2.0 మూవీ రివ్యూ
నటీనటులు: రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్, సుదాంశు పాండే, అదిల్ హుస్సేన్, కళాభవన్ షాంజాన్, రియాజ్‌ఖాన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటింగ్: ఆంథోని
ఆర్ట్: టి.ముత్తురాజు
వీఎఫ్ఎక్స్ అడ్వైజర్: శ్రీనివాసమోహన్
ఫైట్స్: సెల్వ
నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్, రాజు మహాలింగం
రచన, దర్శకత్వం: శంకర్
సంస్థ: లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 29-11-2018
శంకర్ కు సిని జిత్తులన్నీ తెలుసు. రజనీకాంత్ స్టైల్ స్టేట్మెంట్ అన్నిటిలో ఫస్ట్ క్లాస్. ఇక వీరిద్దరూ కలిస్తే భాక్సాఫీస్ కు బ్యాండ్ బాజా బరత్. అయితే గత కొద్ది కాలంగా ఇద్దరూ పోటా పోటీగా బోల్తాపడుతున్నారు. దాంతో ఇది కాదు పద్దతి అని…తమ హిట్ రోబో ని తీసి..దానికి సీక్వెల్ ముస్తాబు చేసి ..చూసుకోండి..ఇదీ మా సత్తా అంటూ వదిలారు. అప్పట్లో రోబో చూసిన జనరేషన్ మారింది. కొత్త జనరేషన్ ..తెల్లారి లేస్తే ఎన్నో హాలీవుడ్ సినిమాలు తిరగేస్తోంది. కొరియా సినిమాలను కొరికేస్తోంది.
ఈ నేపధ్యంలో వాళ్ల అభిరుచులను అందుకోవటం అంత వీజి కాదు. కానీ శంకర్ కు ఓ రేంజి ఛాలెంజ్ లు అంటే ఇష్టం అని ఆయన సినిమాల్లో హీరోలు చేసే ఛాలెంజ్ లు చూస్తే అర్దం అవుతుంది. దానికి తోడు అప్పటి రోబోకు అప్ డేట్ అయ్యిన వెర్షన్ అంటూ ‘2.0’ అని టైటిల్ పెట్టారు. కాబట్టి ఈ సినిమాను అంత తక్కువ అంచనా వేయలేం. ఈ విధమైన అంచనాలు..ఆలోచనలు మధ్య వచ్చిన ఈ చిత్రం తన స్దాయిని నిలబెట్టుకుందా…కథేంటి, ఏ స్దాయి విజయం సాధిస్తుంది వంటి విషయాలు రివ్యూ లో తెలుసుకుందాం.
కథేంటి
ఓ రోజు జనాలంతా సెల్ ఫోన్స్ తో మంచి బిజీగా ఉన్న టైమ్ లో …వాళ్ల చేతుల్లోంచి అవి గాల్లోకి ఎగరటం మొదలెడతాయి. ఇదేదో ప్రీ గా వస్తున్న మ్యాజిక్ అన్నట్లు జనాలు చూసేలోగా తమ సెల్స్ పూర్తిగా మాయమైపోయాయని అర్దమవుతుంది. ఇదెక్కడి గోల..ఇల్లు పోయినా ఫర్వాలేదు..ఆరోగ్యం పోయినా ఫర్వాలేదు..మరొకటి జరిగినా ఫరవాలేదు..కానీ సెల్ ఫోన్స్ లేకపోతే జీవితం ఎలా గడుస్తుంది. అందరికీ ఇదే టెన్షన్.దాంతో వాళ్లంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిపోర్ట్ ఇవ్వటం..అప్పటికే టెలికమ్యూనికేషన్ మినిస్టర్ ఫోన్ సైతం మాయమైందని తేలటం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం పై ప్రెజర్ పెరుగుతుంది. సైన్యాన్ని దింపినా ఫలితం ఉండదు.
