సర్దార్ మూవీ  రివ్యూ

Published On: October 21, 2022   |   Posted By:
సర్దార్ మూవీ  రివ్యూ
image.png
  కార్తీ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ రివ్యూ

Emotional Engagement Emoji

👍

విశాల్ తో ‘అభిమన్యుడు’ వంటి హిట్ కొట్టిన  పి. ఎస్. మిత్రన్ ఇక్కడ తెలుగువారికి పరిచయమే. ఆయన తాజాగా తెరకెక్కించిన  ‘సర్దార్’ సినిమాను తెలుగువారి ముందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తీసుకొచ్చింది. తండ్రీ కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ‘సర్దార్’ ఎలా ఉంది…ఈ సినిమాలో కథేంటి…కొత్త ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో తెలుసుకుందాం.

స్టోరీలైన్:

వైజాగ్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా చేస్తున్న విజయ్ ప్రకాశ్ (కార్తి) కు సోషల్ మీడియా ప్రచారం అంటే పిచ్చి. తను,డిపార్టమెంట్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండాలని కోరుకుని ఆ దిసగా ప్రయత్నాలు చేస్తూంటాడు. అందుకు అతనికో కారణం ఉంటుంది. అతని తండ్రి సర్దార్(కార్తి) ఓ దోశద్రోహి అనే ప్రచారం బయిట ఉంటుంది. అలాగే ఆ తండ్రికు దోశద్రోహి అవ్వటం వల్లనే తన తల్లి,తాత, కుటుంబం అంతా  తనను అనాధను చేసి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ క్రమంలో  తన తన తండ్రి అంటే పీకల దాకా కోపం ఉంటుంది విజయ్ కు. ఇదిలా ఉంటే దేశంలో ఓ పెద్ద కుట్రజరుగుతూంటుంది. తాగునీటిని పూర్తిగా అమ్మకానికి పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకునేందుకు చైనాతో కలిసి కుట్ర నడుస్తూంటుంది. తెలియకుండానే విజయ్ ప్రకాష్ ఆ కుట్రలోకి ఎంటర్ అవుతాడు. ఆ క్రమంలో తన తండ్రి బ్రతికే ఉన్నాడనే విషయం, ఆయన గురించిన కొన్ని నిజాలు అతనికి తెలుస్తాయి. అసలు సర్దార్ ఎవరు..అతని గతం ఏమిటి…నిజంగానే ఆయన దేశద్రోహా…తాగు నీటి కుట్రకు అతనికి సంభందం ఏమిటి…విజయ్ ప్రకాష్ ఈ కుట్రను ఎలా ఛేదించాడు. ఈ కథలో లాయర్ షాలినీ (రాశీఖన్నా) ,  సమీర (లైలా) ల పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Script Analysis:

ఈ కథ ఓ డిఫరెంట్ కోణంలో పరిచయం అవుతుంది.  సాధారణంగా దేశం కోసం పోరాడుతూ..సరిహద్దులలో ఉండే సైనికులకు ఓ గుర్తింపు ఉంటుంది. దురదృష్టవశాత్తు వారి ప్రాణాలు కోల్పోతే, ప్రభుత్వ గౌరవ మర్యాదలు వారి కుటుంబానికి ఇస్తుంది. కానీ దేశంలోనూ, దేశం కాని దేశంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే గూఢచారులకు మాత్రం ఎలాంటి గుర్తింపు ఉండదు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం కూడా వారిని ఓన్ చేసుకోవటానికి ఇష్టపడదు. అయినా దేశం కోసం గూఢచారులు పని చేస్తూనే ఉంటారు, ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూనే ఉంటారు. మరి కొందరైతే సంవత్సరాల తరబడి పరాయి దేశాల జైళ్ళలో మగ్గుతుంటారు. అలాంటి ఓ గూఢచారి కథనే పి.ఎస్. మిత్రన్ ఈ సారి ఎన్నుకున్నాడు. అదే ‘సర్దార్’లో కీలకపాయింట్. సరదాగా ఊరిలో నాటకాలు వేసే ఓ వ్యక్తి గూఢచారిగా మారి దేశం కోసం ఏం చేశాడు? బంగ్లాదేశ్ లోని జైలులో మూడు దశాబ్దాల పాటు ఎందుకు ఖైదీగా ఉన్నాడు? అనే పాయింట్ ని ప్లాష్ బ్యాక్ గా పెట్టుకుని కథను అల్లుకున్నారు.

