సర్కారు వారి పాట మూవీ రివ్యూ

Published On: May 16, 2022   |   Posted By:

సర్కారు వారి పాట మూవీ రివ్యూ

మహేష్ ‘సర్కారు వారి పాట’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍

మహేష్ గత కొంతకాలంగా స్క్రిప్టు ఎంపికలో మార్పులు చేసుకుని, ఫన్ ..యాక్షన్ కలిసిన సినిమాలే చేస్తున్నారు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకు ఇట్టే కనెక్ట్ అవుతున్నారు. ఆ విషయం ‘దూకుడు’,ఖలేజా, సరిలేరు నీకెవ్వరూ సినిమాల్లో ప్రముఖంగా కనపడుతుంది. ఇప్పుడు కూడా అలాంటి కథనే ఎంచుకున్నాడని ట్రైలర్ ని బట్టి ఫ్యాన్స్ ఊహించుకున్నారు. హీరో, దర్శకుడు కూడా అదే చెప్పారు. అలాగే ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలోని మోసాలపై అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంత? కథ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Story line:

బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు తీర్చలేక, ఆత్మహత్య చేసుకుంటారు మహేష్ (మహేష్ బాబు) తల్లిదండ్రులు. దాంతో, పెరిగి పెద్దయ్యాక డబ్బు మీద బాధ్యతతో కూడిన వ్యామోహం పెంచుకుని వడ్డీ వ్యాపారి అవుతాడు. అదీ అమెరికాలో ‘మహి ఫైనాన్స్ కార్పోరేషన్’అని వ్యాపారం చేసుకుంటూంటాడు. మరో ప్రక్కన ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటుంది కళావతి(కీర్తి సురేష్).క్యాసినోలు ,గాంబ్లింగ్ అంటూ అప్పు చేసి మరీ ఆమె జల్సాల్లో మునిగి తేలుతుంది. ఆమెకు డబ్బు అవసరమవుతుంది. కానీ డైరక్ట్ గా డబ్బు అడిగితే అప్పు ఇవ్వడని, తను అనాధ అని, చదువుకోసం ఇబ్బందులు పడుతున్నానని నాటకం ఆడుతుంది. , అప్పులు వసూలు చేయడంలో దిట్ట అయిన హీరోనే బురిడీ కొట్టించి నాకేస్తూంటుంది. అయితే నాటకం ఎన్ని రోజులు నడుస్తుంది. ఓ రోజు బయిటపడుతుంది. దాంతో ఆమె నిలదీస్తే ..నేను డబ్బులు ఇవ్వను ఫో అంటుంది. దాంతో అప్పు వసూలు చేయడానికి ఇండియాలో ఉన్న ఆమె తండ్రి రాజేంద్రనాధ్ (సముద్రఖని) దగ్గరకొస్తాడు. ఇక్కడకి వచ్చాక కథ మరో మలుపుతుంది. బ్యాంక్ లలో భారీగా అప్పులు చేసేసి చాలా మంది పెద్దలు ఎగ్గొట్టి, పొలిటకల్ అండతో తప్పించుకుంటూంటారు. దానివల్ల బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. పెద్ద స్దాయి ఉద్యోగుల ఇరుక్కుపోతున్నారు.

అలా ఇక్కడ వైజాగ్ లో రాజేంద్రనాధ్ వల్ల ఓ బ్యాంక్ ఆఫీసర్ (నదియా) ఇరుక్కుపోతుంది. రాజేంద్రనాధ్ దగ్గర లంచం తీసుకుని లోన్ ఇచ్చారని ఎలిగేషన్ తో ఆమెను అరెస్ట్ చేస్తారు. ఈ విషయం అనుకోకుండా జర్నీలో ఉన్న మహేష్ కళ్ల పడుతుంది. దాంతో ఆమె సమస్యను తన భుజాన వేసుకుంటాడు. వెళ్లి రాజేంద్రనాధ్ కు వార్నింగ్ ఇస్తాడు. నోటీసు ఇప్పిస్తాడు. అయితే రాజేంద్రనాథ్ లొంగే మనిషి కాదు. తన మనుష్యులను పంపి మహేష్ ని బెదిరించే ప్రయత్నం చేస్తాడు. కుదురదు. కాని కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాడు.