దాంతో పెద్దవాళ్లంతా లాండ్ లైన్ లో డిస్కస్ చేసుకుని…హోం మినిస్టర్..దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ వశీకరణ్(రజనీకాంత్)ని పిలిపిస్తారు. ఆయన తన హ్యుమనాయిడ్ లేడీ రోబోట్ వెన్నెల(ఎమీజాక్సన్)తో కలిసి అసలేం జరిగిందనేది ట్రాక్ చెయ్యటం మొదలెడతాడు. అప్పుడు ఆయనకు ఓ నెగిటివ్ ఫోర్స్ …సెల్ ఫోన్స్ ని మాయం చేస్తుందని అర్దమవుతుంది. అది ఓ పక్షిరాజు (అక్షయ్ కుమార్) అని తెలుస్తుంది. దాన్ని ఆపాలంటే మానవ శక్తి సరిపోదు అని…తన పాత ఇన్వెక్షన్ ..చిట్టిని రంగంలోకి దింపుదామనుకుంటాడు.
కానీ ఈ లోగా…సిటీలో పెద్ద సెల్‌ఫోన్ షాప్ ఓనర్, సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్, టెక్నాలజీ మినిష్టర్ మర్డరైపోతారు. ఇంకెన్ని మర్డర్స్ జరుగుతాయో అనే భయంతో… చిట్టిని రీలోడ్ చేసి రంగంలోకి దించుతాడు. చిట్టి పక్షిరాజుని ఏం చేస్తుంది…అసలు పక్షిరాజు ఎవరు..అతనికి ఈ సెల్ ఫోన్స్ మాయం చేయటంతో కలిసి వచ్చేదేమిటి, వశీకరణ్ అతన్ని ఎలా కంట్రోలు చేయగలిగాడు వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
ఈ సినిమాకు గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్దలో పావు వంతు కూడా స్క్రీన్ ప్లే పై పెట్టలేదని స్పష్టంగా అర్దమవుతుంది. సినిమా ప్రారంభమే కథలోకి వెళ్లిపోయినా…అది కాస్సేపే..ఆ తర్వాత కథ కదలదు. ఫలానా వాళ్లు సెల్ పోన్స్ ఎత్తుకుపోతున్నారు..ఫలానా సైంటిస్ట్ ..దాన్ని ఆపటానికి రంగంలోకి దిగారనేది ఇంటర్వెల్ కు వచ్చేటప్పుటికి కథ లో సెట్ చేసారు. అయితే సెంకండాఫ్ రొటిన్ గా అసలు సెల్ ఫోన్స్ ఎందుకు ఎత్తుకుపోతున్నాడు అనే ప్లాష్ బ్యాక్ చూపెట్టడం..ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ లోకి వెళ్లిపోవటం శంకర్ స్దాయి దర్శకుడు నుంచి అసలు ఆశించటం. అందులోనూ అన్ని కోట్లు పెట్టిన ప్రాజెక్టు నుంచి అయితే మరీను.
కథకు ఇదే సమస్య
ఈ సినిమాలో విలన్ ఎవరనేది స్ఫష్టంగా చెప్పలేకపోయాడు. అపరిచితుడు, జెంటిల్ మెన్ లేదా భారతీయడు చిత్రాల్లో హీరో చేసేవి మర్డర్స్ అయినా అవి ఓ పర్పస్ కోసం కావటంతో అతని పక్షాన మనం ఉంటాం. ఇక్కడ అక్షయ్ కుమార్ ఓ మంచి కోసం పోరాడుతూంటాడు. అతని పక్షానే మనం ఉండాలనిపిస్తుంది. కానీ ప్రక్కనుంచి రజనీకాంత్ నేను కదా హీరోని..అతని విలన్ అని ఎస్టాబ్లిష్ చేస్తూంటాడు. కానీ మనకు రజనీకాంత్ నెగిటివ్ ఫోర్స్ లా, అక్షయ్ హీరోలా అనిపించాడంటే అది మన తప్పు కాదు..డైరక్టర్ రాసుకున్న కథ,కథనం సమస్య
ట్రైలర్ మేడ్ ? టైలర్ మేడ్?
