఫస్టాఫ్ ని నీట్ గా డిజైన్ చేసి ఇంటర్వెల్ దగ్గర ఫెరఫెక్ట్ యాక్షన్ బ్లాక్ తో  ఉవ్వెత్తున లేపాడు. అయితే సెకండాఫ్ లో ఆ ప్లో ని మెయింటైన్ చేయలేకపోయాడు. విలన్ కు, హీరోకు మధ్య కాంప్లిక్ట్ లేకపోవటంతో వచ్చిన సమస్య ఇది. అయితే మైండ్ బ్లాక్ సాంగ్ ..దాన్నుంచి బయిటపడేస్తుంది.  ఆ తర్వాత విజయ శాంతితో వచ్చే ఎమోషన్ సీన్స్ కథలోకి మళ్లీ మనని నెడతాయి. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్, టైటిల్ సాంగ్,రష్మిక ఫన్ సినిమాపై మళ్లీ నమ్మకాన్ని కలిగిస్తాయి. ఈ లోగా క్లైమాక్స్ వచ్చి మళ్లీ నీరసపరుస్తుంది.  మహేష్ కామెడీ టైమింగ్ ను దగ్గర నుంచి చూసిన అనుభవంతోనేమో కానీ…ఫెరఫెక్ట్ పంచ్ లతో చెలరేగిపోయాడు.  కాకపోతే ఈ ఫార్మెట్ కథలతో ప్రెడక్టబులిటీ వస్తుందనే విషయం మర్చిపోయాడు. కథ మీద కాన్సర్టేట్ చేస్తే తను అనుకున్న ఎపిసోడ్స్ పెట్టడానికి స్కోప్  ఉండదనుకున్నాడేమో లైట్ తీసుకున్నాడు. అదే సినిమాకు ఇబ్బందిగా మారింది.

టెక్నికల్ గా ..

మహేష్ బాబు వంటి హీరోల సినిమాలకు హై ఎండ్ టెక్నీషియన్స్ పనిచేస్తారు. దాంతో క్వాలిటీ దానంతట అదే వచ్చేస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది.  ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్ నెస్ కనిపిస్తుంది. అందుకు కారణం రత్నవేలు సినిమాటోగ్రఫీ. ఎడిటింగ్ విషయంలోనే దర్శకుడు ఉదాశీనత వహించాడనిపిస్తుంది.  సెకండాఫ్ ని  ఇంకాస్త షార్ప్‌ చేసి ఉంటే బాగుండేది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం లో మూడు పాటలు బాగున్నాయి. పార్టీ సాంగ్‌  ‘డాంగ్‌ డాంగ్‌’, ‘హీ ఈజ్‌ సో క్యూట్‌’, ‘సూర్యుడివో.. చంద్రుడివో’ పాటల చిత్రీకరణ కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్  సినిమాకు హైలైట్‌.

నటీనటుల్లో రష్మిక కు చెప్పుకునేటంత పెద్ద పాత్ర కాదు. అయితే  ‘అర్థమవుతుందా..’ అంటూ చెప్పే డైలాగులు ఫన్నీగా ఉంది.   ప్రొఫెసర్‌ భారతిగా విజయశాంతి ఒక పవర్‌ఫుల్‌ పాత్రలో జీవించారు. గ్యాప్ తర్వాత చేసినా ఆమెలో ఎక్కడా ఆ తేడా కనపడలేదు.  మహేష్ తో సీన్స్, ప్రకాష్‌రాజ్‌కు ఛాలెంజ్ వదలే సీన్స్ లో దుమ్ము రేపింది.

చూడచ్చా…

మహేష్ ఫ్యాన్సే  కాదు…రెగ్యులర్ సినీ గోయిర్స్ కూడా ఎంజాయ్ చేయచ్చు

తెర వెనక..ముందు

నటీనటులు: మహేశ్‌బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్‌, సత్యదేవ్‌, అజయ్‌, సుబ్బరాజు, నరేశ్‌, రఘుబాబు, బండ్ల గణేశ్‌, సంగీత, హరితేజ, రోహిణి, సూర్య, తమన్నా (స్పెషల్ సాంగ్)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌. రత్నవేలు
ఎడిటింగ్‌: తమ్మిరాజు
నిర్మాత: అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు
రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌
విడుదల తేదీ: 11-01-2020