30 రోజుల పాటు ‘ఏసీకే’ ‘టింకిల్’ యాప్స్ ఉచిత యాక్సెస్

Published On: March 20, 2020   |   Posted By:

30 రోజుల పాటు ‘ఏసీకే’ ‘టింకిల్’ యాప్స్ ఉచిత యాక్సెస్

30 రోజుల పాటు ‘ఏసీకే’, ‘టింకిల్’ యాప్స్ ఉచిత యాక్సెస్ ఆఫ‌ర్ చేసిన రానా

క‌రోనా వైర‌స్ మీద నెల‌కొన్న భ‌యాందోళ‌న‌ల కార‌ణంగా సినిమా స‌హా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీ మొత్తం కార్య‌క‌లాపాల్ని నిలిపి వేయ‌డంతో, ప్ర‌జ‌లు ఇళ్ల‌ల్లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు. అనేక‌మంది సెల‌బ్రిటీలు క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాకుండా, అది సోక‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి సూచ‌న‌లు చేస్తూ, ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావ‌డానికి కృషి చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే త‌న ‘అర‌ణ్య’ చిత్రం విడుద‌ల‌ను వాయిదా వేసిన హ్యాండ్‌స‌మ్ హీరో రానా ద‌గ్గుబాటి, సామాజిక దూరం పాటిస్తూ వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా చూడాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ఒక చ‌క్క‌ని కానుక‌ను ఆఫ‌ర్ చేశారు. ఒక నెల రోజుల పాటు ఏసీకే (అమ‌ర్ చిత్ర క‌థ‌), టింకిల్ యాప్స్‌లోని కంటెంట్‌ను ఉచితంగా తిల‌కించ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు. ఆ రెండు యాప్స్ ఆయ‌న‌వే.

“ఏసీకే విష‌యంలో ఈ నెల‌లో ఆన్‌లైన్ స‌భ్య‌త్వాల‌ను మొద‌లు పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాం. కాబ‌ట్టి ఏసీకే, టింకిల్ యాప్స్‌లోని అద్భుత‌మైన కంటెంట్‌ను పిల్ల‌లు, పెద్ద‌లు కూడా ఉచితంగా చూసుకోవ‌చ్చు. వాటిలో త‌మ‌కు ఇష్ట‌మైన దాన్ని చ‌దువుకోవ‌చ్చు. అందులోనివ‌న్నీ మ‌న ప్రాంతం క‌థ‌లు. అవి చ‌దివితే మ‌న దేశం, మ‌న దేవుళ్లు, రాజులు, సంస్కృతి గురించి తెలుస్తుంది. చ‌క్క‌ని బొమ్మ‌లు, క‌థ‌ల‌తో అవి అల‌రిస్తాయి. మ‌న గ‌తం గురించి తెలుసుకొని, భ‌విష్య‌త్తును నిర్మించుకోవ‌డానికి నేటి త‌రానికి ఇది చాలా ముఖ్యం” అని రానా చెప్పారు.