35 Chinna Katha Kaadu Movie Review
35 చిన్న కథ కాదు మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
నటీనటులు :
నివేతా థామస్ ,ప్రియదర్శి ,గౌతమి, భాగ్యరాజ్,విశ్వదేవ్,క్రిష్ణ తేజ ,అభయ్,అనన్య తదితరులు ..
సాంకేతిక వర్గం:
సంగీతం : వివేక్ సాగర్ ,సమర్పణ : రానా దగ్గుబాటి,నిర్మాతలు: సృజన్,సిద్ధార్థ్ రాళ్ళపల్లి ,రచన దర్శకత్వం : నంద కిషోర్ ఈమని, సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి, ఎడిటర్: టి సి ప్రసన్న.
35 చిన్న కథ కాదు సినిమా టీజర్ ,ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమా పై ప్రేక్షకులకి ఆసక్తిని కలిగించాయి. దాంతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ నుండి రానా దగ్గుబాటి సమర్పిస్తుండటంతో మరింత బజ్ క్రియేట్ అయింది.
కథ :
తిరుపతి నేపధ్యంలో పైన తిరుమల దేవస్థానం ( ఏడుకొండలవాడు ),కింద తిరుపతి ఆ టౌన్ లో ప్రసాద్ ( రాచకొండ విశ్వదేవ్ ) ఆర్టీసి బస్ కండక్టర్ గా ఉద్యొగం చేస్తుంటాడు.భార్య సరస్వతి ( నివేతా థామస్ ) గృహిణి గా , ఇద్దరు పిల్లలు అరుణ్ ,వరుణ్ ఒకరు సిక్స్త్ క్లాస్ ,ఇంకొకరు ఫిఫ్త్ క్లాస్ చదువుతుంటారు. అదే ప్రపంచంగా అందమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా వాళ్ళ మధ్య ప్రేమానురాగాలతో కథ మొదలవుతుంది.
ఆరవ తరగతి చదువుతున్న పెద్ద కొడుకు అరుణ్ కి లెక్కలు సబ్జెక్టు అంటే అస్సలు అర్ధంకాని ,అంతుపట్టని ఎన్నోప్రశ్నలు వుంటాయి . అందుకే అందరి స్టూడెంట్స్ లా బట్టీ పట్టి చదవడం ఇష్టం వుండదు. ఎందుకంటే అతనికి వచ్చిన సందేహాల్ని ఏ టీచర్ సరైన సమాధానాలు చెప్పకపోవటం. లెక్కల్లో ఉండే ఫండమెంటల్స్, బేసిక్స్‌ను ప్రశ్నిస్తుంటాడు. సున్నాకే విలువ లేనప్పుడు.. దాని పక్కన ఒకటి పెడితే.. దాని విలువ ఎలా మారిపోతుంది?.. సున్నా అంటేనే ఏమీ లేనప్పుడు.. దాని కంటే తక్కువ మైనస్ అని ఎలా అంటారు? అని ఇలా బేసిక్స్ ప్రశ్నలు, ఆలోచనలు, అనుమానాలతో ఉంటాడు. ఈ ప్రశ్నల్ని ఏ మాస్టర్ కూడా అర్థం చేసుకోడు. అరుణ్ తెలివి తేటలపై తల్లి సరస్వతికి అపారనమ్మకం. స్కూల్‌లో కొత్తగా వచ్చిన లెక్కల మాస్టర్ చాణక్య (ప్రియదర్శి) అరుణ్‌ను జీరో అని గేలి చేస్తుంటాడు. జీరో అని పిలవడం మొదలు పెడుతాడు. చాణక్య రాకతో అరుణ్ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? అరుణ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అరుణ్‌ను స్కూల్ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారు? అరుణ్‌కు లెక్కల్లో ఉండే ఆ ప్రశ్నలు, అనుమానాల్ని తల్లి ఎలా నివృత్తి చేసి కనీసం 35 మార్కులు తెచ్చుకునేలా ఎలా ప్రిపేర్ చేయించింది? చివరకు అరుణ్ ఏం చేశాడు? అన్నదే కథ.
సమీక్ష :
35 చిన్న కథ కాదు.. నిజంగానే ఇది చిన్న కథ కాదు.. చెప్పడానికి, చూడటానికి చాలా చిన్నగా, సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ చాలా లోతుగా ఉంటుంది. మామూలుగానే పిల్లలు వేసే ప్రశ్నలకు పెద్దలు సమాధానాలు చెప్పలేరు. వారి ప్రశ్నలు చాలా సింపుల్‌గా, మూలాలకు దగ్గరగా, బేసిక్స్‌ను ప్రశ్నించేలా ఉంటాయి. అయితే పిల్లల ప్రశ్నలకు చిరాకు పడకుండా.. వాళ్లకి ఏదో ఒక సమాధానం చెబుతూ ఉంటేనే.. వాళ్లు అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.. నేర్చుకుంటూ ఉంటారు అని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు.
