30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ రివ్యూ

Published On: January 29, 2021   |   Posted By:

30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ రివ్యూ

ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా రివ్యూ

Rating : 2/5

ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా ఒకటే పాట…‘నీలి నీలి ఆకాశం…’. ఈ పాట ఏ సినిమాలోది అని తెలుసుకుని ప్రదీప్ హీరోగా నటిస్తున్నాడా అని ఆశ్చర్యపోయి..ఈ సినిమా చూడాలని ఫిక్సైపోయారు. ఈలోగా ట్రైలర్ వచ్చింది. పురన్జన్మల చుట్టూ తిరిగే కథ అని కొంచెం హింట్ ఇచ్చింది. ఇంకేం చాలా రోజులైంది మగధీర టైప్ కాన్సెప్టులు చూసి అని మరింత ఉత్సాహపడ్డారు సిని లవర్స్. మరి వారి ఉత్సాహాన్ని సినిమా ఏ స్దాయి వరకూ ముందుకు తీసుకెళ్లింది. సినిమాలో ఆ పాట తప్పించి ఇంకేమైనా హైలెట్స్ ఉన్నాయా…అసలు కథేంటి…యాంకర్ ప్రదీప్ ..ఇంక హీరోగా కొనసాగేందుకు ఈ సినిమా దోహదం చేస్తుందా..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

గురువు గారని ఓ శిష్యుడు అస‌లైన ప్రేమంటే ఏమిటి స్వామీ? అని అడ‌గగా సినిమా ప్రారంభం అవుతుంది. అప్పుడా గురువు.. ‘దీపికా ప‌దుకుణె నిన్ను ప్రేమించిందనుకో అది ప్రేమ‌, అదే నువ్వు ప్రేమించావంటే అది కామం’ అని చెప్తాడు. ఈ గురువు చెప్పిన సమాధానం అర్దమైతే ఈ సినిమా కథ మీకు అర్దమవుతుంది. అప్పట్లో అంటే 1947లో అరుకులో ఉంటే అటవికుల్లో ఓ జంట (ప్రదీప్,అమృత). తెగ ప్రేమించుకుంటారు. అయితే వారి ప్రేమ కథ..అపార్డాలతో ముగిసిపోతుంది. వాళ్లు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇదిగో ఇప్పటికాలానికి వస్తే వాళ్లిద్దరూ మళ్లీ పుడతారు. ప్రక్క ప్రక్క ఇళ్లలో ఉంటారు. ఒకే కాలేజీలో చదువుతూంటారు. అయితే అప్పట్లోలాగ ప్రేమలో ఉండరు. ఇప్పుడు ఎప్పుడు చూసినా చిన్న చిన్న విషయాలకే తగువులు పడుతూంటారు. ఈలోగా ఈ జంట తన ప్రెండ్స్ తో కలిసి అరుకు వెళ్తారు. అక్కడ గత జన్మలో వాళ్లు తిరిగిన ఓ గుడి దగ్గరకు చేరుతారు. అక్కడ వాళ్ల జీవితాల్లో ఓ మిరాకిల్ జరుగుతుంది. ఇద్దరి ఆత్మలు ఎక్సేంజ్ అవుతాయి. అక్కడ నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు ఏమిటి..పునర్జన్మ, ఆత్మల మార్పిడి వలన వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పేమిటి..వారి ప్రేమ కథ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ ..

