సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రివ్యూ

Published On: December 25, 2020   |   Posted By:

సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రివ్యూ

సోలో బ్రతుకే సో బెటర్’ రివ్యూ

సోసో గా.. : ‘సోలో బ్రతుకే సో బెటర్’ రివ్యూ

Rating:2.5 /5 

దాదాపు తొమ్మిది నెల‌ల త‌ర్వాత థియేట‌ర్‌లోకి వ‌చ్చిన  ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని ఇండ‌స్ట్రీ అంతా స‌పోర్ట్ చేస్తోంది.మరో ప్రక్క ఈ చిత్రం ట్రైలర్ సైతం ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ అనే అభిప్రాయం కలిగించింది. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. దాంతో ఈ కరోనా టైమ్ లోనూ థియోటర్స్ దగ్గర జనం క్యూలు కట్టారు. వారి ఎక్సపెక్టేషన్స్ ఈ సినిమా ఏ మేరకు అందుకుంది. మెగా మేనల్లుడు కెరీర్ లో మరో హిట్ గా ఈ సినిమా నిలిచిందా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

స్టోరీ లైన్

తన మామయ్య(రావు రమేష్) చెప్పిన మాటలు విని పెళ్లి,గిల్లి వంటివాటికి తన జీవితంలో దూరం పెట్టేస్తాడు విరాట్(సాయి తేజ). అంతేకాకుండా పెళ్లి వద్దంటూ,సోలో బ్రతుకే సో బెటర్ అంటూ పాటలు పాడి, ఉపన్యాసాలు ఇస్తూంటారు. దాన్ని కొందరు అనుసరిస్తూంటారు. అయితే జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఉద్యోగ నిమిత్తం వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తాడు విరాట్. అక్కడ తన మామయ్య గురించిన ఓ నిజం తెలిసి తన అభిప్రాయాలు మార్చుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ లోగా తన స్నేహితుడు ఇంటి ఓనర్ గోవిందు( వెన్నెల కిషోర్) పెళ్లికు వెళ్లిన విరాట్..అక్కడ పెళ్లి కూతురు అమృత (నభా) ..విరాట్ ని చూసి ..అతనితో ప్రేమలో ఉన్నానని చెప్పి పెళ్లి కాన్సిల్ చేస్తుంది. తనకు ఓ జోడి దొరికింది అని మురిసిపోయిన విరాట్ కు ఆమె ఓ ట్విస్ట్ ఇస్తుంది. పెళ్లి చేసుకోనంటుంది. ఆ ట్విస్ట్ తనకు తెలియకుండా తను క్రియేట్ చేసిందే. దాంతో విరాట్ కు బుర్ర తిరిగి బొమ్మ కనపడుతుంది. ఆమె మనస్సు మార్చి, ఎలా విరాట్ పెళ్లి చేసుకోవటానికి ఒప్పించాడు. అసలు ఆమె ఏం చెప్పింది. అలాగే విరాట్ కు తన మామయ్య గురించి తెలిసిన నిజం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్