దాంతో మహేష్ మరో ప్లాన్ చేస్తాడు. బ్యాంక్ లో చిన్న చిన్న మొత్తాలు అప్పులు చేసి ఈఎమ్ ఐ లు కడుతున్న వాళ్లను కలిసి ..వాళ్లని బ్యాంక్ కు డబ్బు కట్టవద్దని చెప్తాడు. రాజేంద్రనాధ్ అప్పు తీర్చేదాకా తాము తీర్చమని మొండికేయమంటాడు. దాంతో అలజడి చెలరేగుతుంది. బ్యాంక్ లు గోలెత్తిపోతాయి. అప్పుడు రాజేంద్రనాథ్ తన మనుష్యులను పంపి బలవంతంగా అప్పులు కట్టించే పోగ్రాం పెడతాడు. అప్పుడు స్వయంగా మహేష్ రంగంలోకి దిగి బ్యాంక్ లకు తాళాలు వేయిస్తాడు. చివరకు వేరే దారి లేక ప్రజలు ఒత్తిడి తట్టుకోలేక ..రాజేంద్రనాథ్ …అప్పు తీరుస్తానని మీడియా ముందుకు వచ్చి చెప్తాడు. దాంతో మహేష్ సంతోషిస్తాడు. ఇదీ కథ.

Screenplay Analysis:

విజయ్ మాల్యా, ఆదాని వంటి వాళ్లు బ్యాంక్ లకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినప్పుడు మీడియాలో వార్తలు ప్రముఖంగా వచ్చాయి. సోషల్ మీడియా సైతం దీనిపై వరస పోస్ట్ లతో స్పందించారు.మిడిల్ క్లాస్ వాళ్ల దగ్గర ముక్కు పిండి డబ్బు వసూలు చేసే బ్యాంక్ లు …పెద్దవాళ్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారంటూ వాట్సప్ లో మెసేజ్ లు వచ్చాయి. మరికొందరు ముందుకేసి మనం ఈఎమ్ ఐ లు కట్టకపోతే వాళ్లే దారికి వస్తారు అంటూ మేసేజ్ లు కూడా ఇచ్చారు. అయితే ఇదే పాయింట్ ని పరుశురామ్ తీసుకున్నారు. దాన్నే కథగా అల్లారు. అయితే ఆ కథలో రావాల్సిన డెప్త్ రాలేదు. ఇలాంటి సోషల్ ఇష్యూ తీసుకున్నప్పుడు కథ విస్తరణ పెరిగిపోతుంది. అది పట్టించుకోకుండా వైజాగ్ లోకల్ గా ఓ వ్యక్తి అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు. అతని చేత కట్టించాడు అంటూ కథ చెప్పే ప్రయత్నం చేసాడు. చిన్న హీరోలకు ఆ కథలు ఓకే కానీ మహేష్ వంటి హీరోలకు అది సరిపోలేదు. కథలో వచ్చే కాంప్లిక్ట్స్ సెకండాఫ్ స్టార్ట్ అయిన పావు గంటకు కానీ రివీల్ కాదు. అంటే అప్పటిదాకా కథకు సంభందంలేని ట్రాక్ లు సాగుతున్నట్లే.

