హీరో మూవీ రివ్యూ
మహేష్ మేనల్లుడు తొలి చిత్రం ‘హీరో’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ‘హీరో’ఒకటి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలానే సినిమాలో చాలా మంది పేరున్న నటీనటులు ఉన్నారు. బాగా ఖర్చుపెట్టారు. ప్రతి ఫ్రేమ్ ను క్వాలిటీతో చిత్రీకరించారు. అయితే ఎన్ని ఉన్నా సినిమా జనాలకు నచ్చాలి. హిట్ కొట్టాలి. అప్పుడే ఫలితం. మరి తన మొదటి సినిమాతో అశోక్ గల్లా ఎలాంటి హిట్ అందుకుంటరనేది ప్రక్కన పెడితే ఎలా చేసారు..అసలు తెరంగ్రేటానికి కావాల్సిన కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.!
స్టోరీ లైన్
అర్జున్ (అశోక్ గల్లా)కు నటుడుగా సినీ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలని కోరిక. అందుకోసం ట్రైల్స్ వేస్తూంటాడు కానీ ఫలితం ఉండదు. ఈ లోగా ఖాలీగా ఉండటం ఎందుకనుకున్నాడో ఏమో కానీ ప్రక్కింటి అమ్మాయి సుబ్బు(నిధి)లో లవ్ స్టోరీ మొదలెడతాడు. కానీ ఆమె తండ్రి (జగపతిబాబు)కు ఇది ఇష్టం ఉండదు. ఇదిలా ఉండగా ఆన్ లైన్ లో ఓ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ కు ఆర్డర్ పెడతాడు. అనుకోకుండా కొరియర్ లో ఓ గన్ వస్తుంది. అది రాంగ్ ఎడ్రస్ కు వచ్చిందని తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ గన్ తో తన గర్ల్ ప్రెండ్ ని చంపమని వస్తుంది. అసలా గన్ పంపింది ఎవరు..సుబ్బు తండ్రిని చంపాలని ఎందుకు,ఎవరు ప్రయత్నం చేస్తున్నారు..ఇది తెలుసుకున్న అర్జున్ ఆయన్ని రక్షించుకున్నాడా…హీరో అనిపించుకున్నాడా..వెండితెరపైనా రాణించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ …
ఎప్పటికైనా సినిమా హీరో అవ్వాలని కలలు కనే ఓ కుర్రాడు.. సడెన్ గా ఓ మర్డర్ మిస్టరీలో చిక్కుకుంటాడు. ఆ మర్డర్ స్టోరీ ఏంటి..? దాని నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీ ..వినటానికి సింపుల్ కధలాగే ఉంది. కానీ ఇలాంటి కథలకు ట్రీట్మెంట్ ,స్క్రీన్ ప్లే రాసేటప్పటికే పులుసు కారుతుంది. ఎందుకంటే క్యారక్టర్స్ సీన్స్ ..కథను డ్రైవ్ చెయ్యాలి. కథలోంచి సీన్స్ రావు. సీన్స్ రాసుకుంటూ కథను క్రియేట్ చెయ్యాలి. ఇది రైటర్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే టాస్కే. కథ పూర్తయ్యేసరికి రైటర్స్ బ్లాక్ వచ్చేస్తుంది. అయితే అదంతా సవ్యంగా కథని కథగా రాయాలనుకున్నప్పుడే . అలా కాకుండా ఎక్కడ ఫన్ వస్తుందో చూసుకుంటూ,బ్లాక్స్ వారీగా ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఏ సమస్యా ఉండదు. అందులోనూ కామెడీ. జనాలు నవ్వేసారా..నో ప్లాబ్లం.కాకపోతే కథలో క్యారక్టర్స్ కు ఏ ప్లాబ్లం లేకపోతే అసలు కథకే ప్లాబ్లం వస్తుంది. ఆ సమస్య ఈ సినిమాలోనూ కనపడుతుంది. అయితే కాస్తంత సంక్రాంతి సంబరం, కామెడీ పొర, అవసరానికి మించి స్టైలిష్ టేకింగ్, రిచ్ నెస్ మసకేసాలా చేసేస్తుంది. శ్రీనువైట్లను ఈ సినిమా గుర్తు చేస్తుంది. దుబాయి శ్రీను అక్కడక్కడా కనపడుతుంది.