లెక్కల్లో అందరికీ అనుమానాలు ఉంటాయి.. కానీ మా వాడికి లెక్కల మీదే అనుమానం సర్ అని చెప్పే డైలాగ్‌తో ఈ మూవీ సారాన్ని అక్కడే చూపించాడు. ఇది రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ చిత్రం అయితే కాదు. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని, ఓపిగ్గా చూస్తారని కూడా చెప్పలేం. ఓ డిఫరెంట్ సినిమాను.. మన జీవితాన్ని కాస్త నిదానంగా, నెమ్మదిగా చూడాలని అనుకునే వారికి ఈ మూవీ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ‘పిల్లలకు తల్లి ఒడే.. మొదటి బడి’ అన్న డైలాగ్ బాగుంటుంది. తల్లి ఎంత నేర్పుగా, ఓర్పుగా పిల్లలకు చెబితే.. అంత గొప్పగా తయారవుతారని చూపించాడు. సున్నా పక్కన ఒకటి పెడితే.. ఎందుకు పది అవుతుంది.. 9 కంటే దానికి ఎందుకు విలువ ఎక్కువ అనే అరుణ్ అనుమానానికి ప్రేక్షకుడు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేడు. కానీ దాన్ని వివరించిన తీరు, అర్థమయ్యేలా చెప్పిన తీరు.. ఆ సీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. లెక్కల్ని లెక్కల్లా కాకుండా.. సింపుల్‌గా, అర్థమయ్యేలా చెప్పాలన్న కాన్సెప్ట్ బాగుంది.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా అరుణ్ ప్రశ్నలు, స్కూల్‌లో మాస్టర్‌ని ఆట పట్టించే సీన్లు.. ఇంట్లో వేసే ప్రశ్నలు.. తల్లి చెప్పే సమాధానాలు.. ఇలా అన్నీ బాగానే నడుస్తాయి. ఇంటర్వెల్‌కి ఈ సినిమా కాస్త ఎమోషనల్‌గా మారుతుంది. సెకండాఫ్ సీరియస్ మోడ్‌లోనే సాగుతుంది. క్లైమాక్స్ ఊహించినట్టుగానే ఉంటుంది. కానీ కాస్త ఎమోషనల్ టచ్‌గా ఉంటుంది. ఈ మూవీ చాలా నిదానంగా, స్లోగా సాగుతుంది. అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవచ్చు. ఓటీటీలో ఈ మూవీని ఎక్కువగా ఆదరిస్తారని చెప్పొచ్చు.
నివేదా థామస్ సగటు మిడిల్ క్లాస్ తల్లిగా కనిపించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. నివేదా లుక్స్, యాక్టింట్ ఇలా అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. కొడుకు కోసం తాపత్రయ పడే తల్లిగా, భర్తను ప్రేమించే భార్యగా.. నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించే మహిళగా ఇలా అన్ని రకాలుగా నివేదా మెప్పించింది. విశ్వదేవ్ పాత్ర కూడా ఎంతో నేచురల్‌గా ఉంటుంది. ముఖ్యంగా యాసను పలకించిన తీరుకి ఇద్దరికీ వంద మార్కులు వేయొచ్చు. చైల్డ్ ఆర్టిస్టులంతా కూడా బాగా నటించారు. ప్రిన్సిపాల్‌గా భాగ్యరాజ్, లెక్కల మాస్టరుగా ప్రియదర్శి.. ప్రత్యేక పాత్రలో గౌతమి ఇలా అందరూ చక్కగా నటించారు.
సాంకేతికతంగా ఈ మూవీ బాగుంటుంది. వివేక్ సాగర్ అందించిన ఆహ్లాదకరమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. కొన్ని చోట్ల నేపధ్య సంగీతం కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇంకొన్ని సార్లు మనసుకు హాయిని ఇస్తుంది. కెమెరా వర్క్ ఎంతో సహజంగా అనిపిస్తుంది. చాలా చోట్ల మాటలు ఎంతో ఆలోచింపజేసేలా ఉంటాయి. నిర్మాణ విలువలు గొప్పగా ఉంటాయి. రానా మరోసారి తన టేస్ట్‌ను ఈ మూవీతో చూపించాడు.
35 చిన్న కథ కాదు.. నిజంగానే ఇది చిన్న కథ అయితే కాదు.. మంచి కథ.. ఆలోచింపజేసే కథ.. తల్లిదండ్రులకు తమ పిల్లలతో ఎలా ఉండాలో చూపించే, చెప్పే కథ. పిల్లల ప్రశ్నల ప్రవాహానికి అడ్డుకట్ట వేయకూడదని చెప్పే కథ.
ప్లస్ పాయింట్స్ :
1.కథ,నేపధ్యం 2. నటీనటులు , వాళ్ళ పెర్ఫార్మన్స్ 3.నేపధ్య సంగీతం,4.దర్శకత్వం ,5. సంభాషణలు,భావోద్వేగ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్ : నెమ్మదిగా సాగే కథనం.
ఒక్క మాటలో సినిమా: కేవలం 35 పాస్ మార్కులతో కాకుండా ఫస్ట్ క్లాస్ లో పాసయింది.