దానికి తోడు విలన్ గా సముద్ర ఖని ఏదో ఉన్నాడంటే ఉన్నాడు ..లేడంటే లేడు అన్నట్లు ఉంది. విలన్ కు, హీరోకు మధ్య వచ్చే సీన్స్ పెద్దగా ఎలివేట్ కాలేదు. అన్నిటికన్నా ముఖ్యం…విలన్ ..బ్యాంక్ ని ఛీట్ చేసి సంపాదించిన డబ్బు..ఆ బ్యాంక్ లో డబ్బులు దాచుకున్న వాళ్లదే…అతను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అనే విషయం ఏదో డైలాగుతో చెప్పారు. కానీ విజువల్ గా చూపెట్టలేదు. దాంతో విలన్ పై మనకు ఏమి కోపం,కసి రాలేదు. దానికి తోడు మహేష్ చేసిన పోరాటం వల్ల జన జీవితంలో ఏమీ మార్పు రాలేదు. వాళ్లు ఈఎమ్ ఐ లు కట్టడం ఆపలేదు. కట్టడం లేటైనా ఫర్వాలేదు అని బ్యాంక్ లు అనలేదు. అసలు ఏమి ప్రయోజనం మహేష్ పాత్ర సాధించినట్లు ఈ కథతో…? అది స్పష్టత లేకపోవటంతో ట్రీట్మెంట్ గాడితప్పింది. దాని వెనకే స్క్రీన్ ప్లే కూడా కూడాను. మెసేజ్ ని,ఎంటర్టైన్మెంట్ ని కలపి చెప్పటం కుదరలేదు. దర్శకుడు ఉన్నంతలో ఫన్ చేయగలిగాడు కానీ యాక్షన్ కు తగిన లీడ్ తీసుకోలేకపోయాడు. దాంతో ఆ సీన్స్ లో ఎమోషన్ కు మనం కనెక్ట్ కాక అలా వచ్చిపోయినట్లు అనిపిస్తాయి.

ప్లస్ లు :

మహేష్ బాబులో మరోసారి మంచి ఈజ్ తో కూడిన ఫన్
పాటలు
మహేష్ – కీర్తి సురేష్ మధ్య వచ్చే లవ్ సీన్స్

మైనస్ లు:

స్టోరీ లైన్ ,స్క్రీన్ ప్లే
బ్యాంకింగ్ సిస్టమ్ పై ఉపన్యాసాలు
కీర్తి సురేష్ ఓవర్ యాక్టింగ్

Analysis of its technical content:

ఈ సారి పరుశురామ్ డైరక్టర్ గా బాగా చేసారు కానీ .. రచయితగా మెప్పించలేకపోయారు. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ యాక్షన్ డ్రామాగా సాగుతూ సర్కారు వారి పాట మెప్పించలేకపోయాడు. మహేష్ వంటి స్టార్ కు బలంలేని కథ ఎంచుకుని, కామెడీతో లాగే ప్రయత్నం చేశారు. ఇక సంగీత దర్శకుడుగా తమన్ పాటల్లో రాణించాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలిసి రాలేదు. కెమెరా వర్క్ అయితే నెంబర్ వన్ గా ఉంది. విజువల్ పరంగా పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఎడిటింగ్ పరంగా ఇంత లెంగ్త్ అక్కర్లేదనిపిస్తుంది. ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

నటీనటుల పని తీరుకు వస్తే.. మహేష్ ఫన్ టైమింగ్, నటన సినిమాకు ప్లస్‌ అని చెప్పాలి. ఇప్పటి వరకూ తను చేసిన పాత్రలకు భిన్నంగా అని చెప్పలేం కానీ బాగుంది. తన నటన, యాటిట్యూడ్‌ ఆకట్టుకున్నాయి. సూపర్ హ్యాండ్సమ్ లుక్ లో చూపించారు. హీరోయిన్‌ కీర్తి సురేష్ పాత్ర ఓవర్ గా సాగింది. పరిధి మేరకు నటించింది. చలాకీతనంతో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఆమెకు పెద్దగా సీన్స్ లేవు. ఇతర పాత్రధారులు వెన్నెల కిషోర్, సముద్ర ఖని, నదియా, తణికెళ్ల భరణి వంటి వారు అలరించారు.

CONCLUSION:
మరీ హై ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఫరావాలేదనిపిస్తుంది.

Movie Cast & Crew
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని,నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
సీఈవో: చెర్రీ
రన్ టైమ్: 2 గంటల 40 నిముషాలు
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: యుగంధర్
రచన‌, దర్శక‌త్వం: పరుశురామ్ పెట్లా
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
విడుదల తేదీ: 12, మే 2022