“Dying is easy, comedy is hard,” అని చెప్తూంటారు. అయితే కామెడీ సరిగ్గా కుదరకపోతే చూసేవాడికి నరకమే.క్రైమ్ కామెడీ కాస్తా..కాసేపటకి స్పూఫ్ గా మార్చేసారు. సెకండాఫ్ లో చాలా సీన్స్ సాగుతూంటాయి. ఇక నిజానికి కొత్త హీరోకు సీన్లు రాయడం అంత సులువు కాదు. ఎందుకంటే ఏ ఎమోషన్ ఎలా పండిస్తాడో అంతకు ముందు చేసిన రిఫరెన్స్ ఉండదు. అందుకే కొత్త సీన్ల కన్నా కొత్త ఫన్ నే టేకప్ చేసారు. ఆ ఫన్ లైన్ లో కూడా దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యారు. కుర్రాడు కదాని అని ఓ యూత్ లవ్ స్టోరీ ఎత్తకోకపోవటం అతని చేసిన తెలివైన పని. అయితే స్టఫ్ ఉన్న ప్లాట్ ఎంచుకోవాల్సింది. సీరియస్ సినిమా కాదు కదా మనం చేసేది అని మరీ సిల్లీ సీన్స్ తో కథ రాసుకున్నారు. స్క్రీన్ ప్లే లో మాఫియా వంటివి కలవటంతో కాస్త రేసీగా ఉన్నట్లు అనిపించింది కానీ లేకపోతే అదీ ఇబ్బందే అయ్యేది. మేకింగ్ లో చూసుకుందాం అనుకుని క్రైమ్ కామెడీని కలర్ ఫుల్ గా తీర్చిదిద్దుకుంటా వెళ్లారు. ఏదైమైనా స్క్రిప్టు మరింత ఇంప్రూవ్మెంట్ తో ఉంటే ఇంకా బాగుండేది. యాంబిషియస్ గా చేసిన మేకింగ్ కాస్తా ప్లాట్ లో పస లేకపోవటంతో తేలిపోయింది. కాకపోతే కామెడీ ఉన్నంతలో పూర్తిగా పడకుండా కాపాడింది.
ఫెరఫార్మెన్స్ చూస్తే..
అశోక్ గల్లా…కొత్తవాడైనా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. లైటర్ వీన్ లో సాగే క్యారక్టర్ అయినా ఎక్కడా అతికి వెళ్లలేదు. కాకపోతే ఎక్సప్రెషన్స్ వైజ్ చాలా పూర్ గా ఉన్నాడు. ఇంకా ఎక్సరసైజ్ చేయాలి ఆ విషయంలో. నిధి అగర్వాల్ చేయటానికి ఏమీ లేదు. మాట్లాడుకోవటానికి ఏమీ లేదు. టీవి మోడల్ గా వెన్నెల కిషర్, పాన్ ఇండియా యాక్టర్ గా బ్రహ్మాజీ నవ్వించారు.జగపతి బాబు బాగా చేసారు. రవి కిషన్ గెటప్ బాగుంది కానీ కొంచెం లౌడ్ గా ఉంటుంది. తండ్రి గా నరేష్ బాగానే చేసాడు. హీరో తల్లి పాత్రలో అర్చన ఓకే. ఫస్ట్ హాఫ్ లో సత్య పాత్ర హిలేరియస్ గా సాగుతుంది.
టెక్నికల్ గా ..
లావిష్ గా ఈ సినిమాకు ఖర్చుపెట్టడమే రిచ్ లుక్ తెచ్చింది. అదే మేజర్ ప్లస్ పాయింట్ కూడా. విజువల్ గా చాలా చోట్ల స్టన్నింగ్ గా ఉన్నాయి. . సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిలిచింది. కెమెరా వర్క్, ఎడిటింగ్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. డైరక్టర్ తన పట్టుని స్క్రిప్టుపై చూపెడితే ఇంకా బాగుండేది. మ్యూజిక్ అంత గొప్పగా లేదు. పాటలు ఓకే అనిపించాయి.
ప్లస్ పాయింట్లు
నిర్మాణ విలువలు
బ్యాక్ గ్రవుండ్ స్కోర్
విజువల్స్
నచ్చినవి:
కథని కామెడీగా డీల్ చేయటం
ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా ఉండేలా చూడటం
కొత్త హీరో డాన్స్ లు, ఫైట్స్
నచ్చనవి:
స్ట్రాంగ్ కాంప్లిక్ట్ కానీ, కథ కానీ లేకపోవటం
సీన్స్ లో విషయం లేకపోవటం
హీరోలో నటన లేకపోవటం
చూడచ్చా..
కాసేపు నవ్వుకోవటానికి ఈ సినిమా మంచి కాలక్షేపమే
ఎవరెవరు…
నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, రవికిషన్, సత్య, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ తదితరులు
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
సంగీతం: జిబ్రాన్
నిర్మాణ సంస్థలు: అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: పద్మావతి గల్లా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య .టి
Run Time:2 hr 12 Mins
విడుదల తేదీ: 15-11-2022