పునర్జన్మ కథలు భాక్సాఫీస్ కు ఎప్పుడూ ప్రియమైనవే.పునర్జన్మ!  ఈ పునర్జన్మ కాన్సెప్టు అంటే అనాది నుంచీ మానవ జాతికి ఓ ఆసక్తి.మన  జ్ఞానాన్ని సవాల్ చేస్తున్న ఓ అద్భుతం. మనిషి ప్రగాఢంగా వాంఛిస్తున్న ఓ సంభవం. ఓ మార్మిక రహస్యం..అందుకే పునర్జన్మ సినిమాలకు జనం పోటెత్తిపోయేది. అందులోనూ పునర్జన్మ కథ అంటే ఎక్కువ మనకు లవ్ స్టోరీలే. మూగ మనసులు అయినా, దాని ప్రేరణతో వచ్చిన జానకి రాముడు అయినా, బాలయ్య హీరోగా వచ్చిన ‘ఆత్మబలం’ , ప్రాణం, అరుంధతి,  మగధీర,ఈగ ఇలా ఎన్ని చెప్పుకున్నా..వాటికంటూ గుర్తింపు తెచ్చుకున్న సినిమాలే. దాంతో పునర్జన్మ కాన్సెప్టు అనగానే ఉత్సాహం వచ్చేస్తుంది సినిమా వాళ్లకు.  అయితే వాటిని సాధ్యమైనంత నీటుగా, ఎక్కువ కన్ఫూజన్ లేకుండా ఇంపాక్ట్ పడేలా చెప్పాలి. అదే ఇక్కడ కొరవడింది. పునర్జమ్మకు ఆత్మకు మారటం అనే అంశం కలిపి ప్రదీప్ ని ఒప్పించారు కానీ ..భాక్సాఫీస్ ని మెప్పించలేకపోయారు.  రెండుంపావు గంటల పాటు దీన్ని సాగ తీసారు. ఆత్మల ఎక్సేంజ్ కథని ఎంగేజింగ్ గా చెప్పలేకపోయారు. కొన్ని కొన్ని ఎమోషన్స్ అక్కడక్కడ పండినప్పటికీ ఓవరాల్ గా బోర్ అనే పెద్ద ఎమోషన్ మన మనస్సులో చివరకి మిగులుతుంది. ప్రదీప్ హీరోగా వంక పెట్టలేం కానీ… రైటింగ్ వీక్ గా ఉండటంతో సినిమాకు రైట్ హ్యాండ్ కోల్పోయినట్లైంది. ఫైనల్ గా సినిమాలో పాట మాత్రమే బాగుంది మిగతా అంతా రొటీన్ రొట్టలా ఉంది.
 
టెక్నికల్ గా…

ప్రదీప్‌ మాచిరాజు టీవీల్లో చేసినట్లు ఇక్కడా చేసేసారు. అంతేగానీ సినిమాకు హీరోగా చేస్తున్నాము అన్నట్లు గా లేదు. దాంతో పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు. అయితే ఫన్, ఎమోషన్స్ వంటివి ఎక్సప్రెస్ చేయటంలో పరిణితి కనపడింది. ఇక హీరోయిన్ అమృత అయ్యర్‌ కథకు బాగా ప్లస్ అయ్యింది.  శివన్నారాయ‌ణ‌, హేమ‌, పోసాని , వైవా హ‌ర్ష‌, భ‌ద్రం త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. టెక్నికల్ గా సినిమా మంచి స్టాడర్డ్స్ లోనే ఉంది. ఇప్పటికే హిట్టైన అనూప్ పాట గురించి ప్ర్తత్యేకంగా చెప్పుకునేదేముంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు. శివేంద్ర కెమెరా వర్క్ చాలా బాగున్నాయి.  నిర్మాణ విలువ‌లు అద్బుతం అనలేం కానీ బాగున్నాయి. . దర్శకుడుగా మున్నా కథ ఎంపికలో తడబడ్డాడు కానీ లేకపోతే మంచి మార్కులే వేయించుకునేవాడు.  

చూడచ్చా?

ఓటీటిలో వచ్చినప్పుడో టీవీలో వచ్చినప్పుడో ట్రై చేయచ్చు..పనిగట్టుకుని థియోటర్ కు వెళ్ళటం దండగనిపిస్తుంది.
  
తెర వెనక..ముందు

నటీనటులు : ప్రదీప్‌ మాచిరాజు, అమృతా అయ్యర్‌, శుభలేఖ సుధాకర్‌, పోసాని కృష్ణమురళి, హేమ, వైవా హర్ష హైపర్‌ ఆది తదితరులు
నిర్మాణ సంస్థ :  ఎస్వీ ప్రొడక్షన్‌
నిర్మాత :  ఎస్వీ బాబు
దర్శకత్వం : మున్నా ధూళిపూడి
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ :  దాశరథి శివేంద్ర
రన్ టైమ్: 2 గంటల 23 నిముషాలు
విడుదల తేది : జనవరి 29, 2021