ఇది ట్రైలర్ కు సరిపడ ఓ స్టోరీ లైన్ అనుకుని దానిచుట్టూ అల్లిన కథనం. అది మనకు ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. ఆ ట్రైలర్ లో కంటెంట్ తప్ప తెరమీద పెద్దగా ఏమీ కనపడదు. దాంతో మనకు కథ ముందే తెలిసిపోయి సినిమాలో సస్పెన్స్ నడుపుతున్నా…విషయం అర్దమవటంతో ఆ థ్రిల్ ఏమీ అనిపించదు. కనిపించదు.
చిట్టి వెర్శస్ అక్షయ్
వాస్తవానికి ఈ సినిమాకు వచ్చేవాళ్లలో చాలా మంది చిట్టి మళ్లీ వస్తాడు..అని ఎదురుచూస్తారు. ఆ సీన్ రాగానే జనం విజిల్స్ సైతం వేసారు. కానీ చిట్టి ఈ సారి మరమనిషిలాగే బిహేవ్ చేసాడు. అతను ఎమోషన్స్ కు మనం కనెక్ట్ కాము. అయితే 3.0 అంటూ చిట్టి క్రియోట్ చేసే రోబో మాత్రం బాగుంది. దానికే జనం కనెక్ట్ అయ్యారు.
ఎవరెలా చేసారు..
రజనీకాంత్,అక్షయ్ పోటీపడి చేసారనే చెప్పాలి. ముఖ్యంగా అక్షయ్ తన హీరోయిజం లుక్ వదిలి ..చిత్రమైన క్రోమ్యాన్ గా కనపడటం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ ఆ మేకప్ కు, బిల్డప్ కు సరపడ సీన్స్ లేవు. కేవలం అక్షయ్ ఎంతసేపూ…సెల్ ఫోన్స్ ఎత్తుకుపోవటమే జీవితాశయంగా తిరుగుతూంటాడు. ఇక హీరోయిన్ అనకూడదమో ..అమీజాక్సన్ పాత్ర ..చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆమె ఈ సినిమాలో రోబో. మిగతావాళ్లు ఓకే
టెక్నికల్ బ్రిలియన్స్…
ఈ సినిమా టెక్నికల్ గా చాలా హై క్వాలిటీలో ఉంది. అయితే ఆ రేంజి బడ్జెట్ కు ఈ మాత్రం గ్రాఫిక్స్ ఉండటంలో వింతేమీ లేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎఆర్ రహమాన్ ఈ మధ్య హిట్స్ ఇవ్వటం లేదనుకున్నారో ఏమో కానీ ఎండ్ టైటిల్స్ తప్ప ఎక్కడా పాటలు లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మిగతా విభాగాలు కూడా మంచి అవుట్ పుట్ ఇచ్చాయి.
రోబో కు 2.0 కు అప్ గ్రేడ్ అయిన మ్యాటరేంటి
అప్ గ్రేడ్ అయిన మ్యాటర్ లేదు కానీ…ఆ సినిమాకన్నా డౌన్ గ్రేడ్ అయ్యారని మాత్రం అర్దమవుతుంది. ఫన్ కానీ, పాటలు కానీ ఏమి ఉండదు. ఎంతసేపూ అక్షయ్ కుమార్ రెక్కలు విప్పార్చుకుంటూ తిరిగే పక్షిరాజా ని చూపెట్టడమే సరిపోయింది.
హిచ్ కాక్ ని ఫాలో అయ్యారా
ప్రముఖ బ్రిటన్ దర్శకుడు,సస్పెన్స్ మాస్టర్ ..కెరీర్ లో గొప్పగా చెప్పుకునే The Birds (1963)ఈ సినిమా చూస్తూంటే గుర్తుకు రావటం యధాలాపమేనా?
చూడచ్చా
ఎక్కువ ఎక్సెపెక్ట్ చేయకుండా వెళితే…సినిమా బాగుందనిపిస్తుంది. సందేశం బుర్రకు ఎక్కించుకుంటే శభాష్ అనిపిస్తుంది. లేకుంటే మన టైమ్, డబ్బు ఫసక్ అనిపిస్తుంది.
రేటింగ్ : 2.75/5