సుల్తాన్ మూవీ రివ్యూ
మట్టి ముల్తాన్ :కార్తీ ‘సుల్తాన్’ మూవీ రివ్యూ
Rating:2.5/5
కార్తి సినిమాలంటే కొద్దిగా వైవిద్యంగా ఉంటాయని మొదట్లో ముద్ర వేయించుకున్నాడు. ఆ ముద్రను కంటిన్యూ చేస్తూ కొన్ని వైవిద్యమైన సినిమాలూ చేసాడు. అయితే ఆ తర్వాత కమర్షయల్ మూస మాస్ సినిమా కుట్టేసింది. అందరి హీరోల్లాగే తనూ ఫైట్స్, పాటలు, కామెడీ అంటూ చెలరేగిపోయాడు. కానీ అవేమీ భాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. అబ్బే ఇది కాదు అని ‘ఖైదీ’ అంటూ మళ్లీ తన పాత స్కూల్ లోకి వెళ్లి డిఫరెంట్ మూవీ చేసి హిట్ కొట్టాడు. లేదు లేదు సూపర్ హిట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు కూడా సుల్తాన్ అంటున్నాడు. ఏ రాజ్యానికి కార్తీ సుల్తాన్ అయ్యాడు. సుల్తాన్ కథేంటి…ట్రైలర్ లో చెప్పిన వంద మంది కౌరవులు మ్యాటరేంటి, ఇది డిఫరెంట్ సినియేనా లేక…ఆ వంకతో వచ్చిన కమర్షియల్ కిచిడినా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
లోకల్ డాన్ (నెపోలియన్) కొడుకైనా సుల్తాన్ (కార్తి)ది హింసకు వ్యతిరేకమైన మనస్తత్వం. తన తండ్రి తో ఉండే వంద మంది రౌడీలను,వారి చేష్టలను ఇష్టపడడు. తల్లి లేని తనను చిన్నప్పటి నుంచి ఎత్తుకు మోసారనే మమకారం మాత్రమే ఉంటుంది వారిపై. రోబోటిక్ ఇంజీనిరింగ్ చదివి..త్వరలో జపాన్ వెళ్లిపోయే ప్రయత్నాల్లో సుల్తాన్..కొద్ది రోజులు తన ఇంట్లో ఉండి వెళ్లాలని తన ఊరుకు వస్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఎటాక్ లో తన తండ్రి చనిపోతాడు. చనిపోయేముందు… తన తండ్రితో ఇన్నాళ్లు ఉన్న వాళ్లను జాగ్రత్తగా చూస్తానని మాట ఇస్తాడు. అయితే ఈ లోగా …పోలీస్ కమీషనర్ తన వాళ్లను ఒక్కొక్కరిని వేసేయటానికి టార్గెట్ చేసారని తెలుసుకుంటాడు. ఆయనతో మాట్లాడి..తన వాళ్లను మారుస్తానని,ఏం చేయవద్దని మాట తీసుకుంటాడు. కానీ ఆ రౌడీలు ప్రస్తుతం అమరావతిలోని వెలగపూడి గ్రామం వెళ్ళటానికి బయిలుదేరతాడు. అక్కడ లోకల్ గా సేతుపతి(రామచంద్ర రాజు) జనాలని వ్యవసాయం చేయనీయకుండా చేసి ఆ భూములు ఆక్రమిద్దామని ప్రయత్నిస్తూంటాడు. వాళ్ళను ఆ సమస్య నుంచి తప్పిస్తామని సుల్తాన్ తండ్రి బ్రతికున్నప్పుడు మాట ఇస్తాడు. దాంతో ఆయన మాట కోసం వీళ్లంతా అక్కడికి బయిలుదేరతాడు. వాళ్లు అక్కడ హింస చేయకుండా సుల్తాన్ వాళ్లను ఎలా కాపాడాడు…తండ్రి మాట నిలబడిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …
చాలా కలగాపులంగా తయారైన కథ ఇది. లెక్కకు మించి కాంప్లిక్ట్స్ లు పెట్టుకున్నారు. మరో కేజీఎఫ్ చేసేద్దామని డైరక్టర్ తాపత్రయం కనపడింది తప్ప..అందుకు తగ్గ కృషి లేదు. ప్రారంభంలో ఎత్తుకున్న ఎత్తుగడ కాసేపటికే మాయమైపోతుంది. కథ ఎటెటో వెళ్లిపోతుంది. అలాగే కథలో ఇద్దరు విలన్స్ …ఇద్దరికీ పనేమీ లేదు.కేవలం అరవటం ..ఛాలెంజ్ చేయటం తప్ప. స్ట్రాంగ్ విలన్ లేకపోవటంతో హీరో క్యారక్టర్ కు పనేమీ లేకపోయింది. భూమి క్రింద ఖనిజాలు..