ఇలాంటి కథలకు ప్రాణం …అసలు పెళ్లంటూ చేసుకోనని భీష్మించుకుని కూర్చున్న హీరో ఎలా మారాడు అనేది. ఆ సీన్స్ చాలా పేలవంగా ఉండటంతో సినిమా కాన్సెప్టే తేలిపోయింది. అలాగే పెళ్లి చేసుకోనని చెప్పే హీరో..యవ్వన సహజమైన కోరికలు కోసం ..ఏం చేస్తాడు..సహజీవనం అంటాడా లేక మరో దారి తొక్కుతాడా అనేది కూడా చెప్పాలి. ఎంత కామెడీగా డీల్ చేసినా ఇలాంటి పాయింట్ దగ్గర కథ వీకై దొరికిపోతుంది. ఇక హీరోయిన్ క్యారక్టర్ సైతం డల్ గానే ఉంది. ఆమె పాత్రలో జీవం లేదు. కథ చెప్పినట్లు నడిచింది తప్ప. తనకంటూ కొన్ని అభిప్రాయాలతో ముందుకు వెళ్లలేదు. ఏవో కొన్ని తింగరి ఆలోచనలను ముడేసినట్లు ఉంటుంది. గతంలో జంధ్యాల గారి సినిమా వివాహభోజనంబులోనూ ఇలాంటి పాత్రను గమనించవచ్చు. అలాగే బ్రహ్మచారిలోనూ కమల్ ఇలాంటి క్యారక్టర్ చేసారు. అయితే కాలం మారింది. పెళ్లి చేసుకోను అంటే మానసికంగా,శారీరకంగా ఏదైనా సమస్య ఉందా అనే ఆలోచన వెంటనే వచ్చే రోజులివి. వాటికి సమాధానం చెప్పగలగాలి. ఇంటర్వెల్ ట్విస్ట్, ఫస్టాఫ్ బాగుందనిపించినా, సెకండాఫ్ లో కథ అసలు సమస్యలోకి ప్రవేశించే సమయానికి పూర్తిగా డల్ అయ్యిపోయింది. క్లైమాక్స్ అయితే మరీ దారుణం.

హైలెట్స్

విరాట్ గా సాయి తేజ ఎక్సప్రెషన్స్, ఫన్

మ్యూజిక్

రావు రమేష్ డైలాగ్ డెలవరీ,ఎమోషన్స్

మైనస్ లు..

మహా నసగా నడిచే సెకండాఫ్
అసంతృప్తిగా అనిపించే రొటీన్ క్లైమాక్స్
సెకండాఫ్ లో ఫన్ పండని కామెడీ సీన్స్
  
టెక్నికల్ గా..

ఈ సినిమాకు మంచి టెక్నీషియన్స్ దొరికారు. వారి పనితనం బాగుంది. అయితే కొత్తగా పరిచయం అయిన దర్శకుడు సుబ్బు మాత్రం తొలి సినిమాకే తేలిపోయే సబ్జెక్టు ని ఎంచుకున్నారు. కమర్షియల్ గా పాసైపోవాలనే తపనలో కామెడీకు ప్రయారిటీ ఇచ్చి ఎమోషన్స్ ని వదిలేసారు. అలాగే డైరక్టర్ టచ్ సైతం సినిమాలో లేదు. సినిమాటోగ్రఫి సూపర్ గా ఉంది. తమన్ పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరకొట్టాడు. ఎడిటింగ్ సోసో గా ఉండి,సెకండాఫ్ లో జనాలను బలేసింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్ గా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ, నభ నటేష్ ఇద్దరూ పోటీపోటీగా చేసారు. అయితే అవి కార్టూన్ క్యారక్టర్స్ లా జీవం లేకుండా పోయాయి. రావు రమేష్ తన సత్తా మరోసారి చూపించారు. సత్య కామెడీ ఎప్పటిలాగే బాగుంది. రాజేంద్రప్రసాద్, నరేష్, అజయ్ వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వెన్నెల కిషోర్ ని సరిగ్గా వాడుకోలేదు.
 
చూడచ్చా…

చాలా రోజులుగా థియేట‌ర్‌లో సినిమా చూడలేదు అనుకున్నవాళ్లు ఓ లుక్కేయ వచ్చు.   అయితే ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుండానే ఉంటేనే సుమా  

 తెర వెనుక..ముందు

బ్యానర్‌:  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి
నటీనటులు: సాయితేజ్‌, నభానటేశ్‌, రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌, వీకే నరేష్‌, సత్య, సుదర్శన్‌, వెన్నెలకిషోర్‌ తదితరులు
సంగీతం: ఎస్‌.తమన్‌
సినిమాటోగ్రఫీ:  వెంకట్‌ సి.దిలీప్‌
ఆర్ట్‌:  అవినాష్‌ కొల్ల
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  సుబ్బు
నిర్మాత:  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
సమర్పణ: బాపినీడు
విడుదల:  జీ స్టూడియో
రన్ టైమ్ : 2 గంటల 6 నిమిషాలు
విడుదల తేదీ: 25-12-2020