స్టోరీ లైన్ గా చాలా కొత్తగా అనిపించే ఈ కథ..తండ్రి,కొడుకుల సెంటిమెంట్,వాళ్లు తిరిగి కలవటం అనే ఫార్మెట్ ని అనుసరించింది.  తన తండ్రిపై పడ్డ మచ్చను చెరిపేసే ‘image-cleansing’ ప్రాసెస్ కొత్తది కాకపోయినా ఓకే అనిపిస్తుంది. అలాగే ఓ సోషల్ కాజ్..ప్రజలందరికీ తాగు నీరు ప్రీగా అందాలనే ఆలోచన అద్బుతంగా ఉంటుంది. అయితే వీటిన్నటినీ కలిపే ప్రాసెస్ లోనే దర్శకుడు తడబడ్డాడు. పెట్టుబడిదారీ వ్యవస్ద డార్క్ సైడ్ చూపించాలనే తాపత్రయంలో కొన్ని తనకు అనువుగా సీన్స్ రాసుకుంటూ పోయాడు. అయితే అసలు ప్లాట్ ఏది,సబ్ ప్లాట్ ఏదనే విషయం మనకు క్లారిటీ రాదు. ప్లాష్ బ్యాక్ పెద్దదైపోవటం ఇబ్బంది కలిగిస్తుంది. ఫస్టాఫ్ నడిచినంత స్పీడుగా సెకండాఫ్ నడవదు. సెకండాఫ్ మొత్తం సర్దార్ ప్లాష్ బ్యాక్ కే కేటాయించి, క్లైమాక్స్ లోనే మొదటి క్యారక్టర్ ని తీసుకొచ్చి ఫైట్ చేయించి,కథ క్లోజ్ చేసారు.  స్క్రీన్ ప్లే విభజన లెక్కలు సరిగ్గా లేకపోవటమే ఇలా కథను దెబ్బ తీసిందనిపిస్తుంది.

టెక్నికల్ గా చూస్తే…

ఈ సినిమాలో రూబెన్ ఎడిటింగ్ చాలా డ్రాగ్ చేసి, నేరేషన్ ని చాలా ఇబ్బందిగా మార్చేసింది. ఇంట్రస్టింగ్ గా ఉండాల్సిన ఎపిసోడ్స్ మిస్ ఫైర్ అయ్యాయి. ముఖ్యంగా ప్రీ ఇంట్రవెల్ బ్లాక్ విసిగిస్తుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా ఉంది.  జీవీ ప్రకాశ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అయితే సినిమాకు పిల్లర్ గా నిలిచాయి. రాకేందు మౌళి డైలాగులు ఫెరఫెక్ట్ గా కుదిరాయి. అయితే, అనేక చోట్ల తమిళ పేర్లనే అలాగే యాజటీజ్ ఉంచేయడం ఇబ్బందికరం. డైరక్టర్ …గ్రాండియర్ గా కాన్వాస్ ఉన్న కథని తీసుకున్నాడు కానీ అంతే గ్రాండ్ గా ప్రెజెంట్ చేయటంలో తడబడ్డాడు. మేకప్,యాక్షన్ కొరియోగ్రఫీ డిపార్టమెంట్స్ బాగా వర్క్ చేసాయి.  2 గంటల 46 నిముషాల లెంగ్త్ తో సర్దార్ ఫైనల్ కట్ ఇచ్చిన డైరెక్టర్ మిత్రన్ సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే సర్దార్ ఇంపాక్ట్ ఇంకో విధంగా ఉండేది.

ఫెరఫార్మెన్స్ ల విషయానికి వస్తే …పోలీస్ ఆఫీసర్ విజయ్ ప్రకాశ్ గా, అతని తండ్రి సర్దార్  గా కార్తీ అదరకొట్టాడు.  అరవై యేళ్ళ సర్దార్ గాకార్తి ఫెరఫెక్ట్ మేకప్ బాగుంది. సర్దార్ జైలు నుండి ఎస్కేప్ అయ్యే సీన్స్, క్లయిమాక్స్ ఫైటింగ్ వర్కవుట్ అయ్యాయి. రాశిఖన్నా లాయర్ పాత్రలో జస్ట్ ఓకే.  మలయాళ నటి రాజీష విజయన్.. సహజంగా చేసుకుంటూ పోయింది.గ్యాప్ తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చిన  లైలా పాత్ర బాగుంది. లైలా కొడుకుగా మాస్టర్ రిత్విక్ చాలా బాగా నటించాడు.  ‘లైగర్’లో చేసిన చుంకీ పాండే.. ఇందులో పూర్తి స్థాయి విలన్ గా చేశాడు.

చూడచ్చా

కార్తి అభిమానులకే కాకుండా, థ్రిల్లర్ అండ్ యాక్షన్ జానర్ మూవీస్ ను ఇష్టపడే వారికీ ‘సర్దార్’ నచ్చుతుంది.

సంస్థ‌: ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్;
నటీనటులు: కార్తీ, రాశి ఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్, యోగ్ జాపి, నిమ్మి, బాలాజీ శక్తివేల్, ఎలవరసు  తదితరులు;
సంగీతం: జివి ప్రకాష్ కుమార్;
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియమ్స్;
కూర్పు: రూబెన్;
పోరాటాలు: దిలీప్ సుబ్బరాయన్;
క‌ళ‌: కదిర్;
Runtime: 166 Minutes
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్;
దర్శకత్వం: పిఎస్ మిత్రన్;
విడుద‌ల‌: 21-10-2022