విలన్ కన్నేయటం వంటివి చూస్తూంటే ఖలేజా గుర్తుకు వస్తుంది. అయితే వాళ్లు అన్ని వేలో లక్షల కోట్లో ఖనిజాలు కావాలనుకున్నప్పుడు ..బయిట ఎవరికీ తెలియకుండా గుట్టుగా వ్యవహారం నడపాలి. కాస్త ఎక్కువ డబ్బు ఇచ్చి ఊరు ఖాలీ చేయిస్తే వాళ్లు చక్కగా వేరే చోట పొలాలు కొనుక్కుని సెటిల్ అవుదురు ఏమో.. లేక విలన్ వెల్లాక ఆ ఊరు వాళ్లంతా కలిసి …ఆ ఖనిజాన్ని తవ్వేసుకుంటారో మరి..అసలు ఆ ఊరోళ్ల ఆలోచన ఏమిటో అర్దం కాదు. ఇక హీరో కు రౌడీలని రైతులను చేయాలనే ఆలోచన వచ్చి అక్కడే పొలాలు కొంటాడు. అంటే ఆ ఊరోళ్లు ఆ పొలాలని అమ్మేస్తారన్నమాట. క్లైమాక్స్ దాకా ఫస్ట్ విలన్ …సీన్ లోకి రాడు..కారణం..రౌడీలను పోగు చేసుకుంటాను అంటాడు. ఇలా చాలా సీన్స్ చాలా కంగాళీగా తీసాడు. కార్తీ – రష్మిక లవ్ ట్రాక్ కి యూత్ ఎక్కడ కనెక్ట్ అవుతారో అని చాలా జాగ్రత్తలు పడి తీసినట్లుంది.
డైరక్షన్..మిగతా టెక్నికల్ టీమ్..
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్ సత్యన్ సూర్యన్ కెమెరావర్క్..ఆ విజువల్స్ సూపర్బ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఒకే ఫ్రేమ్ లో అంతమంది ఆర్టిస్టులని చూపించటం కష్టం. కానీ దాన్ని ఈజ్ తో చేసేసాడు. వివేక్ – మర్విన్ పాటలు అసలు బాగోలేవు. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ది బెస్ట్. రూబెన్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఆర్ట్ వర్క్ బాగుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫెంటాస్టిక్ .
ఇక డైరక్టర్ …రెగ్యులర్ మాస్ మసాలా ఫిలిమ్స్ తీద్దామని కమర్షియల్ అంశాలు అన్ని కుప్పగా పోసుకున్నాడు. మాస్ ఆడియన్స్ ఈలలు కొట్టే సీన్స్ అన్ని సినిమాల్లోంచి తీసుకున్నాడు. అయితే వాటిని కలుపుతూ స్క్రిప్టు రావటంలోనే తడబడ్డాడు.
నటీనటుల్లో …
కామెడీ, రొమాన్స్, ఎమోషన , యాక్షన్ ఇలా అన్ని అద్భుతంగా ఒకే కథలో ఉంటే తనలోని నటుడుని కమర్షియల్ గా బయిటపెట్టచ్చు అని ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు ఉన్నాడు కార్తి. అందుకు తగ్గట్లుగా ఎక్సప్రెషన్స్ పలికించాడు. కానీ కొన్ని చోట్ల తేలిపోయాడు. ఇక రష్మిక మందన్న పల్లెటూరి అమ్మాయిగా, మాస్ లుక్స్, యాటిట్యూడ్ ఉన్న క్యారక్టర్ లో బాగానే కుదురుకుంది. ముఖ్య పాత్రలు చేసిన నెపోలియన్, లాల్ లు తమ నటనతో సినిమాకి బలాన్ని చేకూర్చారు. విలన్ గా రామచంద్ర రాజు మరోసారి నెగటివ్ షేడ్స్ లో బాగా చేసాడు.
చూడచ్చా
ఇంతచదివాక కూడా చూడగలం అనే ధైర్యం ఉంటే ఖచ్చితంగా చూడాలి.
తెర వెనక..ముందు
నటీనటులు : కార్తీ, రష్మిక మందన్న, యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు తదితరులు
నిర్మాణ సంస్థ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
సంగీతం : వివేక్- మెర్విన్
ఎడిటర్: రూబెన్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్
నిర్మాతలు : యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు
దర్శకత్వం : బక్కియరాజ్ కణ్ణన్
రన్ టైమ్ : 2 గం 29 నిమిషాలు
విడుదల తేది : ఏప్రిల్ 02,2021